Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అయిదో గోడ'' కల్పనా రెంటాల కథా సంకలనం. ఇందులో మొత్తం 15 కథలున్నాయి. అన్నీ స్త్రీ కోణంలో రాయబడిన కథలు. స్త్రీ జీవితంలో ఎదుర్కొంటున్న వివక్ష, స్త్రీ జీవితంలోని అంతర్మధనం, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి స్త్రీ చేయవలసిన, చేస్తున్న, చేయదగ్గ పోరాటాన్ని స్త్రీ కోణంలో విశ్లేషించిన కథలివి. ఈ కథలలో కామన్ పాయింట్ కథా వాతావరణం అమెరికాది. పాత్రలు భారతీయ స్త్రీలే కాని ప్రవాసంలో జీవిస్తున్న పాత్రలు. కాని సమస్యలన్నీ తరతరాలుగా స్త్రీలు ఎదుర్కుంటూన్నవే. అయితే కొత్త కోణంలో ఆలోచించమని ప్రేరేపించే కథలివి. తమ కోణంలోంచి సమస్యను చూడమని చెప్తాయి పాత్రలన్నీ. అంటే ఆధునిక స్త్రీ కోణంలో స్త్రీ జీవితాన్ని, జీవన మార్గాన్ని ఆవిష్కరించిన కథలు ఇవి.
సష్టి అనే భారతీయ యువతి ఒంటరిగా తనను తాను తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం ''అయిదు శాజరాక్ల తర్వాత'' అన్న మొదటి కథలో చూస్తాం. కొన్నాళ్ళు ప్రేమించి కలిసి ఉన్న ప్రియుడు లావుగా ఉన్నావని ప్రిజిడ్గా ఉన్నావని అవమానించి బంధం తెంపుకునిపోతే ఆ బాధతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ లోగన్ అనే వ్యక్తితో సంభాషిస్తూ, కాసేపు ఎప్పుడూ తానింతకు ముందు గడపని జీవితాన్ని ఆస్వాదిస్తూ తనను తాను తెలుసుకునే ఆమె ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. హరికేన్ విధ్వంసాన్ని అనుభవించిన ఊరులో కథ నడిపించి నిన్న, రేపు కన్నా నేటిలో జీవించడమే ఉత్తమమైన పని అనే సందేశాన్ని వినిపిస్తుంది. రేప్ జరిగిన తరువాత రేప్ విక్టిం తనకు న్యాయం జరగడం కోసం వ్యవస్థతో పోరాడాలని నిశ్చయించుకుంటుంది ''క్రైమ్ సీన్'' అన్న కథలో. ఎన్ని ప్రయాసలకైనా ఓర్చుకుని కోర్టుకు వెళ్ళాలని ఆమె నిశ్చయించుకోవడం, ఆమెకు బాసటగా తల్లి, అన్న నిలవడం కథ. తండ్రి సగటు భారతీయుడిగా పరువు గురించి భయపడడం కనిపిస్తుంది. కాని తండ్రి భయాన్ని ఈ కుటుంబ ఐక్యత ఓడిస్తుంది.
