Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో అనేక రచనలతో పాఠకలోకాన్ని అలరించిన కవయిత్రి శ్రీమతి పులి జమున ఇప్పుడు వడిచర్ల సత్యం రూపొందించిన మణిపూసల ప్రక్రియలోనూ ''అమృత వర్షిణి'' పుస్తకంతో మళ్లీ ఒకసారి రసహృదయులకు చేరువయ్యారు. ఇదివరకే కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, సమీక్షలు, పద్యాలతో తెలుగు సాహితీ వనంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పులి జమున అమృత తుల్యమైన మణిపూసల మాలను కూర్చి, తెలుగు కళామ తల్లికి అలంకరించారు.
అమృత వర్షిణి పుస్తకంలోని మణిపూసలన్నీ ఆణిముత్యాలే. చక్కని సామాజిక స్పృహ కలిగిన కవయిత్రిగా, ఉపాధ్యాయురాలిగా పులి జమున ఇందులో అనేక అంశాలను ఇతివృత్తంగా చేసుకుని చిత్రీకరించిన రచనా తీరు ప్రశంసనీయం. కవయిత్రి తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని అక్షరబద్ధం చేసింది. ఈ గ్రంథంలో 41 శీర్షికలతో 240 మణిపూసలు సమకూర్చారు. ప్రతీ కవిత ఒక మధురమైన భావాన్ని తలపిస్తుంది. మచ్చుకు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుపుతూ రాసిన ఒక మణిపూస చూద్దాం.
''అమ్మభాష కమ్మదనము
తేనె కన్న తీయదనము
అందించే సోయగాల
తెలుగు భాషకు వందనము!''
అంటూ మాతృ భాషా మాధుర్యాన్ని, వైభవాన్ని కీర్తించారు.
తెలుగు సాహితీ జగత్తులో విశిష్ట స్థాయిలో నిలసిన పోతన, కాళోజి, దాశరథి, సినారె, శ్రీశ్రీ వంటి వారిని స్మరిస్తూ పేర్కొన్న మణిపూసలు రచయిత్రి సాహిత్యాభిమానానికి నిదర్శనంగా నిలుస్తాయి. అంతేగాక ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్, మహాత్మా గాంధీ, వీర సింహం సర్వాయి పాపన్న గౌడ్ల గురించి చెప్పిన మణిపూసలు స్ఫూర్తినిచ్చేలా సాగినాయి.
అలాగే ''ఓటరుడా మేలుకో'' శీర్షికన అందించిన మణిపూసలు సమాజంలో చైతన్యం నింపేలా ఉన్నాయి.
''ప్రలోభాలకును లొంగకు
హామీలకు ఓటేయకు
మాయమాటలను నమ్మి
డబ్బులకు అమ్ముడుపోకు!''
అంటూ ఓటు విలువను తెలియజేస్తూ రచించిన విషయాలు ఓటర్లను ఆలోజింప జేస్తాయి.
మన జీవన విధానంలో భాగమైన బోనాలు, సంక్రాంతి, రాఖీ, శ్రావణమాసం, ధనుర్మాసం, హౌళి పండుగలను ప్రస్తావిస్తూ చెప్పినవి మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను, పల్లె సోయగాలను వర్ణిస్తూ రాసిన మణిపూసలు బాగున్నాయి.
''అన్నం పెట్టు కర్షకులు
శ్రమ చిందించు కార్మికులు
పురోగతికి పునాదులు
శ్రమను నమ్మిన శ్రామికులు!''
అంటూ రైతుల, శ్రామికుల గొప్పతనమును గురించి విరచిత మణిపూసలు బాగున్నాయి.
ఈ కృతిలో మరొక విశేషం ఏమిటంటే కొన్ని కథానాత్మకమైన మణిపూసలను కూడా అందించారు. తెలివిగల వంకాయ, ఎలుక కథ వంటి శీర్షికలతో రాసినవి ఒక వినూత్న ప్రయోగం అని చెప్పవచ్చు.
ప్రపంచాన్ని కలవర పెట్టిన కరోనా మహమ్మారి గురించి, వందేల్ల ఉస్మానియా విశ్వ విద్యాలయ వైభవం గురించి కూడా అందమైన మణిపూసలు రాశారు. ''ఏప్రిల్ 26 మణిపూసల కవితా దినోత్సవ'' సందర్భంగా రాసిన మణిపూసలు ఈ ప్రక్రియ పట్ల రచయిత్రికున్న అభిమానాన్ని, పట్టును తెలియజేస్తున్నాయి.
పలుకులు తేనె కావాలి
మోమున నవ్వు విరియాలి
మనిషికి ఆభరణమైన
మంచితనమే నిలవాలి!
అంటూ మనిషికి మాత్రమే ప్రత్యేక వరమైనది చిరు నవ్వువని, మంచితనమే ఆభరణం వంటిదని పోల్చి చెప్పారు.
చివరగా వీరులకు వందనం అంటూ సైనికుల గురించి రాసిన మణిపూసల్లో....
''ప్రజల రక్షణ లక్ష్యమై
దేశభక్తియె ధ్యేయమై
విధిని నిర్వహించె నతడు
కుటుంబానికి దూరమై!''
అంటూ సరిహద్దులో రాత్రి పగలు దేశానికి రక్షణగా ఉండే సైనికుల వీరత్వమును తెలియజేశారు. చక్కని పదపొందికతో, అందమైన భావజాలంతో కూర్చిన ఈ మణిపూసలివి.
- కందుకూరి భాస్కర్ 9703487088