Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిటారుగా నిలబడ్డ చెట్టు
ఎవరి పాదాలకు సలాం చెప్పదు''
తన కవిత్వంతో కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఇప్పుడు నిటారుగా నిలబడ్డాడు. సినారె, కాళోజీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, పాలమూరు సాహితీ పురస్కారాలను, అలాగే వచన కవితకు నాలుగుసార్లు కుందుర్తి పురస్కారాలు అందుకొన్న నేటి కాలపు మేటి కవి కోట్ల. ఇప్పటి వరకు 14 కవితా సంపుటాలను వెలువరించి, మూడు దశాబ్దాలకు పైగా నిరంతర సాహితీ ప్రయాణం కొనసాగిస్తున్న కవి. ఈ రోజు తెలంగాణ సారస్వత పరిషత్ అందిస్తున్న పాకాల యశోదా రెడ్డి స్మారక పురస్కారం అందుకోబోతున్న సందర్భంగా కవి గుండెను ఒకసారి తడిమే ప్రయత్నం చేద్దాం.
కోట్ల ఇటు సామాజిక, రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందిస్తూనే, అటు మానవ సంబంధాలపై, ప్రకతి అంశాలపై కూడా సున్నితంగా స్పందిస్తాడు. రెండిటి మధ్య కవిత్వమై ప్రవహిస్తూ కవిత్వం ఎలా పయనించాలో కూడా చెబుతాడు. నేటి కవులకు మార్గనిర్దేశం చేస్తాడు.
గుండె కింది తడి, రహస్యాలు లేనివాళ్ళు, రంగు వెలసిన జెండా, మనిషెళ్లిపోతుండు, నూరు తెలంగాణ నానీలు, నిషేధానంతర నానీలు, నాన్నా నాలా ఎదుగు, బ్రేకింగ్ వ్యూస్, తొణకని వాక్యం, మనుమసిద్ధి, అంతర్వాహిని, సరళ శతకం, హరిత స్వప్నం, గడప దాటని యుద్ధం మొదలైన 14 సంపుటాలతో తేజరిల్లు తున్నాడు. ఇందులో మూడు నానీల సంపుటాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ సాహిత్య సభలు జరిగినా కవిత్వమై ప్రకాశిస్తాడు, అందరిలో ఏకమై ప్రవహిస్తాడు. ఏ పత్రిక తిరగేసినా తన గొంతును వినిపిస్తాడు. గోపి గారన్నట్లు తొణకని కవిగా మన ముందున్నాడు.
మొదటి కవితా సంపుటికే సమతా రచ యితల సంఘం, అమలాపురం వారి రాష్ట్ర్ట స్థాయి పురస్కారం అందుకొని గుర్తింపు పొందారు. మనుషుల గుండె కింద తడిని తొంగి చూశాడు. రహస్యాలు లేని వాస్తవాలను వెల్లడించారు. మనిషెల్లి పోతున్న కోణాన్ని, మానవ విలువ లను చాటిచెప్పాడు. రంగు వెలసిన జెండాలో వాస్తవ పరిస్థితులను ముందుంచాడు. తెలంగాణ ఉద్యమంలో ప్రాంతీయ తను చాటి చెప్తూ అనాదిగా ఎదుర్కొన్న అణచివేతను ఎండ గట్టాడు. బ్రేకింగ్ వ్యూస్ అంటూ తెలంగాణ ఉద్యమ కాలంలో నిజానిజాల్ని నిగ్గదీసి చూపాడు. కళ్ళలో నిండిన హరిత స్వప్నాన్ని అందరి మనసుల్లో నింపాడు. మనవడి ప్రేమను రంగరించి మనుమసిద్దిని ఆవిష్కరించాడు. జీవిత భాగస్వామి తనలో అంతర్వాహినిగా పయనించిన విధానాన్ని ఎంతో ప్రేమగా అల్లాడు. పసిమనసుతో పెద్దలకు మార్గనిర్దేశం చేసాడు.
''నాన్నా నన్నో కంట కనిపెట్టండి / పెంచి పోషించండి / అంతేకానీ నా కలలు కూడా మీరే కనకండి'' నేటి తల్లిదండ్రుల వ్యవహార శైలిని పసిపాపతో పలికిస్తాడు.
