Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆచార్య పాకాల యశోదారెడ్డి 1929 ఆగస్టు 8న మహబూబ్ నగర్ జిల్లా (పాలమూరు జిల్లా) బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి, సరస్వతమ్మలకు జన్మించారు. మహబూబ్ నగర్లోనూ, హైదరాబాద్ లోనూ ఆమె చదువు కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఆమె పరిశోధనా గ్రంథం 'తెలుగులో హరి వంశములు ప్రాచీన సాహిత్యం'పై లోతైన పాండిత్యం, సంస్కతంపై పట్టు ఉండి కూడా తెలంగాణ భాష ప్రాధాన్యతను గుర్తించిన రచయిత్రి ఆమె. తన 12వ ఏట నుండే కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టిన యశోదారెడ్డి తన 25వ ఏట మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా చేరారు. విశ్వవిద్యాలయంలో వివిధ పదవులను నిర్వహించారు.
ముఖ్యంగా యశోదారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం 1990 నుండి 1993 వరకు మూడేండ్ల ్ళపాటు 'తెలుగు అధికార భాషా సంఘం' అధ్యక్షలుగా పనిచేశారు. ఆమె ఇప్పటివరకూ కూడా ఆ పదవిని చేపట్టిన ఏకైక మహిళ కావడం విశేషం. ఇంకా ప్రపంచ సంస్కత అధ్యయన సంస్థలో, ఇండియా ఇంటర్నేషనల్ సంస్థలోనూ సభ్యులుగా పనిచేశారు.
ఆమెకు హిందీ, ఉర్దూ, కన్నడ భాషలతో పాటు జర్మనీ భాష కూడా తెలుసు. యశోదారెడ్డి నిత్య పరిశోధకులు. ప్రబంధాలను పరిశోధించడానికి స్త్రీలు జంకే కాలంలో వాటిని పరిశోధించిన మేధావి ఆమె. అదే స్థాయిలో తన పరిశోధనా దష్టి తెలంగాణా గ్రామీణ జీవన చిత్రణలోనూ మనకు కనిపిస్తుంది.
ఆమె జీవితకాలంలో చరమాంకం వరకూ రచనలు చేస్తూ 22 విమర్శా గ్రంథాలను, 7 లఘు గ్రంథాలను, 80 పరిశోధక వ్యాసాలనూ, 2 కవితా సంపుటాలనూ ప్రచురించారు. తెలుగు సామెతలు, ఆంధ్రక్రియా స్వరూప మణిదీపిక'కు సహ సంపాదకత్వం వహించారు. బాలల కోసం కథలను, బాలశిక్షనుండి 1, 2, 3 తరగతులకు పాఠ్య పుస్తకాలను రాశారు. ఆమె రాసిన 8 ఏకాంకికలు రేడియోలో ప్రసారమయ్యాయి. 3 అనువాద గ్రంథాలను 5 గల్పికలను, ఎన్నో పుస్తకాలకు పీఠికలు, సమీక్షలు రాశారు.
కథ ఎప్పుడూ నిరాధారంగా పొట్మరిల్లదు. కథా వస్తువు ఎక్కడో అంతూ పొంతూ చిక్కని ఆకాశం నుండి ఊడిపడదు. అది జీవితం నుండి, జనానీకం నుండి, పరిసరాల నుండి, నిశితమైన చూపు నుండి, అనుభవరాశి నుండి మొలకెత్తుతుంది అన్న యశోదారెడ్డి స్వాతంత్య్రానంతర తొలితరం కథా రచయిత్రి. తను జన్మించిన మట్టి వాసలను, తన మాతభాష ప్రాధాన్యతనూ వాడిపోకుండా కథలను అక్షర మాలికలుగా అల్లి తెలంగాణా నేలతల్లిని అర్చించిన భక్తురాలు. ఆమె కథలన్నీ తెలంగాణా రాజకీయ, ఆర్థిక, సాంఘిక నేపథ్యాన్ని ప్రతిబింబి స్తాయి. ఆమె వెనకటి కాలాన్ని ఊరిస్తూ గొప్పగా ఉందని బాల్య జ్ఞాపకాలను ఆకర్షణీయంగా చిత్రిం చినా ఎన్కటి కాలం మారిపోయినందుకు బాధప డుతూ చిత్రించలేదు. అభివద్ధిని వ్యతిరేకించలేదు. ఆధునిక, సామాజిక పరిణామాలను అర్ధం చేసుకొని కాలం తెచ్చే మార్పులను సానుకూలంగా స్వీకరించారు, పరిశీలించారు.
