Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మభూషణ్ హరివంశ్ రారు బచ్చన్ హిందీలో రాసిన 'మధుశాల' కావ్యాన్ని అదే పేరుతో అంతే హృద్యంగా పద్యంగా మలిచారు ప్రముఖ తెలుగు సాహితీ వేత్త డాక్టర్ దేవరాజు మహారాజు. 'కవియే సాకీయై వచ్చాడు' శీర్షికతతో అద్భుతమైన ముందుమాట కూడా రాశారు. పుస్తకం చివరలో హరివంశ్ రారు బచ్చన్ జీవిత విశేషాల్ని ఎంతో ఆసక్తికరంగా అందించారు. ''భావుకత ఒక ద్రాక్షలత, లాగు కల్పనల తీగ జత కవియే సాకీయై వచ్చాడు నింపుకుని కవితా మధుపాత్ర ఇసుమంతైనా ఖాళీ అవదు, లక్షతాగినా లక్ష ఆగినా పాఠక జనమే తాగేవారు, పుస్తకమే నా మధుశాల'' నిజమే - ఈ కవితా పుస్తకం నిజంగానే ఒక మధుశాల!
ఒకసారి గాంధీజీని కలవడానికి హరివంశ్రారు బచ్చన్ వెళితే 'సారాయి కవిత్వం రాసే కవిని తాను కలుసుకోదలుచుకోలేదని' నిరాకరించారట. మధ్యలో ఒకరు కల్పించుకుని వివరణ ఇచ్చారట. 'ఆయన ఏ సారాయి గురించైతే చెపుతున్నారో అది సారాయి కాదు, ధ్యేయానికి సంబంధించిన సంకేతమని చెప్పగానే గాంధీజీ ప్రసన్నుడయ్యారట. మధుశాల కావ్యంలో బచ్చన్ మధువునీ, మధుశాలనీ సంకేత వైవిధ్యంతో విస్తృత పరిధిలో వాడారు. జఫర్, గాలిబ్, కులీ, వలీ వంటి కవులనేకుల మార్గంలో నడుస్తూనే 'మధువు' 'మధుశాల' 'మధుపాత్ర' 'సాకీ' వంటి పదాలను భిన్నంగా వాడి తన సమకాలీన జీవితాన్ని భిన్న కోణాల్లో ఆవిష్కరించారు. తాత్త్వికత, దేశభక్తి, మత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలను ప్రతీక శిల్పంలో ధ్వనిమయంగా వివరించటం విశేషం. ఉదాహరణకు 'మధుశాల' కు ప్రతీకగా సాగిన భిన్నమైన భావాలు ఎలా ఉన్నాయో గమనించండి.
''ఎవ్వడెంతటి రసికుడు అయితే, అంతటి రసమయము మధుశాల''
''ధ్యేయపు దారి పట్టుకు వెళితే గమ్యం కాదా మధుశాల''
''అనుభవించి అనుభూతులు పంచేర సంధ్యా సమయం మధుశాల''
''ప్రపంచానికి ఆదర్శం వ్యవసాయ భారతం మధుశాల''
''బలికోరీ స్వాతంత్య్రమే కాళిక - బలివేదిక మధుశాల''
''సామ్యవాద తొలి ప్రచార కేంద్రం - తక్కువదా ఇది మధుశాల?''
ఇవన్నీ కవితల్లోని నాలుగో పాదాలు. ఇలాంటివి పుస్తకం నిండా కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నయినా చెప్పుకోవచ్చు. మధుశాలను విభిన్నంగా ప్రతీకిస్తూ, భావాన్ని ఒక పతాక స్థాయికి తీసుకుపోవడం ఈ పద్యాల్లో చూస్తాం. ఇదొక శిల్ప విశేషంగా సాగి, పద్యాలన్నింటి ఏక సూత్రంతోకట్టి పెడుతుంది. హరివంశ్రారు బచ్చన్ కవితా ధారను, శైలిని పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఆవహించుకుని, ధీటుగా ఆ ప్రవాహాన్ని అలా తెలుగులో కొనసాగించడం మామూలు విషయం కాదు! ఈ అసమాన్యమైన కావ్యాన్ని ఎంతో బాధ్యతతో ప్రతిభావంతంగా నిర్వహించారు డా.దేవరాజు మహరాజు. బహుగ్రంథ కర్త అయిన వీరికి అనువాదకులుగా కూడా మంచి గుర్తింపు ఉంది.. స్వయంగా గొప్పకవి కావడం వల్ల కూడా హరివంశ్రారు స్థాయిని అవలీలగా అందుకుని, అనుసృజన చేయగలిగారు. అన్ని సాహితీ ప్రక్రియల్లో అరవైకి పైగా గ్రంథాలు ప్రకటించిన నిత్య సాహితీ కృషీవలుడు డా.దేవరాజు మహారాజు. వీరు పూనుకోకపోతే 'మధుశాల' ఇంత అద్భుతంగా తెలుగులోకి వచ్చేదికాదు.
