Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలభైయ్యేళ్ళకు పైగా నాటకరంగంలో ఉండి ఏభైకి పైగా నాటక రచన, దర్శకత్వరంగాల్లో విశేషానుభవం గడించి సాహిత్యరంగంలోనూ తన ప్రతిభా సంపత్తితో వెలుగొందుతున్న కవి కొసనం శాంతారావు వెలువరించిన నానీల సంపుటి ''నాటక నానీలు.'' నటననే జీవితంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న రాజకీయవాదులకు భిన్నంగా జీవితాన్ని ఉద్యమంగా మలచుకుని తన కవితావేశం ద్వారా ప్రజలను చైతన్య వంతం చేస్తున్న కవి ఆయన. ఇంతకుముందు ఎద్దు, మహా బాటసారి కవితాసంపుటాలను వెలుగులోకి తెచ్చి ఇప్పుడు ఈ నాటక నానీలు ప్రచురించారు. నానీల సృష్టికర్త డా. ఎన్ గోపి నాంది పేరిట రాసిన ముందు మాటలో 'అవసరం వస్తువు/ఆకర్షణ శిల్పం/కావ్యానికి కావాలి/రెండు గుండెలు' అనే శాంతారావు నానీని ప్రస్తావిస్తూ ''అలంకార శాస్త్రమంతా ఈ నాలుగు చిట్టి లైన్లలో ఇమిడిపోయింది. మనిషి పైకి కనపడేంత శాంతమూర్తి కాదు. ప్రజా సమస్యల పట్ల అశాంతమూర్తే'' అంటారు. ఇందులోని నానీలను చూస్తే ఆయన చెప్పినదంతా వాస్తవమే అనిపిస్తుంది.
శాంతారావు తన స్వగతంలో ''నానీల మోహంలో అందరివలెనే నేనూ కొన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను, పట్టు దొరక్క. కవిత్వం ఓ భావధార కదా... ఈ 20-25 అక్షరాల గొడవేంటి... అని మనస్సులోనే నిష్టూరాలాడుకున్నాను, ఏ ప్రక్రియకైనా వాటి రసరమ్య నియమాలే వాటి జీవాకర్షణ శక్తి అని... సాధనలోనే క్రమేపీ అర్థమవుతుంది'' అని అన్నారు. చక్కటి అభివ్యక్తితో, సామాజిక సమస్యల్ని ఎత్తిపొడిచే ఈ నానీలపై దృష్టి సారించకుండా ఉండలేకపోయాను. కొన్నింటినైనా ప్రస్తావించి ఆయనలోని నిబద్ధతని పది మందికీ తెలియజెయ్యాలని ఈ వ్యాసం మొదలుపెట్టాను.
'జీవితం
ఎంత సంక్లిష్టం!
భయపడకు
కళ చేస్తుంది స్పష్టం' అనే మొదటి నానీతోనే జీవితానికీ, కళారంగానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని చెప్పారు. జీవితం ఎంత సంక్లిష్టంగా, సంకుల సమరంగా మారిపోయినా అందులోని చిక్కుముడుల్ని విడదీసి స్పష్టంగా కనిపించేలా చేసేది కళారంగం అంటారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానమూ దొరుకుతుందని చెబుతున్నట్టు అర్థమవుతుంది. ''ప్రపంచ కార్మికులారా ఏకం కండు'' అంటూ ఓ నినాదమై ఆ కార్మిక, శ్రామిక శక్తికి ప్రతీకగా రూపొందించబడి మే 1న ఆవిష్కరింపబడే జెండాను నానీయాత్మకం చేస్తూ
విశ్వశ్రమ ఎజెండా
మేడే జెండా
ఎగిరింది
రక్తరంజిత గీతంగా
అన్నారు. మరో నానీలో ఎంత పెద్ద సముద్రమైనా ఒక చిన్న కంటిపాపలో ఇమిడి పోవడాన్ని వర్ణించారు. ఓ తాత్వికపరమైన ఆలోచన పాదుకొల్పారు. ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద కష్టాన్నైనా సరైన దృష్టితో చూస్తే సులభంగా దాటిపోవచ్చు అంటారు.
సముద్రం
ఎంత చిన్నదో!...
ఇంత కంటిపాపలో
ఇమిడిపోయింది అన్నారు. మద్యానికి బానిస అయిన వ్యక్తి జనం మధ్య ఎలా ఒంటరివాడైపోతాడో వర్ణించే ఈ నానీ చూద్దాం.
మధువుకు
బందీ అయ్యాడు
జనవాహినిలో
కాందిశీకుడయ్యాడు
ఈ నానీ చదివాక నిజమే కదా అనిపిస్తుంది. మద్యం ప్రియులకు ఎందుకు అర్థం కాదో కానీ, ఏదో తెలియని ఒంటరితనంలో కూరుకు పోవడం, జనానికి దూరంగా జరిగిపోవడం మిగతా వాళ్ళు గమనిస్తూ ఉంటారన్నది నిజం!
నాకు తెలుసు
చావు ఉందని
నా ఆశకు మాత్రం
ఎందుకు లేదో మరి!!
ఈ నానీలో ఎంతో మంచి అభివ్యక్తి దాగి ఉంది. చావు ఉందని అందరికీ తెలిసినదే. అయితే ఆశకి మాత్రం చావు లేదన్న విషయాన్ని అందంగా వర్ణించారు.
వ్యవస్థ
అవస్థ పడుతుంది
కవికి ఇప్పుడు
పురిటినొప్పులు
అన్న నానీలో చూడండి. ఎంత ఆశాభావమో. వ్యవస్థ పడుతున్న అవస్థల కారణంగా ఎటువంటి పరిణామాలు పొంది సమాజం సృష్టించబడుతుందో అనే ఆతృతతో కవి ఉన్నాడన్న విషయాన్ని గుర్తుచేస్తూ కవిత్వం కూడా అదేవిధమైన పురిటినొప్పులు పడాలని బోధిస్తున్నారు.
పదునెక్కిన కవిత్వం కవిని సానబెట్టుకున్నదట ఈ నానీ చూడండి
కవిత్వం
పదునెక్కింది
సానపెట్టుకున్నది
కవిని కదా అంటారు. వీటితోపాటు ఇంకా నాటక రంగానికి, బౌద్ధమతానికి సంబంధించి సమాజం పట్ల బాధ్యతాయుతంగా, పాఠకులకు ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉండే విధంగా అనేక నానీలు రాసిన కె. శాంతారావును అభినందిస్తూ...
- కొంపెల్ల కామేశ్వరరావు,
8985971198