తెలంగాణా భాషను, సంస్కతిని, కుటుంబ సంబంధాలను, రక్త సంబంధాలను, పండుగలను, మూఢ విశ్వాసాలను ఆమె తన రచనల్లో చిత్రించారు. ఆమెకు పల్లె తనం, పల్లె ప్రేమ ఎక్కువ. బాల్యంలో బిజినేపల్లి, మహబూబ్ నగర్ లో ఆడిపాడినందుకేమో ఆ జ్ఞాపకాల చిక్కదనం ఆమెను అంటిపెట్టుకొని ఉంది. యశోదమ్మ ఊరినీ, పరిస రాలనూ, ఉత్పత్తి జనాన్నీ, వారి జీవన విధానాలూ, ఘటనలూ అన్నీ మేథస్సులో జ్ఞాపకాలుగా భద్ర పరచుకున్నారు. తెలంగాణా భాష, యాస, సంస్కతి, సంప్రదాయాల విశిష్టతను ఆమె తన కథల్లో చాటి చెప్పారు. యశోదమ్మ దగ్గరున్న అతి పెద్ద ఆయుధం కలం. ఆ కలం నిండా కమ్మని పదాలు, జాతీయాలు, నుడికారాలు, సామెతలు పలుకుబడులు.
యశోదారెడ్డి మంచి విమర్శకురాలు కాబట్టి ఆమెకు, కథను గురించి, దాని చరిత్ర, లక్షణాలను గురించి అవగాహన ఉంది. ఆమె మొదటి కథల సంపుటి 'మావూరి ముచ్చట్లు' 1973లో అచ్చయింది. దీనిలోని కథలన్నింటిలో గ్రామీణ జీవన చిత్రణ కనిపిస్తుంది. 1999లో అచ్చయిన 'ధర్మశాల' కథా సంపుటిలో మధ్య తరగతి జీవన చిత్రణలు కూడా కనిపిస్తాయి. 2000లో అచ్చయిన 'ఎచ్చెమ్మ కథలు' కథా సంపుటిలో చాలా వరకు గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేవే. భాష సంస్కతికి ఆయువు పట్టు అని భావించిన యశోదారెడ్డి వాటిని రికార్డు చేయాలని కథలను రాశారు. 'తెలుగు పలుకుబడులు నశించకుండా ఉండి భావితరాలకు అందాలనే వాటిని కతలలో పొదిగి అల్లడం జరిగింది' అని చెప్పే యశోదారెడ్డి తనకు నచ్చిన, తను చూసిన, తనకు తెలిసిన సమాజాలను, మనుషులను, సంఘటనలను, వత్తాంతాలను తీసుకొని కథలుగా రాశారు. అట్లా రాసిన కథలలో కొన్ని.
