Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక దేశం పాడిన చైతన్య గీతం
ఆ మట్టి నిండిన ధైర్యం చిరునామా
అనంత సంవేదనలు భావోద్వేగాల
అలలు తాకే సుందర తీరాలలో
అనేకానేక అనుభవాల దుఃఖాల చుక్కాని
వివిధ రీతుల జీవితం చవి చూసిన
గంజి కుండ
మత మౌఢ్యం పెచ్చరిల్ల అశాంతి
అధికార దాహం పారే రక్త నది
కుల కార్పణ్యాలు ఎగసే మంట
మనిషిని చీల్చే కుటిల వేట
మత పిచ్చీ కుల చిచ్చునూ
ఛేదించే సామాజిక ఖడ్గం
ఓ మానవీయ కరచాలనం
విశ్వవీణ తీగలు మీటే
రుద్ర వీణ గానం శాంతి కోసం
రాజకీయ రాచపుండులో
పుట్టి పెరిగే విష క్రిములు
లిఖించేటి ఉన్మాద విద్వేషాలు
చేసేను లోతైన కొత్త గాయాలెన్నో
విశాల ఆవని హృదయ సీమపై
విశ్వంలో తిరుగాడే
ఘన సాంద్ర ఫేన నిర్మల మనసు
అమేయమైన క్షేత్రంలో
నిస్వార్థ వనాల పూలన్నీ
పూచినవి పరోపకార దోసిట
కాంతి ఊటలో సృజన జన హితమే
నింగి నేలల్లో స్వేచ్ఛ గాలి వీస్తుంది
వినిపించిన కొత్త గొంతు రాగమైంది
మట్టి వాసనలు వెదజల్లిన జగతిలో
ఒలికిన కడవ నీరు తీర్చు దప్పిక
నీటి బాట రాసే గొప్ప జల కావ్యమై
గగనమే పాడింది ప్రజా ప్రగతి పాట
- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
984935871