Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.పి.అశోక్ కుమార్ 'తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం' అన్న పుస్తకానికి ముందుమాట రాసిన ఎ.కె.ప్రభాకర్ తెలుగులో గొప్ప నవల రాలేదంటూ డా.కేశవరెడ్డి, బాలగోపాల్ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు మన రచయితల మేధాస్థాయి, సృజనశక్తి సరిపోలేదని చెప్పుకోవటమే సరైన జవాబు భవిష్యత్తులో గొప్ప నవల వస్తే శ్రామిక వర్గం నుండి రావచ్చునేమోననిపిస్తుంది. శ్రామికుల కుండే జీవితానుభవం ఇతరులలో కనిపించకపోవడం ఒక కారణంగా భావిస్తున్నాను.
'తెలుగు నవల ప్రయోగ వైవిద్యం' వంటి విస్తృత ప్రాతిపదిక మీద పరామర్శించవలసి వచ్చే అంశాల మీద విమర్శనా వ్యాసాలు రాయదలుచుకున్న ఎవరికైనా విస్తృతమైన పఠనం తప్పనిసరి. తెలుగు ఆంగ్ల భాషలోని వేల పుస్తకాలను అధ్యయనం చేసిన అశోక్‌కుమార్‌కు ఇందుకు సంబంధించిన పూర్తి శక్తి స్థాయి సామర్థ్యాలున్నాయని భావించవచ్చు.
'అంపశయ్య నుంచి అంతస్సవంతి వరకు' అన్న వ్యాసంలో నవీన్ రాసిన అంపశయ్య, ముళ్ళపొదలు, అంతస్సవంతి అన్న మూడు నవలలు నవలాత్రయం అని ప్రతిపాదించారు అశోక్ కుమార్. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు చూపించారు. ఒకటి అంపశయ్యలోని నాయకుడు రవితో పాటు మరో నలుగురు వేణు, రమేష్, సాగర్, నిధి వారివారి మౌలిక స్వభావాలతో ఆ తర్వాతి రెండు నవలల్లో కొనసాగుతారు. వారంతా స్నేహితులు, ఒకే వయోవర్గం వారు. మూడు 'అంపశయ్య' లోని జీవన లక్షణమైన చైతన్య స్రవంతి అన్న మనోవైజ్ఞానిక లక్షణమే తరతమ భేదాలతో కొనసాగుతుంది. నాలుగు ఈ మూడు నవలల్లో కథాకాలం పదహారు గంటలే. ఈ నవలలోని జీవితం క్రమానుగతంగా వాస్తవికతకు దగ్గరవుతుంది. ''శిల్పం శిల్పం కోసమే' అన్న యాంత్రిక ధోరణిలో కాక ఆయా పాత్రల అంతరంగాల మీద వెలుతురును ఫోకస్ చేసే నిమిత్తమే అంపశయ్య నవీన్ చైతన్య స్రవంతి శిల్పాన్ని వాడుకున్నారని అశోక్‌కుమార్ అభిప్రాయం.
'కాలరేఖలు' నవలలో 1944 నుండి 1956 వరకు, 'చెదిరిన స్వప్నాలు' నవలలో 1927 నుండి 1970 వరకు, 'బాంధవ్యాలు' నవలలో 1970 నుండి 1995 వరకు ఉన్న జీవితాన్ని చిత్రించారంటున్నారు. తెలుగు సాహిత్యంలో రెండు సీక్వెల్ నవలలు, లేదా రెండు నవలాత్రయాలను రాసిన వారెవరూ లేరు. ఒక్క అంపశయ్య నవీన్ మాత్రమే పరిణత ప్రయోగాన్ని చేయటం ద్వారా నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. సత్యాన్ని గుర్తించి ప్రకటించటమే పరిశోధన. ఆ పని అశోకకుమార్ చేయగలిగారు.
'ఊబిలో దున్న' నవలతో విఖ్యాతి పొంది, ఆతర్వాత 'కమెండో' పత్రిక ద్వారా పేరు పొందిన వినుకొండ నాగరాజు ఆరు నవలలు రాశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. సాహితీలోకం మరిచిపోయిన విషయాన్ని శీలావీర్రాజు గారి ద్వారా తెలుసుకొని పరిశోధన చేసి వివరాలు వెల్లడించి నందుకు నిజంగా అశోక్‌కుమార్ అభినందనీయులు. ఇంతకూ ఆ ఆరు నవలలు - 'నన్ను పిలిచింది' (1962), 'తాగుబోతు' (1962), 'ప్రేమికుడు' (1963) 'ఎంతదూరం' (1964) 'ఊబిలో దున్న' (1970) 'సువర్ణ' (అలభ్యం) ఉన్నాయి. వీటిలో 'ఊబిలో దున్న' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించింది. కాని రచయిత దాన్ని స్వీకరించలేరు.
