Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అని శ్రీశ్రీ అంటే, అదే రీతిలో 'తోడికోడళ్లు' సినిమాలో కారులో షికారుకెళ్లే అన్న పాటలో.. ''చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా, మేడకట్టిన చలువరాయి. ఎలా వచ్చెనో చెప్పగలవా.. కడుపు కాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి చేర్చి తీర్చినారు తెలుసుకో'' అంటూ కథానాయకుడితో చెప్పించిన సామ్యవాది ఆత్రేయ. చాలా మంది ఈ పాట శ్రీశ్రీ రాశారేమో అనుకుంటారు. అలాగే 'ఆకలి రాజ్యం' సినిమా అంతా శ్రీశ్రీ మహాప్రస్థానం వల్లెవేస్తూ హీరో కనిపించినా.. ''సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్'' పాట ఆనాటి నిరుద్యోగ పరిస్థితుల మీద ఆత్రేయ సంధించిన వ్యంగ్యాస్త్రం. అదే పాటలో ''ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా'' అని సూటిగా సమాజాన్ని ప్రశ్నించింది. అలా రాయడం ఆయనకే చెల్లింది. ఆ పాట ప్రాసంగికత నేటికీ ఉంది. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇంకా ఆకలి రాజ్యం పరిస్థితులే నెలకొని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆత్రేయ తొలినాళ్ల నుంచి అభ్యుదయ భావాలతోనే పెరిగాడు. అన్యాయాలను దునుమాడేవాడు. లోకంలోని చెడ్డను ఏవగించుకునేవాడు. పదమూడేండ్ల వయసులో 'దేవుళ్లదంతా అన్యాయమే' అంటూ తొలి కవితతో కలాన్ని ఝుళిపించారు. దేవుళ్లు న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఇలా ఎందుకు వుంటుందని ఆయన ప్రశ్న.
ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట సమీపంలోని మంగళం పాడు గ్రామంలో జన్మించారు ఆత్రేయ. చదువుకొనే రోజుల్లోనే ఆదర్శ భావాలు పలికిస్తూ పాటలు, నాటకాలు రాసి అలరించారు. 'క్విట్ ఇండియా ఉద్యమం'లో పాల్గొనడానికి చదువును వదిలేశారు. జైలుకు వెళ్ళారు. విడుదలై వచ్చాక 'జమీన్ రైతు' పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేశారు. ఆత్రేయ కలం నుండి జాలువారిన పలు నాటికలు, నాటకాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో ''భయం, విశ్వశాంతి, కప్పలు, గౌతమబుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తనం, ఎదురీత, ఎన్జీవో'' వంటివి విశేషాదరణ చూరగొన్నాయి. నాటకాల్లో ఆయన పలికించే పదాలు విని అనేక సినిమా జీవులు మురిసిపోయేవారు. ఆయన గురించి గోపీచంద్ ద్వారా తెలుసుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు తన 'దీక్ష' చిత్రం ద్వారా ఆత్రేయను చిత్రసీమకు పరిచయం చేశారు. 'దీక్ష'లో ఆత్రేయ రాసిన తొలి పాట ''పోరా బాబూ... పోయి చూడు లోకం పోకడ...'' ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకుంది. ఆరంభంలో కొందరు ఆత్రేయతో కేవలం మాటలే రాయించుకున్నారు. కొందరు అడపాదడపా పాటలు రాసే అవకాశం కల్పించారు. ఏది రాసినా, అందులో తనదైన బాణీ పలికించేవారు ఆత్రేయ. అన్నపూర్ణ వారి 'తోడికోడళ్ళు'లో ఆత్రేయ రాసిన ''కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి దానా...'' పాట ఆ రోజుల్లో యువకులను ఎంతగానో మురిపించింది. అలాగే 'ముందడుగు'లోని ''కోడెకారు చిన్నవాడా... వాడిపోని వన్నెకాడా...'' సాంగ్ మరింతగా అలరించింది. ఇలా పాటలు రాసుకుంటూ, మాటలు పలికిస్తూ ఆత్రేయ చిత్రప్రయాణం సాగింది.
''మనను మూగదే కానీ... బాసుండది దానికి...'' అంటూ మనసు భాషను పాటలో పలికించిన ఘనుడు ఆచార్య ఆత్రేయ. ''మనసు గతి ఇంతే...'' అంటూ మనసు స్థితిని వివరించిన ధీశాలి ఆయన. ''మౌనమే నీ భాష ఓ మూగ మనసా...'' అంటూ మనసు ఏ పరిస్థితుల్లో ఎలాంటి భాష పలుకుతుందో కనుగొన్న పరిశోధకుడు మన ఆత్రేయ. అందుకే సమకాలిక కవులు ఆత్రేయను 'మనసు కవి' అన్నారు, అంతేనా 'మన సుకవి' అనీ కీర్తించారు. 'మనసు'పై ఎందరో కవులు, సినీ గీతరచయితలు పాటలు రాసినా, 'మనసు' అన్న పదాన్ని తన హక్కుగా గైకొని ఆత్రేయలా ఉపయోగించుకున్న గీతరచయిత మరొకరు కానరారు.
ఆదుర్తి సుబ్బారావు ఆత్రేయను బాగా ప్రోత్సహించారు. ఆదుర్తి చిత్రాలకు ఆత్రేయ రాసిన అనేక పాటలు పండిత పామరులను రంజింప చేశాయి. కొన్ని చిత్రాలలో మాటలు-పాటలు రెండూ ఆత్రేయనే పలికించేవారు. అలా కూడా అనేక చిత్రాలు జనం మదిని దోచాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్, యువచిత్ర వంటి నిర్మాణ సంస్థలు ఆత్రేయను తమ ఆస్థాన కవిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆత్రేయ పాటలు లేకుండా సినిమాలు తీయలేమనీ కొందరు నిర్మాతలు అనేవారు. అలాగే ఆత్రేయ కన్నుమూసిన తరువాత వారు మాటపై నిల్చున్నారు. అంతలా అభిమానం సంపాదించారు ఆత్రేయ. ఆయన గీత రచనలో చివరగా వెలుగు చూసిన చిత్రం 'నారీ నారీ నడుమ మురారి'. 1989 సెప్టెంబర్ 13న ఆచార్య ఆత్రేయ తుదిశ్వాస విడిచారు. ఎందరో భావి సినీగేయరచయితలకు ఆయన పాటే శ్వాసగా మారి బాట చూపింది.
'అనుక్షణం మరణభయం
జీవన సంభ్రమణ భయం
అంధకారం అయోమయం
ఆర్తనాద సంకులం
మనిషికి మనిషన్న భయం
మనసంటే మనకు భయం
సత్యమన్నచో సచ్చే భయం
చచ్చు దాకా చావు భయం'...
ఇది ఆత్రేయ తన 'భయం' అనే నాటకం కోసం రాసిన పాట. కవిని దార్శనికుడు అంటారు. ఇవాళ్టి సన్నివేశానికి ఈ పాట సరిగ్గా సరిపోలేదూ? ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం ఆత్రేయ దీనిని రాసి ఇవాళ్టి సన్నివేశానికి సిద్ధం చేశాడా? ఏమో అనిపిస్తుంది.
- అనంతోజు మోహన్ కృష్ణ
(13న వర్థంతి సందర్భంగా...)