Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా తాత ముత్తాతల కాలం నుంచి...
తిరంగాలమై ఎగరుతూనే వున్నాం!
ఇవ్వాళ్లేం కొత్త కాదు
ఇదే మొట్టమొదటి సారీ కాదు...
డెబ్బై ఐదేళ్ల త్యాగాలమై
దేశరాగాన్నీ ఐక్యగానాన్నీ గొంతెత్తుతూనే వున్నాం!!
ఉరికొయ్యల స్ఫూర్తిని అణువణువూ నింపుకొని
చెరసాలల్లో చీకట్లో మ్రగ్గుతూ
స్వేచ్ఛా పరిమళాన్ని కలగన్న
నాయకుల గుండెల్ని తలచుకుని
సౌభ్రాతత్వాన్ని పంచే మువ్వన్నెల పతాకాన్ని
ప్రతీ ఏటా ఎగరేస్తూనే వున్నాను
నాడు...
స్వరాజ్యం నినాదమై ఎగరేశాను!
స్వేచ్ఛా స్వాతంత్య్రానికి ప్రతీకై ఎగరేశాను!
ప్రజాస్వామ్య స్వపరిపాలనకై ఎగరేశాను!
నా ఇంటిమీదేమిటి...
ఇవ్వాళ్టి నీ అ'జెండా' పేదోడి పక్షమైతే
ఎక్కడెగరేయమన్నా ఎగరేస్తాను
ఊరూ వాడేమిటి...
నీ రహస్య అ'జెండా' లో ఉన్నోడు లేడంటే
ఏ చోటునుంచైనా ఎగరేస్తాను
పల్లె పట్నం అని కాదు...
నీ అ'జెండా' దేశ హితమని మరే మతలబు లేదంటే
దేశం నడి బొడ్డు నుంచైనా ఎగరేస్తాను
అసలు నేల మీదే కాదు...
జాతి కోసం నువ్వు నిలబడతా నంటే
నింగి అంచుల్లోనైన నిలబడి
జాతీయ 'జెండా' ఎగరేస్తాను
ఏ వర్ణములంటని త్రివర్ణ జెండా చేతబట్టి...
ఎక్కడ వూరేగమన్నా వూరేగుతా!
ఏ వర్గం కొమ్ము కాయని జాతిపతాకను చేతబూని...
దేశ సమైక్యతను చాటి చెప్పే
ఉత్తుంగ తరంగ మౌతాను
నేనిప్పుడు...
ఆకలి చావుల వూరేగింపు సన్మాం కైతే కాదు
దేశానికి అన్నం పెట్టే
రైతుసత్కారం కోసమైతే ఎగరేస్తాను
పొట్ట చేతబట్టి వలసెల్లే పల్లెలకైతే కాదు
వున్న వూరిలోనే కలోగంజి తాగే
బతుకు కోసం ఎగరేస్తాను
మతం మంటల్లో తగలబడని దేశం కోసమైతే
కులం కంపుతో కునారిల్లని సమాజం కోసమైతే
దేశ సంపదను దోచుకోని దోపిడీ దారు కోసమైతే
యువత ప్రతిభ పట్టాలెక్కే కొలువుల కోసమైతే
తప్పక ఎగరేస్తాను నా ఇంటి నుంచే ఎగరేస్తాను
అందరూ సమానమనే లోకం కోసం
మనిషిగా చూసే మమతతో కోసం
మనుషులంతా ఒక్కటై కలసి మెలసి జీవించే
వసుధైక కుటుంబం కోసం
నిండైన దేశభక్తితో...
వూరూ ఏరూ ఏకమై రాత్రి పగలు తేడా లేని
స్వరాజ్య జెండాని నిత్యం రెపరెపలాడేలా చేస్తాను
చివరాఖరికి నా మాటగా...
మనిషి హితం కోరి దేశ శ్రేయస్సు కోసమైతే
నా ఇంటినుంచే దేహాన్ని 'తిరంగా 'చేసుకుని ఎగరేస్తాను!!
- ఆది ఆంధ్ర తిప్పేస్వామి