పెద్దలు మరిచిపోతున్న పిల్లల ప్రపం చాన్ని నాన్నా నాలా ఎదగమంటూ మన కళ్ళ ముందుంచాడు. సరళంగా చెబుతూనే శత కాల్లో దాగిన గంభీర తను తన భావాల్లో చూపిస్తాడు.
మనిషి ఎదగడానికి ఎన్నో మార్గాలను చూపిస్తూ
''నడవాలి నాన్నా నడవాలి / నడవందే లక్ష్యం ఎదురుపడదు / ఆగిపోయిన చోట సమాధి రాళ్ళు మొలుస్తాయి!'' అంటూ నిరంతర పయ నమే విజయానికి మార్గ మని లోకసత్యాన్ని చాటి చెప్తాడు.
రోడ్లన్నీ / బావురుమంటు న్నాయి / కందిపోయే వలస పాదాలను చూసి! అంటూ కరోనా కాలంలో వలస జీవులు పడ్డ కష్టాన్ని, వేదనను, ఇంట్లో ఉంటూనే మనిషి గడప దాటని యుద్ధం ఎలా చేసాడో అక్షర రూపం చేసాడు.
''పాకానికైనా / కవితా పాదానికైనా / ఒక వెంటాడే తనముండాలి'' అన్నట్లుగానే వెంటాడే వాక్యాలను మెరుపులాంటి ముగింపుతో, ఆత్మ విశ్వాసాన్ని పెంచే దిశగా కవితా నడక సాగిస్తాడు.
''ఉడికీ ఉడకని వాక్యాలను / యావతో అచ్చుకు పంపినప్పుడల్లా / మహాకవి మాటల్తో కొరడా ఝళిపిస్తాయని'' తనకు తాను చెప్పుకున్నా కవులందరికీ వర్తించే వాక్యాలను వినిపిస్తాడు.
కోట్ల ఇలా ఏ అంశాన్నైనా సంక్లిష్టత లేకుండా ఒదుపుగా, ఒడుపుగా, పొదు పుగా తనదైన శైలిలో భావాన్ని వ్యక్తీకరి స్తాడు. వాస్తవ దశ్యాలకు భావుకతను నింపి గుండె లోకి ఒంపుతాడు. మట్టిని, చెట్టును, నీటిని ముట్టు కోకుండా ఉండలేడు. వర్తమాన సంఘటనలకు స్పందించకుండా ఉండలేరు. స్వపక్షమై మెచ్చు కోవడమే కాదు ప్రతిపక్షమై ప్రశ్నిస్తాడు కూడా. అన్యాయం జరిగిన చోట నిరసన ప్రకటిస్తాడు.
''కాలగమనాన్ని పట్టించుకోకపోతే / చరిత్ర నిన్ను పట్టించుకోదు / మార్పు నిత్యం / గమనించకపోతే పతనం తథ్యం'' కోట్ల కూడా కాలానుగుణంగా, సందర్భానుసారంగా అక్షరాలను సంధిస్తాడు.
నిజాయితీగా, నిర్భయంగా చిత్రిస్తాడు. కుందుర్తి, సినారె, ఎన్.గోపి సహ కవులు అఫ్సర్, సీతారాం వంటి కవుల ప్రేరణ, సాంగత్యం కవిత్వం వైపు అడుగులు వేగంగా వేయించినవని, కాతోజు వెంకటేశ్వర్లు, వేణు సంకోజు, నందిని సిధారెడ్డి, జలజం సత్యనారాయణ, యస్.రఘు వంటి పెద్దల సాంగత్యం, కలిసి వచ్చిన సాహిత్య సంపద తనదని వినయంగా చెప్పుకుంటాడు. అందుకే నేటి కవిత్వ సమూహంలో మేటి కవిగా కనిపిస్తున్నాడు. నేడు పాకాల యశోదారెడ్డి పురస్కారం అందుకోబోతున్న సందర్బంగా అభినందనలు.
- పుట్టి గిరిధర్
9491493170