నాగి : 1956లో వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురించిన 'పరిసరాలు' అనే కథా సంకలనంలో ఈ కథ ప్రచురితమయింది. ఆమె గ్రామ్య భాషలో రాసిన మొదటి కథ ఇది. నాగి పేదరికం, ఆకలితో దొంగగా మారుతుంది. ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరితో మాటలు పడుతూ ఉంటుంది. పట్నంలో చదువుకొని చదువు చాలించి పల్లెకు వచ్చిన రాంరెడ్డి నాగిని చూసి బాధపడతాడు. ఆ పిల్లను చేరదీసి ''పొట్టనిండ అన్నం బెడ్డ, పై నిండ బట్టలిస్త ఆ దొంగతనం మాని పనిజేస్తవ అని అడుగుతాడు. నాగి బువ్వ, బట్ట దొరికిన తర్వాత బుద్ధిమంతురాలవు తుంది. అన్నీ ఉండి దొంగ తనం చేసేవాళ్ళనే అడ్డుకొని నిలదీస్తుంది నాగి. మనిషి మీద పరిసరాల ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ, ఆకలితో ఉన్నవాళ్ళకు ఆకలి తీరే మార్గం చెప్పాలె. తోచిన దారి చూపాలె అని సందేశమిచ్చే నీతి కథ ఇది.
పీర్ల పండుగ : ఈ కథలో ఒక ఊరిలోని సమస్త జనం మత వైషమ్యాలు లేక పీరీల పండుగలో పాల్గొనే సంస్కతిని వర్ణించారు. పిల్లలు దక్కకపోతే పెంటమీద వేసి 'పెంటయ్య' అని పేరు పెట్టుకోవడం, చింత నిప్పుకణికల మీద 'అలారు' అంటూ నడవడంలాంటి ఎన్నో ఆచారాలను, పల్లె సంస్కతికి సంబంధించిన విశేషాలను ఈ కథలో చిత్రించారు యశోదారెడ్డి.
మ్యానరికం : ఈ కథలో తల్లి తన కొడుక్కు అన్న కూతురును చేసుకోవాలని అన్న ఇంటికి కొడుకును తీసుకొని పోతుంది. ఆమె అన్నకు తన కోరిక చెప్పుతున్నప్పుడే మేనకోడలు తన కొడుకు తల మీదున్న తిరుపతి వెంకటేశ్వరుని మొక్కయిన పొడవైన జట్టును కత్తిరించడం చూసి అలిగి నీ కూతురు సంబంధం ఒద్దంటుంది, వెళ్ళిపోతానంటుంది. చివరకు ఇంట్లో వాళ్ళందరూ (అన్న కుటుంబం) బతిమిలాడితే ఒక్క పూట ఉండడానికి ఒప్పుకొని ఇంటికి పోతుంది.
గంగిరేగి చెట్టు : ఈ కథ రచయిత్రి స్వీయకథ. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ వల్ల కీడు జరుగుతుందనే ఒక నమ్మకంతో సాగే కథ. ఈ కథలో మేనగోడలు ఎచ్చమ్మ వంగిన బావ వీపు మీద కాలు పెట్టి గంగిరేగి చెట్టు ఎక్కి దిగుతుంటుంది. ఈ దశ్యం చూసిన ఎచ్చమ్మ మేనత్త ఈ పిల్ల ముందు ముందు తన కొడుకు మీద పెత్తనం చెలాయిస్తుందని, అటువంటిది తనకు కోడలుగా పనికిరాదని కోపంతో వెళ్ళిపోతుంది.
జమ్మి : యశోదారెడ్డి 'జమ్మి' కథ అచ్చమైన తెలంగాణ పల్లెలోని పెద్ద పండుగ దసరా, బతుకమ్మ ఊరి సమస్యల ప్రస్తావనతో ముడి పెట్టి చివరకు జమ్మిని పంచి దీవెనలు తీసుకోవడంతో ప్రశాంతంగా ముగుస్తుంది. విదేశాల్లో ఉన్న అక్కా బావలకు తెలంగాణ పల్లెలో ఉన్న చెల్లెలు రాసే ఉత్తరమీ కథ.
ఎంకన్న : ఈ కథలో యశోదారెడ్డి ఒక కోడెను (ఆవును) కొనాలంటే చాలా డబ్బుతో కూడిన వ్యవహారమని చెప్పడానికి చెప్పిన తీరు పాఠకుల హదయాలను హత్తుకుంటుంది. దీనిలో తెలంగాణ పల్లెల్లోని జీవితం ప్రతిబింబిస్తుంది.