భర్త చనిపోయిన తరువాత తోడు కావాలి అని పేపర్లో ప్రకటించిన ఓ స్త్రీ కథ ''అయిదో గోడ''. కథలో వచ్చే మరో కథగా ఇది సాగుతుంది. శ్రీవిద్య అనే ఒక రచయిత్రి పాత్రను కల్పన సష్టించి ఆమెతో ఈ కథ రాయిస్తారు. స్త్రీ వాద దష్టి కోణంలో కథలు రాసే రచయిత్రులు కూడా కొన్ని సరిహద్దులలో నిలబడే సమస్యను చూస్తారని, సమాజం నిర్దేశించిన నియమాలకు వాళ్ళే తెలియకుండా లోబడిపోయి ఉంటారని చెప్పిన కథ ఇది. మనకు మనం ఏర్పరుచుకునే గోడలను చూసుకొమ్మని చెప్పిన కథ ఇది. స్త్రీ వాదాన్ని ప్రస్తావించే రచయిత్రులకిచ్చే సందేశంగా కూడా తీసుకోవచ్చు ఈ కథను. తన పిల్లలు అన్నిటిలో ముందుండాలి అని తపించిపోయిన ఒక తల్లి మన మూలాలను పిల్లలకు ఎరుక పరచడమే నిజమైన విజయం అని తెలుసుకున్న కథ 'హోమ్ రన్'. మారిటల్ రేప్ని ఏండ్లుగా భరిస్తున్న మరో స్త్రీ కథ 'స్లీపింగ్ పిల్'. ఆమె శరీరం గురించి ఏ మాత్రం ఆలోచించని భర్త ఆమెతో సెక్స్ ను తన హక్కుగా భావించడం, అతని అధికారం కింద ఆమె ప్రతి దినం నలిగిపోవడం ఎందరో స్త్రీల జీవితానికి ప్రతిబింబం.
ఆఫీసులో పని చేస్తున్న తోటి స్త్రీల పర్సనల్ జీవితాలలోకి తొంగి చూస్తూ నిరంతం అశాంతికి గురయ్యే ఉద్యోగినుల కథ 'ఆ ముగ్గురూ'. ఇతరుల జీవిత కథలపై అనవసర ఆసక్తి కనబరిచే గుణం ప్రపంచంలో అన్నీ చోట్లా మామూలే. స్త్రీ శరీరంలో వచ్చే మార్పులను చులకనగా చూసే సమాజాన్ని ప్రశ్నించే కథ 'ఈస్ట్రోజన్ పిల్'. ప్రతి నెలసరి స్త్రీకి ఎన్ని భయాలను తీసుకొస్తుందో ఆమెకు శారీరకంగా, మానసికంగా ఎంత ఇబ్బంది కలగజేస్తుందో చెప్పిన కథ ఇది.
ట్రైన్ ప్రయాణంలో చిల్లర అడుక్కుంటున్న ఒక స్త్రీని చూసినప్పుడు సానుభూతి కన్నా అనుమానమే డామినేట్ చేస్తుంది 'టూ డాలర్స్ ప్లీజ్' అనే కథలో యువతికి. ఆమెకు సహయ పడాలని ముందు అనిపించినా, చివర్లో వద్దని నిర్ణయించుకోడం కథ ముగింపు. మనిషి మనసులోని దయ, వివేకంల మధ్య సంఘర్షణను ఈ కథలో చూస్తాం. కొందరు పసి పిల్లలు తాము ఆడుకునే బొమ్మలను తమ స్నేహితులుగా అనుకోవడం అనేది ఎక్కువగా అమెరికాలో కనిపించే విషయం. ఈ ఇమాజెనరీ స్నేహితుడిని పిల్లలు తమ జీవితంలో ఒక భాగం చేసుకోవడం అక్కడ సహజమని ఎడ్యుకేట్ చేసే కథ ''టింకూ ఇన్ టెక్సాస్''. విభిన్న సంస్కతిలో పెరిగవలసి వచ్చినప్పుడు కొన్ని సాంస్కతిక అలవాట్లను ఒప్పుకోవలసిన అవసరాన్ని వివరించిన కథ. లివింగ్ టూగెదర్లో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక యువతి కథ ''ఎండమావులు'' డొమెస్టిక్ వయొలెన్స్ను ఎదిరించి పదిహేను సంవత్సరాల తరువాత ఆ జీవితం నుండి బైట పడిన ఓ స్త్రీ కథ ''ఇట్శ్ నాట్ ఓకే''.