'నన్ను పిలిచింది' నవల భారత్-చైనా యుద్ధ నేపథ్యంలో దేశభక్తిని చాటుకునే వ్యక్తుల మనస్తత్వాలను, త్యాగాలను ప్రధానంగా ప్రకటించిన నవల. 'తాగుబోతు' నవల తాగుబోతు అయిన మాదిగ లింగడి స్వగతం. పొద్దున లేచింది మొదలు పడుకునే దాకా ఆయన దినచర్య ఇది. అతనికి ఎదురయ్యే కష్టనష్టాలు అవమానం, ఆవేదన వీటన్నిటి సమాహారమే ఈ స్వగతం. ఇతర మనోవైజ్ఞానిక లక్షణాలతో పాటు, అంతర్ముఖీన ప్రవృత్తి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రచయిత ఈ నవలను మనో వైజ్ఞానిక నవలగా భావించలేదు. 'ఊబిలో దున్న' నవల ఊబిలో చిక్కుకున్న దున్నపోతు పై జాలి దలచి రాఘవయ్య ప్రాణాలకు తెగించి రక్షించి పైకి తీస్తాడు. అది అతణ్ణి కుమ్మటానికి వస్తే తప్పించుకుంటాడు. స్థూలంగా ఇందులోని ఇతివృత్తమిది. మనోవైజ్ఞానిక నవలల్లో కాని, ఆ లక్షణానికి దగ్గరగా ఉన్న నవలల్లో కాని కథ పెద్దగా ఉండదు, దున్నపోతును రక్షించేందుకు రాఘవయ్య చేసే రకరకాల ప్రయత్నాలు వీటితో పాటు తన జీవితపు ఘటనలు, అనుభవాలు అనుసంధానమై చిత్రితమవుతాయి. అశోక్ కుమార్ పరిశీలనలో - చైతన్యానికి రాఘవయ్య, జడత్వానికి దున్నపోతు, రక్తం పీల్చే జలగలకు బ్లాక్ మార్కెటీర్లు, కోర్టు గుమాస్తాలు, డాక్టర్లు - ప్రతీకలుగా తేలుతారు. 'ఊబిలో దున్న'ను పాక్షికంగా మాత్రమే మనోవైజ్ఞానిక లక్షణాలున్న సామాజిక నవలగా అశోక్ కుమార్ భావిస్తున్నారు.
'ఊబిలో దున్న' నవలకు 'ఎర్నెస్ట్ హెమింగ్వే' ఓల్డ్ మాన్ అండ్ ద సీ' నవలకు మధ్య పోలికలున్నాయని అంటున్నప్పుడు అశోక్కుమార్లోని, తులనాత్మక పరిశీలనాశక్తి వెల్లడవుతుంది. మొత్తం మీద వినుకొండ నాగరాజు నవలలన్నీ ప్రయోగాత్మకాలేనని, ఒక నవలకు మరోనవలకు పోలిక లేదని అశోక్ కుమార్ భావిస్తున్నారు.
డా. ఎం.వి. తిరుపతయ్య ఎమర్జెన్సీలో మానసికమైన వేదనకు గురైన రచయిత. అతడనుభవించిన రంపపు కోతను అంపశయ్య నవీన్ 'చీకటి రోజులు' పేరిట రాసిన ఒక నవలలో చిత్రీకరించారు. ఎంవి. తిరుపతయ్య రచించిన రెండునవలలు ప్రసిద్ధి పొందినవే, బతుకు (1987) అన్నవారి తొలి నవలకు ఒక మాసపత్రిక బహుమతి ప్రకటించింది. ఆ తర్వాత 'జీవనసమరం' అన్న నవలను రచించారు. ఈ రెండు నవలల్లోనూ వర్గ సంఘర్షణను గుర్తించారు అశోక్ కుమార్.
'బతుకు' నవలలో రాజ్యహింసను తట్టుకోలేక ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అవుతున్న దారుణ పరిస్థితిలో రామలింగం కుటుంబం సొంత ఊరును వదిలి వలసపోవటం అనే కలచివేసే దుస్థితికి అద్దం పడుతున్నది. ప్రధానంగా వ్యవస్థను ప్రశ్నిస్తున్న శ్రామికవర్గానికి చెందిన యువకులు లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఫలితంగా చెలరేగిన అంతర్ బహిర్ సంఘర్షణ ఈ నవలలో చిత్రితమైందని అశోక్ కుమార్ గుర్తించారు.
