Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''Poets are the unacknowledged legislators of the world''
- P.B. Shelly
తెలంగాణ కవిత్వానికి ప్రతినిధిగా తన స్థానాన్ని సుస్థిరపర్చుకున్న కవి, సంపాదకుడు, పాటల రచయిత సుంకర రమేశ్. తెలంగాణ కవిత పేరుతో దాదాపు 5 కవితా సంపుటాలు తన సంపాదకత్వంలో వెలువరించి తెలంగాణ స్వరాన్ని చాలా బలంగా వినిపించిన సంపాదక కవిగా చెప్పుకోవచ్చు. ఆ అయిదు సంపుటాల్లోంచి కొన్నిబలమైన కవితల్ని కలిపి ''The scent of the Soil'' పేరుతో ఆంగ్లంలోకి డి.దామోదర రావు సంపాదకత్వంలో సంకలనంగా వెలువరించారు. ఆ విధంగా తెలంగాణ వాణిని ప్రపంచమంతా వినిపించాడు.
ఈ మధ్యనే సుంకర రమేశ్ కవిత్వం ''Bliss of Breeze'' అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం అయింది. ఈ సంకలనాన్ని డాక్టర్ మంతెన దామోదరాచారి అనువాదం చేశారు. ఇందులో 50 కవితలు రకరకాల విషయాల మీద ఉన్నాయి. ఈ ''Bliss of Breeze'' సంకలనానికి ముందుమాటలో ఆస్ట్రేలియన్ పోయెట్ Vincent Stead రమేశ్ గురించి చెబుతూ
''As a lover of Telangana, he contributed his poetry for the growth of Telangana movement. His dreams of Telangana were realised gradually''.
ఒక ఉపాధ్యాయ ఆదర్శ కుటుంబంలో పుట్టిన రమేశ్ తన తల్లిదండ్రుల నుంచి ఎన్నో ఉత్తమ అసాధారణ నైపుణ్యాలను పొందడమే కాకుండా గంభీరమైన క్రమశిక్షణతో పాటు ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నాడు. రమేశ్లోని కవితా జిజ్ఞాస తనను చురుకైన కవిగా నిలబెట్టింది. తన కవిత్వానికి సరియైన వస్తువును ఎన్నుకోవటంలో గొప్ప నైపుణ్యం కనబరుస్తాడు.
ఇప్పటివరకు హైదరాబాద్ నగరం గురించి ఎంతో మంది కవులు అందమైన కవితలల్లారు, అద్భుతమైన పాటలు రాశారు. కానీ, రమేశ్ అదే నగరాన్ని తల్లిగా భావించి ''నమస్తే నగరమా'' అనే కవితలో నగరాన్ని తల్లితో పోల్చి సాంద్రత నిండిన కవితను రాశారు.
ఎప్పుడూ చూడని
నీ సౌందర్యాన్ని
నేనిప్పుడు చూస్తున్న
తొలిసారి తల్లి మోమును
చూసే శిశువులా
నీనీరవ నిశ్శబ్దంలో
గాంధర్వ రాగాలు
గమ్మత్తు స్వరాలు గాలిలో
గుభాళిస్తున్నాయి - అని చెప్పాడు.
ఎప్పుడైతే మనం ప్రకతి ఒడిలో జీవించాల నుకుంటామో మనరోజు వారి సమస్యలు మాయమౌతాయి. కత్రిమ జీవితం నుంచి విముక్తిపొంది హదయా నందాయాన్ని పొందుతాం.
ఎన్నిసార్లు చూశానో
పిట్టలు గూడుకట్టుకుంటున్న తీరు
ముచ్చట పడిందే కానీ
మన మనోమందిరంలో
మౌనగీతాలు ఆలపించదానికో
చిన్న ఇల్లొకటి చాలు
ఆంక్షలు ఆక్రందనల్లేని
అరుపులు ఆరేళ్ళు లేని
ఒక్కబొమ్మరిల్లు కావాలి
కరోనా వైరస్ ఆధునిక మానశ జీవితాన్ని ఎంతగా చిన్నాభిన్నం చేసిందో అందరికి తెలుసు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో కవి తన ఆశావాదకవిత్వం ద్వారా తన తోటివారి గుండెల్లో ఉత్సాహన్నీ, ధైర్యాన్ని నింపుతాడు. అతనిలోని ఆశావాదమే రమేశ్‌ను దఢమైన కవిగా నిలబెట్టింది.
జీవితమంటే సుఖసంతోషాల సమాహారం. ఈ రెండు ఇంధనాలే మానవాజీవితాన్నీ ముందుకు నడిపిస్తాయి. వివేకవంతుడైన మనిషి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాడు.
నా ప్రేమ పురి
ని వాడికిరణాల కరవాలంతో
క్రిమిని వేటాడు
ముప్పేట ముంచేస్తున్న
మహమ్మారిని మట్టుబెట్టు
సూర్యగ్రహణం ఎంతోకాలం ఉండదు
కారుమబ్బుల్ని చీల్చుకుంటూ
ప్రకాశించవే పేట
బస్తీమే సవాల్ అని బరిగీసి యుద్ధం చెయ్యవా
ఇంకోసారి...
ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వలస కూలీల బతుకులు ఎలా చిన్నాభిన్నం అయ్యాయో, తిండి గింజలు లేక ఎంత దుర్భరంగా మారిపోయిందో ఈ కవితలో వర్ణిస్తాడు. లాక్డౌన్ వల్ల వలస కూలీలు తమ భార్యాపిల్లల్ని వదిలి ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లి పనిలేక తిననీక తిండి లేక పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఏ ప్రభుత్వాలు వాళ్లకు ఆసరాగా నిలబడలేదు. ప్రభుత్వేతర సంస్థలు కూడా వాళ్ళను సొంత వూళ్లకు పంపటానికి ముందుకు రాలేదు. మెచ్చు కోవాల్సిన విషయమేమిటంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వాళ్ళకు నివాసాన్ని, ఆహారాన్ని సమకూర్చి వారి వారి సొంతవూళ్లకు వెళ్ళడానికి దోహదపడ్డాయి.వీధి కుక్కలు తిండిలేక ఎలా చనిపోయాయో, వలసకూలీలు కూడా ప్రయాణ సమయంలో చనిపోయారు. రమేష్ వాడిన పదచిత్రాల్లో వలసకూలీల వేదనాభరిత బతుకుచిత్రాలు సుస్పష్టంగా బొమ్మకడతాయి.
ఎంతో సున్నితమైన, సన్నజాజి తీగల్లాంటి ముసలి తల్లిదండ్రులను రోజువారీ కూలికోసం మాయల మర్రి లాంటి నగరానికి వలసవచ్చి పడే ఇక్కట్లను రమేశ్ కవిత్వం చేసిన విధానం చూస్తే ఇతను ఎంత బలమైన కవో అర్ధం అవుతుంది.
ఇకవారిని ఆపకండి
రోడ్లపై చెమట చుక్కలు నడుస్తున్నట్లు
కదులుతున్న దేహాలు వారివి
..........................
ఎర్రటి ఎండల్లో ఎండుటాకులా కదులుతున్నారు
సందిగ్దరేఖను భారంగా దాటుతున్నారు
వారికాళ్లకు లక్ష్మణరేఖలు గీయకండి
ఒక కవి ఎంతోమానసికంగా మదనపడితే ఇటువంటి ప్రాణమున్న వాక్యాలు ప్రవహించవు. కన్నకొడుకు జ్ణాపకాలు వెంటాడుతుంటే ఆకొడుకును వెతుక్కుంటూ యేదో పోగొట్టుకున్న వస్తువును వెతుక్కుంటున్నట్లు నగరమంతా తిరుగుతున్న తీరు మనల్ని కదిలిస్తది
సూర్యుణ్ణి కొంగున కట్టుకొని
ఆమె నడుస్తున్నది
గాలిలో అటుఇటు ఊగుతున్న పతంగిలా కాసేపు
ఈదురు గాలిలో ఒరుగుతున్న పక్షిరెక్కలా
కాసేపు ఆమె సముద్రపు గాలిలో ఊగే
తెరచాపలా ఆమె కదులుతున్నది
హదయమున్న ఎవరికైనా ఈ కవిత చదివితే కన్నీళ్లు పెట్టక మానరు. ఇదే కవితలో ఒకచోట ఆమె ముసలితనాన్ని ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి
యెండు ఖర్జూరంలా ఆమె
దేహం ముడతలు పడింది ... ఒక గొప్ప ఇమేజ్ మన గుండెలపై పరుస్తాడు.
ఎక్కడో పల్లెటూరి నుంచి వచ్చి ఈ విశాల ఎడారి నగరం లో దారి తెలియక తిరుగుతున్న ఆమె అయోమయ పరిస్థితిని మన రెటీనాలపై ముద్రిస్తాడు. రమేశ్ కవితల్లోకెల్లా ఈ ''చూడాలని'' కవితను బలమైన కవితగా చెప్పుకోవచ్చు. వస్తుపరంగా, భాషపరంగా, ప్రతీకలు, భావచిత్రాలు అన్నీ కలిసి పాఠకుల గుండెలపై ముద్ర వేసే కవితగా రూపుదిద్దుకుంది
సామాజిక సంఘటనలతోటి మమేకమైతే తప్ప ఏ కవి బలమైన కవిత్వం రాయలేడు. తీసుకున్న వస్తువుతో తదాత్మ్యం చెందితే తప్ప ఏ కవి పాఠకుల గుండెల్ని చేరలేడు. సుంకర రమేశ్ ఏ వస్తువు తీసుకున్నా అద్భుతమైన కవితగా మలిచే నైపుణ్యం ఉన్న కవిశిల్పి. ఈ ''Bliss of Breeze'' అనువాదకవితా సంకలనంతో తెలుగేతర కవిత్వ ప్రేమికుల మెప్పు పొందుతాడని ఆశిస్తున్నాను.
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు
9440471423