Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరుకు ప్రదేశం
పెన్సిల్ మొన తప్పితే
వేళ్ళు కూడా బయటే
నాలుగు గీతల ఆంక్షల
మధ్యలో చిన్న గడి
అక్షరం బయటకు రాకూడదు
ఏమూలలోనూ అంటకూడదు
వేళ్ళు ముడిచి బలంగా పట్టుకుని
అనుకుంటూ రాయాలి మెలికీ ''శ''
గజిబిజి అక్షరం
ఎలా కలపాలి
తలకట్టు దాన్ని మెడ కింద సున్నా
అనుకోవడం తేలికైన పనే
కలిపి రాయడం పసితనానికి పరీక్ష
కొట్టివేతలు
చెరిపివేతలు
ఏమరుపాటులో అనుకున్న
హద్దులు దాటిపోతుంది
ఒక పెట్టె తో సరిపోదు
అనేక పెట్టెల్లో రాయాలి
రాసినదాన్నే మళ్ళీ మళ్ళీ
తిప్పి తిప్పి రాయాలి
విసుగొచ్చినా
నిద్రొచ్చినా
రేపటికి ఈ రోజు పని ఒప్పజెప్పాల్సిందే
పుస్తకాల్లో పిల్లలు రాస్తుంటే
ముచ్చటేస్తుంది
వాళ్ళకి తెలియకుండానే
ఒక్కో గడిలో ఒక్కో జీవితం రాస్తారు పిల్లలు
కొన్ని శుభ్రంగా
కొన్ని వంకరగా
మరికొన్ని అస్పష్టంగా
గడులన్నీ నిండిపోతాయి
హమ్మయ్య రేపటికి భయం లేదు
కొలమానం ఎలాఉన్నా
ముందు పనైతే జరిగిపోయింది
ఎంత ఎక్కువ ఓర్పుఉంటే
అన్ని ఎక్కువ మార్కులు
అక్షరాలకైనా
జీవితానికైనా
ఓపికే కొలమానం
- అనిల్ డ్యాని, 9703336688