Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఘల్లున గచ్చు మీద రూపాయి
బిళ్ళ మోగినట్టు నిజాం వెంకటేశం వస్తాడు.
నన్నూ నా రోగాన్ని మందుల్నీ కవిత్వాన్నీ కవుల్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా.
కసితీరా తిట్టి మధ్యలో రూటుమార్చి
మహాశేతాదేవిని మెచ్చుకొని
తరచుగా సాహిత్య సభల్లో పాల్గొన
లేనందుకు నొచ్చుకుని
నాకో వందిచ్చుకొని మరీ నిష్క్రమిస్తారు.'
ఇది కవి, చిత్రకారుడు అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్, స్నేహ సూర్యుడు నిజాం వెంకటేశం సార్‌కు గీసిన కవితా చిత్రం. బహుశ ఇంతకు మించి నిజాం వెంకటేశం గురించి.. బాగా ఎవరం చెప్పలేమేమో! అదీ నిజాం సార్ నిజమైన రూపం. 'ద దిల్ కుచ్ కహా నహీణాతా, చుప్ బీ రహ సహీజాతా' అంటాడు ఉర్దూ కవి ఫైజ్ నాదీ అదే పరిస్థితి. నిజాం సార్‌తో నాది నాలుగు దశాబ్దాల పరిచయం... మూడు దశాబ్దాల సాన్నిహిత్యం. మొదట్లో సిరిసిల్లలోనే ఉన్న ఆయన, నేను విద్యార్ధిగా ఉండగానే జగిత్యాలకు షిఫ్టు అయ్యారు. అమ్మ సత్తెమ్మ, పెద్దమ్మాయి విశాల కోసం అప్పుడప్పుడు సిరిసిల్ల వచ్చేవారు. అప్పుడే మానేరు రచయితల సంఘం ప్రారంభించాం. వారి మరణానికి సరిగ్గా ఆరురోజుల ముందు కూడా ఆయనతోనే దాదాపు రోజంతా ఉన్నాను. అంతలోనే వారు లేరనే వార్త. ఇటీవల నాకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ప్రకటించినప్పుడు నాకంటే ఎక్కువగా ఆనందంతో ఉప్పొంగి పోయారు.
సిరిసిల్ల ప్రాంతంలో కవిగా, మలితరం విమర్శకులు గా, అనువాదకులుగా, ఆక్టివిస్టుగా పరిచయమైన నిజాం సార్ గురించి మాట్లాడడమంటే ఒక అయిదు దశాబ్దాల సిరిసిల్ల సాహిత్య చరిత్రను మననం చేసుకోవడమే! నిజాం వేంకటేశం గురించి చెప్పుకోవడం అంటే కల్లోల దశాబ్దపు కరీంనగర్ గురించి మళ్ళీ యాది జేసుకోవడమే పుస్తకాలను, మనుషులను అత్యంత ఎక్కువగా ప్రేమించి, నేను ఎప్పుడు చెప్పే విధంగా 'పుస్తకాన్ని తన చిరునామా'గా చేసుకుని, అవ్విటినే మిగిల్చి పోయారు. అత్యంత అరుదుగా కనిపించే వ్యక్తుల్లో ఆయనొకరు.
మాట బోళా.. మనిషి బోళా! 'మన' అని తప్పు.. మరో పదానికి అర్ధం తెలియని ఆయన ఎక్కడుంటే అక్కడ కాలం గలగల మనేది... ఒక్కరే వంద మందితో సమానంగా అనిపించేది. ఆయన, ఆయన శ్రీమతి మాధవి, డ్రైవర్ జగన్ కోవిడ్‌కు ముందు హైదరాబాద్ లోని ప్రతి సాహితీ సభలో కనిపించేవారు. దీనికి తోడు కారు డిక్కీలో నాలుగైదు డబ్బాలు.. అందులో సెట్లుగా పేర్చిన వివిధ రచయితల కొత్త పుస్తకాలు కనిపించగానే పుస్తకాలు నీ కోసం నవోదయలో కొన్నాను లేదా ఇప్పుడే నిన్న ఈ పబ్లికేషన్ డివిజన్ వాళ్ళతో మాట్లాడిన. బహుశః ఇంతకు మించి మొదటి మాటలు ఉండేటివి కాదు. అది పుస్తకంతో.. పుస్తకాలను ప్రేమించేవారితో ఆయనకున్న విడదీయరాని అనుబంధం.
