Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇన్సానియత్ సే జుదా అయిన తర్వాత
'సర్ తన్ సే జుదా' హింసా నినాదం కాదు
మన్ తన్ సే జుదా అయిన తర్వాత
అసహజమైనవన్నీ సహజమౌతాయి
కొందరి మనోభావాలకు మాత్రమే
రాజ్యం పహారా కాస్తుందంటే
చేపల చెరువుకు దొంగజపపు కొంగ కాపలా కాస్తున్నట్టే
ముఖ్ సే ముఖడా జుదా కర్నేకా వక్త్ ఆగయా
మెడకాయ మీద తలకాయ ఉన్న
ప్రతి మనిషీ తెలివిడిగా బతకడం నేర్చుకోవాలె
కలివిడిగా బతకడం తెలిసిన వాళ్ళం కదా
దౌర్జన్యంగా మతం రంగు పూసుకునే
రాజకీయ పైసాచిక క్రీడలను పసిగట్టాలె
బైరిగడ్డాల బాగోతాలు
సన్నాసి ఏసాలు
మన నోట్లె మన్ను కొట్టి
మన తల్లెల బువ్వ బుక్కెటందుకే
ఆమ్ ఆద్మీకా మన్ కీ బాత్
తెలుసుకున్న జిత్తులమారి నక్కలు
గోతికాడ కాపలా కూసున్నయి
వక్త్ కా ఫాయిదా కోసం
మన మెదళ్ళను మత్తెక్కించి ఒకసారి
ఇంద్రజాల, మహేంద్ర జాలంతో మరోసారి
మేరీ ప్యారీ బిల్కిస్ బానో.. ఇది సన్మానాల ఋతువు
నిన్ను బతికుండగానే చంపిన
నిందితులను సన్మానించినందుకు బాధపడకు
గుక్కెడు దూపకు చావగొట్ట బడిన బాలుడా
ఇంద్రకుమారా నీ మరణం సాక్షిగా
జరుపుతున్నాము అమృతోత్సవాలివిగో
వజ్రోత్సవ వేళ వజ్రసంకల్పం ఒక్కటే
పగటేశ గాళ్ళను పసిగట్టి పరుగులు పెట్టించడం
పర్వతాల కంటే భారమైన మూఢ విశ్వాసాలను వదిలి
సముద్రాల కంటే లోతైన నమ్మకాల పునాదులను నిర్మించుకోవాలిప్పుడు
మనిషి మనిషిని ప్రేమించడం పురాతన సత్యం
మతాన్ని మరిచిపోయే టీకా మందు
ఎవరైనా కనుగొంటే బాగుండు..
- జ్వలిత, 9989198943