Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్నం గాలి కారాబై బాగా పరేషాన్ సేత్తాంటే
జర ఉప్పోసకని పల్లె బాట బట్నా
శానొద్దులకు ఎల్నని నిమ్మలమైనంగా
తాతనిట్ల మందలించినకా అరుగు మీద కూసుని
తాత అప్పటి దినాలు ఏరేనని ఇప్పటి బతుకు
శానా మారిందని గా ముచ్చట్లు గిట్టా సెప్పుకచ్చిండు
గప్పుడు గడ్కలా గడ్డ పెరుగుతోని సల్ల సేసుకొని
ఆవకాయ తొక్కుతో తినేది తర్వాత బియ్యం గిట్టచ్చనయి
వరి కోసి మెదలు గట్టి వాట్ని కుప్పలేసి
బండకు పంజ గొట్టి ఒడ్ల గింజలును రాల్పి
గాలి సూపు సోకగా శాటతోని తూర్పారబట్టి
వడ్లను దంచ రోట్లేసి రోకలి పోటాడించి
బియ్యం షెరిగి కట్టెల పొయ్యిన కొత్త కుండవెట్టి
అండుకున్న జేజబువ్వన ఎల్పాయ కారంతోని
ఏడిఏడిగా ఊదుకొని తింటుంటే పరమాన్నాం లెక్కుండే
బువ్వ పొంగుచ్చినాకా అంపిన గంజిలా సింతొక్కు
కల్పుకొని తాగితే ఎంతో కమ్మ గుండేది
అద్ద రూపాయి కైకిలికి పొద్దుగూంకే దాకా పనిజేసేటోళ్లు
పాతిక రూపాలకు పాలేరు ఏడాదంతా గాసం జేసేది
కుంచెడు గింజలకు గా దొర దగ్గర
మగాణం కయితాలు రాసిచ్చి
కోడి తొలికూతకు లేసి పడమటిన గోరుకొల్లు పొడవంగానే ఎరువు బండ్లు గట్టి మూనిమాపు దాకా ఒళ్ళరిగేలా కట్టవడ్డ
పండుగ నాడు కూడా ఉపాసమే ఉండేది
కూలోడికి గంజి నీళ్లు కూడా దొరక్క తొవ్వ పొంటి దొర్కిన పండ్లను తిని బుక్కెడు నీళ్లు తాగి మోట గొట్టేదని అప్పటి ముచ్చట్లను కళ్ళ వాకిలి ముందు తాత గిట్ల శాన్క జల్లిండు
- హరీష్ తాటి, 9553152939