ప్రవాసంలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడూ కూడా, రైల్వే స్టేషన్లలో, ఆయా ప్రాంతాల పుస్తకాల దుకాణాలను దాటుతుంది. దుకాండ్లలో ఏదైనా అరుదైన పుస్తకం కనిపించగానే ఆయనకు మొదటగా డా.నలిమెల భాస్కర్ గుర్తుకు వచ్చేవారు. బాలల సాహిత్యం, అనువాద సాహిత్యం కనిపిస్తే వెంటనే ఫోన్ చేసేవారు. దాదాపు తన డెబ్భైఅయిదేండ్ల ప్రస్థానమంతా పుస్తకాలతో... పుస్తకాల మనుషులతో కలిసి నడిచిన వేయి పుటల అక్షర నిఘంటువు.
ఆయన వ్యక్తిత్వం, మనుషుల మీద వేసే ముద్ర ఒక మనిషిలో ఒక కోణం ఒక పార్శ్యం ఉండొచ్చు. కానీ అనేక విధాలుగా విస్తరించి, ఏమీ అంటని తామరాకులా ఉండడం బహుశ ఒక్క నిజాం సార్ కే సాధ్యం. అందుకే ఆయన మరణవార్త అందరిని కలిచి వేసింది. కవిగా విద్యార్థి దశలోనే మద్రాసులో ఉన్నప్పుడు బహుమతి గెలుచుకుని తొలుత కవిత్వం వైపు నడిచిన ఆయన, తరువాత విమర్శ, అనువాద రంగంలో ఆసక్తితో పని చేశారు. ఆంగ్లం, హిందీలలోంచి అనేక అరుదైన రచనలు తెలుగులోకి తేవడమేకాక, తెలుగు కథలను ఆంగ్లంలోని అనువాదం దేశారాయన. ఆర్ధిక రంగంపై వచ్చిన మూడు పుస్తకాలు, సుభాష్ పాలేకర్ సేంద్రీయ వ్యవసాయ పుస్తకం అనువాదం చేశారు. ఒక్కటని కాదు సాహిత్యం, జర్నలిజం, సోషలిజం, కమ్యూనిజం, పర్యావరణం, సినిమా వంటి అనేక రంగాల సాహిత్యాన్ని సీరియస్‌గా అధ్యయనం చేయడమేకాక అవసరమనుకున్నప్పుడు వాటిని అనువాదం చేసి తెలుగువారికి అందించారు. ఆయన వివిధ గ్రంథాలయాలకు, వ్యక్తులకు ఇటీవల మా గరిపెల్లి అశోక్ ప్రోత్సాహంతో పాఠశాల విద్యార్థుల కోసం అందించిన పుస్తకాలు సంఖ్యలోనూ, విలువలోనూ లక్షలు చేస్తాయి. 'ఎలెక్స్ హెలీ' రచన రూట్‌ను తెలుగు అనువాదం 'ఏడు తరాలు' పుస్తకాన్ని నిజాం సార్ కొన్నన్ని ప్రతులు బహుశః ఎవరూ కొని ఉండరు.