ఇక రెండో నవల 'జీవన సమరం' (2006) ఎం.వి. తిరుపతయ్య క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత రాసిన నవల. ఈ నవలలో కూడా వర్గ సంఘర్షణ రాజ్యహింసలకు సంబంధించిన వస్తువే కనిపిస్తున్నది. అయితే నందు అనే పిల్లవాడి దృక్కోణం ప్రధానంగా చిత్రితమైంది. అయితే అశోక్ కుమార్ దృష్టిలో ఇది తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని బాగా చిత్రించిన నవల.
కథలు, నవలలు రాస్తున్న ఈ తరం రచయిత్రులలో 'గీతాంజలి' చెప్పుకోదగ్గవారని, వారు అభ్యుదయ మార్క్సిస్ట్ దృకోణంలో ఒక డాక్టర్‌గా అందిస్తున్న సేవలు ప్రత్యేకమైనవని అశోక్ కుమార్ అంటున్నారు. గీతాంజలి రచించిన 'ఆమె అడవిని జయించింది' నవలను గూర్చి ప్రస్తావించే ముందు అశోక్ కుమార్ ఎమర్జెన్సీ తర్వాత స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయ్యే మధ్య కాలంలో రూపుదిద్దుకున్న భావజాలం గూర్చి 'కుటుంబం, రాజ్యం అన్ని వ్యవస్థలు స్త్రీకి వ్యతిరేకంగా ఎలా పని చేస్తాయో అర్థం కాసాగింది. తత్ఫలితంగానే స్త్రీల సమస్యలకు మార్క్సిస్ట్ జీవితాచరణ నుండి పరిష్కారం లభిస్తుందన్న చైతన్యంతో ప్రారంభమైన ఈ కాలపు స్త్రీల సాహిత్యం, సమస్త పితృస్వామిక వ్యవస్థలను ధిక్కరించి స్త్రీ స్వతంత్ర ప్రతిపత్తి నిలుపుకోవటానికి ఎన్నుకునే జీవనవిధానం నుండి పరిష్కారం లభిస్తుందన్నంత వరకు మారుతూ వచ్చింది' అని అనటమే కాక ఈ నవలను స్త్రీకి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించిన తొలి స్త్రీవాద నవలగా కూడా అశోక్ కుమార్ గుర్తిస్తున్నారు.
కథారచనలో ఆరితేరిన పెద్దింటి అశోక్ కుమార్ రాసిన 'జిగిరి' నవలిక విలక్షణతను బాగా విశ్లేషించారు, కె.పి. అశోక్ కుమార్. ఆటవికమైన కర జంతువు ఎలుగు బంటి మనిషి శిక్షణలో సాధు జంతువుగా మారిపోతుంది. మనిషి అదుపు ఆజ్ఞల్లో ఉంటూ ఆడమన్నట్టు ఆడుతూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. క్రమశిక్షణతో పాటు కొంత మానవత్వం కూడా అలవడు తుంది. ఆ క్రమంలో వచ్చిన సమస్యలను సంఘర్షణ లను పెద్దింటి అశోక్‌కుమార్ హృద్యంగా చిత్రించాడంటున్నారు కె.పి. అశోక్‌కుమార్. యజమాను రాలు తన ఏడాది కొడుక్కు ఒక రొమ్ము, పిల్ల ఎలుగు బంటికి ఒక రొమ్ము పాలను ఇచ్చి పెంచు తుంది. ఇది జంతువు పట్ల మాన వత్వం ప్రదర్శించటమే. అయితే సర్కారువారు నిరుపేదలకు రెండెకరాల భూమి ఇచ్చే పథకంలో ఈ కుటుంబాన్ని కూడా చేర్చేస్తారు. ఎలుగుబంటిని పెంచుకుని ఆడిస్తే అది వన్యప్రాణి చట్టానికి వ్యతిరేకమవుతుంది కనుక దాన్ని వదులుకునే ప్రయత్నంలో ఎంతో సంఘర్షణకు గురవుతారు. సాధు జంతువుగా మారిన ఎలుగుబంటిని అడవిలోకి తరిమేస్తే అది సాటి జంతువులతో పాటు సహజంగా ఉండలేదు. దానికి ఆటవిక సమాజం కాదు, కావలసింది మానవ సమాజం. ఆటవిక జంతువులు దాన్ని ఉ ండనీయవు. ఈ పరిస్థితి దానికి ప్రాణాంతకం కాక తప్పదు. అందుకే ఎలుగును పెంచి పెద్ద చేసిన యజమాని దాన్ని అడవిలో చంపేసి రావటానికి తీసుకువెళ్తాడు. కాని యజమాని గాని ఎలుగు గాని మానవ సమాజంలోకి తిరిగి రారు! ఈ ఆశ్చర్యకరమైన ముగింపు మనిషీ మృగమూ ఏర్పరచుకున్న ప్రేమానుబంధాల మూలంగా ఆ ఇద్దరూ ఒకే రకమైన పర్యవ సానాన్ని ఏర్పరచుకోక తప్పలేదన్న సత్యాన్ని వెల్లడించిందన్నది విమర్శకుని భావన.
దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన తొలి నవలను గూర్చిన వ్యాసం 'ఆత్మకథలో నవలా లక్షణాలు అన్నది 'ఊరువాడ బతుకు పరిశీలన.' బాల్యంలోని సార్వజనీన అంశా లను కధానాయకునికి వర్తింపజేయటం మూలంగాకృష్ణమూర్తి తమ బాల్యానికి కాల్పనికతను సాధించగలిగారన్నది అశోక్ కుమార్ భావన. గీతాలు సంస్కృతిపరంగా, నవలా ప్రక్రియకు ఒక చేర్పు. వచనము, పాటల సమ్మేళనం ఒక మంచి ప్రయోగం కాగలిగిందని భావిస్తున్నారు అశోక్ కుమార్, రైతాంగ పోరాటం సమసి పోయిన తర్వాత భూస్వాముల్లో మార్పు వచ్చి గ్రామంలో ఉన్న ఆర్థికంగా తక్కువ స్థాయి శ్రామికులతో సంస్కారంతో ప్రవర్తించి ఉంటారని సాధారణంగా అనుకునే అవకాశం ఉంది. కాని అది తప్పని, వారి దాడులు కొనసాగుతూనే వచ్చాయన్న కఠిన సత్యాన్ని ఈ నవల వేనోళ్ళ చాటుతుందని, ఒక్క కుటుంబం తప్ప తక్కిన కుటుంబాలు వేరే ఊళ్ళకు వలసపోవటమే ఇందుకు నిదర్శనమని విమర్శకుని భావన. తెలంగాణ జీవితాన్ని సాధారణంగా నల్లగొండ జిల్లా జీవితాన్ని ప్రత్యేకంగా చిత్రించిన నవల ఇది.
ప్రముఖ కథకుడు, నవలా రచయిత సలీం రచించిన 'వెండిమేఘం'ను తొలి తెలుగు మైనారిటీ నవలగా గుర్తిస్తున్నారు అశోక్ కుమార్. ఒక మైనారిటీ రచయిత మైనారిటీ వర్గ సమస్యలను వస్తువుగా తీసుకొని నవల రాసిన విషయాన్ని గమనంలోకి తీసుకుంటూనే, అదివర వచ్చివున్న మైనారిటీ సమస్యలు వస్తువుగా ఉన్న రచనలను అశోక్ కుమార్ ప్రస్తావించటం మంచి పద్ధతి, రాసినవారు ముస్లిమేతరురైతే ముస్లింల పట్ల వారి వైఖరి ఎట్లా ఉందో చూడమంటారు విమర్శకుడు. ఈ అంశం మీద కవిత్వం, కథలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో సలీం 'వెండిమేఘం' నవలను పరిశీలించాలంటున్నారు. ప్రధానంగా దూదేకుల వారి దయనీయ జీవితాన్ని సమగ్రంగా చిత్రించిన నవలగా 'వెండిమేఘం' గుర్తించాలని కూడా అంటున్నారు.
ఇంకా ఈ గ్రంథంలో చాలా వ్యాసాలున్నాయి. ఎక్కడ కొత్తదనంతో కూడిన ప్రయోగం ఉందో గ్రహించి ఆ నవలలో దాని పాత్రను గ్రహించటంలో అశోక్ కుమార్ కృతకృత్యు లయ్యారు. అవసరమైన చోట తులనాత్మక విమర్శా పద్ధతిని అవలంబించారు. రచయితలో ప్రయోగాన్ని నవలలోని ఏ పార్శ్వంలోనైనా చేయవచ్చు. కొందరు కథాకథనంలో, కొందరు పాత్రపోషణలో, మరికొందరు మనోవైజ్ఞానిక లక్ష ణాన్ని అన్వయించటంలో, ఇంకొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవటంలో ప్రయోగాలు చేయవచ్చు. సరిగ్గా ఆ కీలకాన్ని గ్రహించి క్రమ పరిణామశీలంలో భాగంగా దాన్ని నిరూపించటంలో అశోక్‌కుమార్ ప్రదర్శించిన విమర్శనాత్మక ప్రతిభ అభినందనీయం.
- అమ్మంగి వేణుగోపాల్
9441054637