Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు జెండా వందనం అనగానే
తాడు కు కట్టిన జిలేబీలను
చేతులు వెనుకు కట్టుకొని
ఊరిల్లు ఊరగా
నోటితో అందుకునే ప్రయత్నం చేసే
ఆట జిలేబి రేస్
ఇప్పటికీ ఇంకా అందని తీపి
నోరును చేదు చేస్తుంది
ఎందుకో ఏమో కానీ
ఇవ్వాళ్ళ నాకు యాదికి వచ్చి
కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది
పంద్రాగస్టు పండుగ వచ్చినప్పుడల్లా
మబ్బులు లేసి స్నానం చేసి
చెంబు ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కొని
నెత్తికి నూనె పెట్టి నున్నగా దువ్వి
బడికి పోతే స్కూల్లో సార్లు
ఆటల పోటీల్లో ఆడిపించే
కప్ప దుంకుల ఆట
నా మనసుకు ఏమైందో ఏమో కానీ
నేడు జ్ఞాపకం వచ్చి
నన్ను లోపల్లోపల
ముసిముసిగా నవ్వుకునేలా చేస్తుంది
జెండా ఎగరేసి పెద్ద సార్లు అందరూ
విద్యార్థులము మేము
సెల్యూట్ చేసి జనగణమన గీతం
సామూహికంగా పాడే వాళ్ళం
అనంతరం దేశం స్వాతంత్య్రం
గాంధీ నెహ్రు
రాజ్యాంగం అంబేద్కర్
తదితర అంశాలను
ప్రస్తావిస్తూ ఉపన్యాసాలు సాగేవి
అంతా అయిపోయాక
ఊరి పెద్దలకు లడ్డూలు
మాకు చాక్లెట్లు బిస్కెట్లు పంచేవారు
వివక్ష ఎందుకో మరి
నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం
ఈరోజు నా మననంలోకి వచ్చి
నన్ను కుదిపేస్తుంది
నాలుగు కాళ్ల పరుగులో
నా సోపతి కాడు ఉరకలేక
ఇద్దరం ఇరుసుక అడ్డం పడ్డప్పుడు
మోచేయిలు మోకాళ్లు కొట్టుకపోగా
సారు వచ్చి దూదితో
టీచర్ టింక్చర్అయోడిన్
అద్దినప్పటి మంట
నా మోకాళ్ళ పైని
గాయాలను నిమరితుంటే
ఈ రోజు ఒక్కచోట
నిలువనియడం లేదు ఇప్పుడు
చిన్నప్పటి అయోడిన్ పెట్టినప్పటి మంట
నా గుండెల్లో నెగడుగా మండుతుంటే
జనగణమన అధినాయక జయహే
వందేమాతరం వందేమాతరం
అని పిడికిలెత్తి గొంతెత్తి
పిలుపునివ్వాలనిపిస్తుంది
- జూకంటి జగన్నాథం