ఎదురుకోళ్ళు : ఈ కథలో పెళ్ళితంతు ప్రారంభం నుండి చివరి వరకూ జరిగే ప్రతి సందర్భం, సంఘటనను మన కళ్ళముందు కదలాడే విధంగా చిత్రీకరించారు రచయిత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ చదివినంత సేపూ తెలంగాణ పల్లెలోని ఒక పెళ్ళి కార్యక్రమంలో జరిగే అన్ని వేడుకలలో మనం కూడా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది.
జతగాళ్ళు : ముస్లిం దేవుళ్ళ కొలుపులూ గ్రామీణుల నమ్మకలూ, మనస్తత్వాలూ, అంతరాలూ చివరకు కలిసిపోవడం, మధ్య తరగతి జీవితాల ప్రవర్తనలు చిత్రించబడిన కథ.
మా పంతులు : ఈ కథలో ఒక చిన్న బడి పంతులు గురించి బడిలో రోజూ జరిగే విషయాల గురించి యశోదారెడ్డి కండ్లకు కట్టినట్టుగ వర్ణించారు. నిజాం కాలంలో తెలుగు నేర్పే బడులు తక్కువ నిజాం పాలన పోయి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్కూలును అప్ గ్రేడ్ చేసి ఊరి మనిషి టీచర్ గా పనికిరాడని, అతనికి తెలుగు రాదని నిర్ధారిస్తూ తెలుగు వచ్చినోడని ఏడవ తరగతి చదివినోడిని టీచరుగా నియమిస్తారు. అమాయకులైన పిల్లలు పంతులూ ! అనుకుంటూ బడి కడ్పదాటి ఎంట ఉర్కటంతోటి కథ ముగుస్తుంది. ఈ కథలో 1930, 40ల్లో ఊరిబడులు, వీధి బడులు ఎట్ల ఉండేవి, తెలుగు పాఠాలేమేమి చెప్పేవాళ్ళు లాంటి చాలా విషయాలను ప్రస్తావించారు రచయిత్రి
మొమ్మైకత : ఈ కథ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'కాబులీ వాలా' కథను గుర్తుకు తెస్తుంది. పెద్దవాళ్ళను చూసి పిల్లలు భయపడే తీరును, పెద్దవాళ్ళు పిల్లల్ని లాలనగా అక్కున చేర్చుకోవడాన్ని వారి మధ్య ఆ తేడాలను తొలగించుకునే ఆ ఆత్మీయతనూ చిత్రించిన కథ ఇది.
ఒక జాతికి భాషా సంస్కతులే కాదు ఆచార వ్యవహారాలు, ఆహార విహారాదులు అన్నీ ప్రత్యేకమే అని గుర్తించి తన భాషను, యాసను శ్వాసిస్తూ తెలుగు సాహిత్య సేద్యం కావించిన పండిత శ్రామికురాలు యశోదారెడ్డి. మన భాషలోని అందాలను, పలుకుబడుల తియ్యందనాలను తన జీవన పర్యంతం హత్తుకొని వాటిని విశిష్ట సంపత్తిగా ముందుతరాలకు అప్పగించే బహత్తర బాధ్యతను నెత్తికెత్తుకున్న తెలంగాణ పల్లెకోయిలమ్మ యశోదమ్మ.
ఈ విధంగా మట్టి వాసనలతో కూడిన పల్లె ప్రజల జీవితాలు, వాళ్ళు నిత్య జీవితంలో మాట్లాడుకునే భాష, యాసలకు యశోదారెడ్డి కథలు అద్దం పడతాయి. పల్లె జీవనాన్ని, భాషాధారను కథలలో చూపించే సాధికార స్వరం పాకాల యశోదారెడ్డి అమూల్యమైన సాహితీ సంపదను మనకందించి తన చివరి ఊపిరి వరకూ సాహితీ సేద్యం చేస్తూ 7, అక్టోబర్ 2007న కీర్తిశేషులైనారు. వారి జయంతి సందర్భంగా ఆమెకు నీరాజనాలు.
- డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
9849234725