ఆయనతో ఎన్ని రోజులు ప్రయాణం చేసినా.. ఇరవై నాలుగ్గంటల గడియారం అరవై నిమిషాల్లోనే తిరిగేది. ముప్పై అయిదేండ్లుగా నేను చూసి నడుస్తున్న సిరిసిల్ల సిరివెలుగుల్లో నిజాం సార్ ఒకరు. అది హైదరాబాద్. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఎక్కడైనా... ఎంత మందున్నా పది మందిలోనూ వెలుగై వెలిగే వెలుగు సూర్యుడు 1989లో మహాకవి డా.సి. నారాయణ రెడ్డి స్ఫూర్తితో మానేరు రచయితల సంఘం స్థాపించుకున్న తరువాత, అప్పుడప్పుడే కవితాక్షరాలు దిద్దుకుంటున్న సిరిసిల్ల నవ కవులకు కవిత్వకాలు పెట్టానుకున్నప్పుడు డా.నలిమెల భాస్కర్ సూచనతో నిజాం సార్ ప్రతి నెల చివరి ఆదివారం రోజున కవిత్వశాల జరిపారు. వాటి ఫలితమే సిరిసిల్ల యువకవులు. ప్రతి కవిత్వశాలలో తాను జగిత్యాల కేంద్రంగా నడిపిన 'దిక్సూచి' కవిత్వ పత్రికను చూపిస్తూ, అందులో అచ్చయిన కవితలను ఉదహరిస్తూ గంటలకు గంటలు చెప్పేవారు. కరీంనగర్ బుక్ ట్రస్ట్ నుండి ఇప్పటిదాక ప్రత్యక్షంగా, పరోక్షంగ వందల సంఖ్యలో ప్రచురితమయ్యాయి.
తెలంగాణలో సిరిసిల్ల, జగిత్యాల కేంద్రంగా జరిగిన అనేక ఉద్యమాలకు, ఉద్యమకారులకు హార్ధికంగా, ఆర్థికంగా అండదండగా నిలిచిన మొదటి వరుసలో పేర్కొనాల్సివారిలో నిజాం సారొకరు. అందులోనూ కల్లోల దశాబ్దంలో వామపక్ష ఉద్యమాలతో పాటు అనేక సామాజికోద్యమాలలో ఆయన భాగస్వామ్యం నిలువైంది. వృత్తిరీత్యా ఇంజనీరుగా ఎంత నిబద్ధతతో పనిచేశారో ఇప్పటికీ జగిత్యాల పల్లెలనడిగితే తెలుస్తుంది. ప్రవాసం లోనూ పనిని ఎంతగా ప్రేమించారో ఉత్తర ప్రదేశ్‌లోని అమేధిలో పదేళ్ళలో సాధ్యం కాని పనిని రెండేళ్ళలో పూర్తిచేసి రాహుల్ గాంధీ ప్రశంసలు పొందడం చూస్తే బోధపడుతుంది. చక్కని గ్రంథాల యాన్ని నెలకొల్పాలని, తనను ప్రభావితం చేసిన, తనకు నచ్చిన అనేక పుస్తకాలను మళ్ళీ ముద్రించాలనీ, తాను చదువుకున్న చోట చక్కని గ్రంథాలయాన్ని నెలకొల్పాలని ఇలా ఆయన మనసులో ఉన్న అనేక ఆలోచనలు, ప్రణాళికలను నాతో కరోనా కంటే ముందే పంచుకున్నారు. ఆచరణకు కరోనా ఆటంకమైంది. ఇటివల అమ్మ మరణంతో అవి కొంత ఆలస్యం అవుతాయని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఆయనే మన నుంచి వెళ్ళిపోయారు.
సిరిసిల్లలో తొలి నాళ్ళ నుండి మమ్మల్ని ప్రభావితం చేసినవాళ్ళు, మరి కొందరు సన్నిహితులు అలిశెట్టి, రుద్ర రవి, గూడూరి సీతారాం, జి.రాములు, సుర్బాల బాలయ్య, తవుడు నాగభూషణం. ఇప్పుడు నిజాం సార్ ఇలా దూరం కావడం, నిజంగా మోయలేని బాధ, ఓపలేని దుఃఖం నిజాం సార్‌కు నివాళి. ఆల్ విదా సార్!
- డా|| పత్తిపాక మోహన్
9966229548