అమెరికా జీవితంలోని సౌకర్యాలను అనుభవిస్తూ, తల్లిని మిస్ అవుతూ అమెకు తన సౌకర్యాలను వివరిస్తూ ఉత్తరం రాస్తుంది ఓ కూతురు ''అమ్మకో ఉత్తరం'' అనేె కథలో. ఉత్తరం అంతా తన సౌకర్యవంతమైన జీవితాన్ని వివరిస్తున్నా, ఆమెలో అంతర్లీనంగా ఉన్న ఒంటరితనం బైట పడుతూ ఉంటుంది. రచయిత్రీ శైలి ఈ కథలో బావుంటుంది. పదాల అర్థం ఒకటైతే వాక్యాల నడుమ దాగిన బాధ కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఒక లెస్బియన్ కపుల్ కథ 'ది కప్లెట్'. ఒక ఇండియన్ అమ్మాయి, మెక్సికన్ అమ్మాయి కలిసి జీవిస్తుంటారు. తన సెక్ష్యువల్ ఐడేంటిటీ ఇతరులకు తెలియకూడదని ఇండియన్ అమ్మాయి అనుకోవడం ఆమెలోని ఆ ద్వంద్వాన్ని మెక్సికన్ యువతి ప్రశ్నించడం కథా వస్తువు. ఒక గే కపుల్ కథ 'సంచయనం'. తన తండ్రితో అనుబంధానికి తపించిన ఒక యువకుడు, తాను గే అని తెలుసుకుని తండ్రి తనను దూరం చేసినా, ఆయన భాద్యతను చివరి రోజుల్లో తానే తీసుకుని తాను పెంచుకున్న కొడుకికి తాత ప్రేమను పంచమని అర్ధించడం ఆలోచన కలిగిస్తుంది. అబార్షన్ ప్రయత్నం చేసి జైలు పాలైన ఒక స్త్రీ స్థితిని అర్థం చేసుకొమ్మని, ఆమె కోణంలో ఆమె పరిస్థితిని విశ్లేషించమని చెప్పిన కథ 'కోట్ హేంగర్'
రచయిత్రి శైలి ప్రతి కథలోనూ బావుంటుంది. అన్ని కథలలో చర్చించిన సమస్యలు సార్వత్రికమైనవే. కాని కథలలోని స్త్రీ పాత్రలన్నీ ప్రవాస భారతీయులవి. వారి జీవనం, అక్కడి సంస్కతి, ఈ కథలలో పెద్దగా ఇందులో రెఫ్లెక్ట్ అవ్వవు. రచయిత్రీ ఆ కోణంలో ఈ కథలను రాయలేదు. మన దేశంలోని మెట్రో నగరాలలో ఇప్పుడు అన్ని వర్గాల స్త్రీలలో కనిపించే సమస్యలే ఇవన్నీ కూడా. అక్కడి వాతావరణ నేపథ్యంలో రచయిత్రి రచన చేయడం వారికి అలవాటయిన పరిస్థితుల మధ్య కథను నడపడానికి అనుకూలత కోసం మాత్రమే అనుకోవచ్చు. ఈ కథలలో అమెరికన్ థాట్, లైఫ్, కల్చర్ పెద్దగా కనపడవు. అందుకని ప్రవాస భారతీయ కథలనే దష్టితో కాక, కేవలం స్త్రీవాద ధక్కోణంలో రాసిన కథలుగా ఇవి చూడాలి.
''అయిదో గోడ'' కథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. ''స్లీపింగ్ పిల్'' ''ఈస్ట్రోజన్ పిల్'' కథలలో ప్రాంతం ప్రస్తావనకు రాదు కాని, కథలు చదువుతుంటే ఇవి అమెరికన్ నేపథ్యంలోనివి మాత్రం కాదు అనిపిస్తుంది. ఈ మూడు కథలు కాకుండా మిగతా 12 కథలలోని పాత్రలన్నీ ప్రవాస భారతీయులే. ఇందులో ప్రస్తావించిన సమస్యలు మాత్రం, ప్రపంచంలో అందరి స్త్రీలవి. మరీ ముఖ్యంగా భారత స్త్రీలందరివీ. సో ఇవి మనందరి కథలు....
- పి. జ్యోతి
9885384740