'మధువు ఇతివృత్తంగా గొప్ప కవిత్వం పండించిన హరివంశ్రారు బచ్చన్ తాగుడుకు అలవాటు పడలేదు. మధుశాల రాసే నాటికి ఆయనకు మధువు రుచి కూడా తెలియదన్న విషయం తెలుసుకున్నాక, ఆయనపై గౌరవభావం కలిగి ఈ అనువాదానికి పూనుకున్నానని'' అన్నారు మహారాజు. నిజంగా సంతోషించదగ్గ విషయం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ పారస్పరిక ఆదాన ప్రదానమే అనువాదం. అనువాదాలద్వారా ఒక భాషలోని సాహిత్యం, మరో భాషలోకి చేరి ఆ రెండు భాషల వ్యవహర్తల మధ్య ఒక హృదయానుబంధం ఏర్పరుస్తుంది. అదే భిన్నత్వంలోని ఏకత్వానికి పటుతరం చేస్తుంది. జాతీయ సమైక్యతకు దోహద పడుతుంది. అందుకోసమైనా అనువాదాలు విరివిగా రావాలి. ఆ పనికి పూనుకోవడమే కాకుండా, ఎంతో విస్తృతంగా నిర్వహిస్తున్నందుకు ఈ అనువాదకుడిని మనసారా అభినందించాలి. మూల కవిత రాయబడ్డ భాషలో నాడి దొరికితే గాని, అనువాదంలో మూలంలోని లయ, లాలిత్యం, ఇతర సొబగులూ తీసుకురావడం సాధ్యం కాదు. హిందీ నుండి నేరుగా చేసిన ఈ అనుసృజనలో మూల కవితతోని మూల్యాలన్నీ ఉన్నాయి. హిందీ మూలంలో ఉన్న పాద లయను అలాగే తెలుగులోకి తేవడం గొప్ప విషయం. పాఠకుల సౌలభ్యం కోసం పుస్తకంలో మచ్చుకి కొన్ని మూల కవితలివ్వడం బావుంది. పోల్చుకోవడానికి, నిగ్గు తేల్చుకోవడానికి ఉపకరిస్తాయి.
మధుశాల - తెలుగు అనువాదం పుస్తకం చివర్లో హరివంశ్రారు అభిప్రాయాలున్నాయి. వాటి వల్ల ఆయన నిజాయితీ పాఠకులకు అర్థమౌతుంది. తన ఆత్మకథకు రాసుకున్న ముందు మాటలో హరివంశ్ రారు ఇలా అంటారు... ''ఒక సామాన్యుడి జీవితం ఎలాంటిదో, నా జీవితమూ అలాంటిదే. మరోసారి నా జీవితాన్ని నేను జీవించే అవకాశం లభిస్తే, ఇందులోని అన్ని లోపాలతో, పొరపాట్లతో, పశ్చాత్తాపాలతో మళ్ళీ నేను ఈ జీవితాన్ని ఇలాగే జీవించడానికి ఇష్టపడతాను!'' ఎవరి జీవితమో జీవించాలని ఎంత మాత్రమూ కోరుకోలేదాయన. ఎందుకంటే, ఎవరి జీవితంలో వారు వారిదైన ఒక గుర్తింపు పొందుతారని తెలిసిన వారు హరివంశ్రారు. ఆత్మకథ చివరి మాటలో ఇలా అంటారు - ''డెబ్బయ్యేడు సంవత్సరాల ఏడు నెలల ఏడు రోజుల వాణ్ణయి పోయాను. మానవీయ అసంపూర్ణతకు సంబంధించిన అనుభూతి ఈ మధ్య నాలో అధికమైంది. మహా భారతం ప్రకారం మనిషి ఈ వయసులోనే దేవతల్లో చేరిపోతాడు. మనిషి తనలోని గుణాలు, దోషాలు స్పష్టంగా తెలుసుకోవడమే దైవత్వం కాబోలు! కానీ అలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతమైన నిజ్ఞత ఏదీ నాకు కలిగినట్లు లేదు!'' - బచ్చన్ నిజాయితీ ఆయన కవిత్వంలో అక్షరాక్షరంలోనూ ద్యోతకమవుతుంది. అందుకే అంటారు
''వినిమయ జీవన విధి చట్రంలో మధువేమైనా దొరికేనా?
ఎంతో కొంత ఊరటనిచ్చి ఊపిరినిచ్చే సాకీబాల
మీ శూన్యపు ఘడియల మార్చి, ఇక సంతోషాలే కూర్చి
జీవన సాఫల్యం చేకూర్చే కల్పన, ఈ నా రచన మధుశాల''
''కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికీ
కోరకున్న మధుపాత్రా అంతే, అందదు కద నాకెప్పటికీ
వెర్రివాడివలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకీ
పిచ్చివాడివలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల''
ఇంకా ఓ చోట... పఠితని క్షితిజరేఖపై నిలబెట్టి మధుశాల ఊరిస్తుందనీ, ఈ కొంటె చేష్టల మధుశాల జీవితాలతో దాగుడుమూతలాడుతుందనీ- అంటారు!
''ఎంత చిన్నదీ జీవితము నేనెంత మధువని తాగుదును
పుట్టుకలోనే చావు ఉన్నదని చెప్పిరి కద మన పండితులు
స్వాగతములో ఒక గతము ఉన్నది అదియే కదా వీడ్కోలు?
తెరచుటలోనే మూయుట ఉన్నది నా జీవన మధుశాల!''
ఈ కావ్యం చదువుతూ ఉంటే కవి హృదయమే రసమయ మధుశాల అని అనిపిస్తుంది. ఆ మానస సరోవరంలోని పగలూ రాత్రుళ్ళనూ, హోలీ దివాలీలను మనసును హంసగా చేసుకుని, అత్యున్నతమైన తాత్త్వికతన అందుకోమని, మహోన్నతమైన జీవిత విలువల్ని తెలుసుకోమని... తెలుగు హృదయాలకు అవకాశం కల్పించిన డాక్టర్ దేవరాజు మహారాజు అభినందనీయులు. అన్ని రకాలుగా ఇది తెలుగు పాఠకులకు అందిన గొప్ప అనువాద కావ్యం.
- మాకినీడు సూర్యభాస్కర్, 9491504045