Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణ భారతదేశం కర్ణాటకలో 12వ శతాబ్దంలో వచ్చిన భక్తి ఉద్యమం లింగాయతలో భక్తితో బాటు మానవ సమానతను ప్రధానంగా బోధించింది. ''మానవుడు అజ్ఞాని, జ్ఞాని శరణుడు'' అని ఈ ఉద్యమం ప్రబోధించింది. పుట్టుకతో అందరూ సమానము. జాతి వర్ణ బేధాలు లేక అందరూ దీక్షా సంస్కారాన్ని పొందవచ్చని ప్రవచించింది. ఈ ధర్మమును ఆరంభించినవాడు బసవేశ్వరుడు (1134-1196).
''నాయన మా మాల చెన్నయ్య
పెదనాయన మా డొక్కల కక్కయ్య
చిక్కయ్య మా అయ్య కనవయ్య
అన్నయ్య మా కిన్నరి బ్రహ్మయ్య
నన్నెందుకు గురుతించరు కూడల సంగయ్యా?''
- గురు బసవన్న/14
అంటూ సమాజంలోని హెచ్చుతగ్గులను ప్రశ్నించిన భక్తితత్వం కర్నాటకతో బాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ బసవన్న వచనాలు నాటి సామాజిక-రాజకీయ వాస్తవాలపై బలమైన వ్యాఖ్యానాలు. వీరి భాష కూడా చాలా ప్రత్యేకమైనదే కావడం విశేషం. భావం నిగూఢమైనది. లింగాయత సాహిత్యంలో ''వచనం'' అంటే వేదాలు, ఖురాన్, బైబిలు వలె పవిత్రమైన సాహిత్యం. లింగాయత మతాన్ని స్వీకరించిన భక్తులను ''శరణులు అంటారు. కన్నడ భాషలో శరణులు సజి యించిన ''వచన సాహిత్యం'' సాహిత్యపరంగా అత్యంత విలక్షణపరమైనది. శివారాధన కలిగిన శరణులు తమ మనసులోని మాటను స్వేచ్చగా, నమ్మకంగా చెబుతారు. వారు వ్యక్తిగత, సామాజిక కపటత్వాన్ని నిలదీశారు.
కన్నడనాట మహిళా శివశరణులలో అక్కమహాదేవి ఒక ప్రత్యేకమైన భక్తురాలు. అక్కమహాదేవి కన్నడ భాషలో మొదటి కవయిత్రి. 'చెన్న మల్లికార్జున' అనే మకుటంతో 434 వచనాలను రాసింది. ఈమె వచనాలలో మొదటిసారిగా స్త్రీవాద కోణం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం స్త్రీ, పురుషులకు ఒక్కటేనని వచనాలలో పేర్కొంది. అక్కడి కన్నడ సాహిత్యం ఈమెను భక్తురాలిగా మాత్రమే కాక, గొప్ప మహిళా రచయితగా చూడడానికి కారణం ఈమె రచనల్లో, వ్యక్తిగత జీవితంలో కనబడే ప్రత్యేకతే కారణం.
''కాయము నల్లగా కందితే నేమయ్యా
కాయము పచ్చగా మెరిసితే నేమయ్యా
అంతరంగం శుద్దమైన పిదప
చెన్న మల్లికార్జునయ్యా
నీవు వలిచిన కాయమెట్లుంటే నేమయ్యా'' -1162
అని మనుషులలో వర్ణభేదాన్ని నిరసిస్తుంది.
''వాడిన పూవును వాసన చూస్తారా?
చిన్ని పాపలో కన్నె సొగసు చూస్తారా?
ఓరే దేవా స్నేహమున్న తావులోనె ద్రోహమైన పిదప
అచట సద్గుణ మెంచెదరా?
ఓరే దేవా కమిలిన పుండుకు కాక పెట్టెదరా?
వినవయ్యా శ్రీశైల చెన్నమల్లికార్జున
నదిని దాటిన పిదప పడవోడికేముంది? -1243
ఇలా ప్రభావవంతమైన వ్యక్తీకరణలో ఆమె వచనాలుంటాయి. బాల్యదశ నుంచే అక్కమహాదేవి 'శరణసతి-లింగపతి' అనుకొని జీవించినది. మహాదేవి కడురూపవతి. కౌశికుడనే రాజు బలవంతంగా పెళ్ళి చేసుకుని, ఆమె అభీష్టానికి వ్యతిరేఖంగా ఆమెతో కలవాలని ప్రయత్నించాడు. మహిళ జన్మతః స్వేచ్చా స్వాతంత్య్రురాలని, ఈ శరీరంపై వ్యా మోహం వలదని చెప్పి, సకల రాజభోగాలను అప్పటికప్పుడు అక్కడే త్యజించి దిగంబరిగా అడవికి ప్రయాణమైంది.
ప్రాచీన హిందూ సాహిత్యం స్త్రీకి శూద్రుల హోదాను కల్పించింది. అయినా స్త్రీ ఓరిమితో తల్లి ప్రేమనే పంచింది. పురుషులు రాసిన ఈ సాహిత్యంలో తల్లి, చెల్లి, భార్య పాత్రలను కల్పించినా, మహిళను గుర్తించేదిగా రాలేదు.
''వేదశాస్త్ర ఆగమ పురాణములన్ని
పొల్లున దంచిన నూకతాడు కనండమా
ఇవి దంచనేల? దించనేల?
అటు ఇటు పరుగుదేయ మనసు లోతులను తెలిసికోంటే
పట్టితనపు బట్టబయలు చెన్నమల్లకార్జునా'' - 1225
ఈ విధంగా అక్కమహాదేవి రచనలు పురాణ సాహిత్యాన్ని, సామాజిక విభజనలను, సోపాన క్రమాన్ని నిరసించాయి. ఆధునిక కాలంలో స్త్రీ అభ్యుదయానికి పాదులు వేసినది స్త్రీ విద్య. మొదటి పంతులమ్మగా సావిత్రీబాయి పూలే బాలికా అక్షరాస్యతకు కొంగు నడుం బిగించాక మహిళలకు అక్షరం దగ్గరయింది. దాంతో వారు విద్యావంతులుగా మారి సామాజిక గుర్తింపు, భద్రతకు దగ్గరవడం ప్రారంభమైంది. తరువాత స్త్రీలు సమాజంలో తమకు రావాల్సిన గౌరవం, గుర్తింపులలో సగభాగం వాటాను సాధించుకోవడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారు. ఆధునిక సాహిత్యయుగానికి కొత్త దారులు వేశారు. ఇది తరువాత స్త్రీవాదోద్యమంగా మారినది. ఈ ఉద్యమంలో అగ్రవర్ణ మహిళలు కుటుంబ సమస్యలు, వైయుక్తిక, జెండర్ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. దాంతో ఈ ఉద్యమం కొన్ని విమర్శలకు దారితీసింది. ఎప్పుడైతే కిందిస్థాయి మహిళలు సాహిత్యంలోకి వచ్చి తమ సమస్యలను రాయడం ప్రారంభించారో, అప్పటి నుండి స్త్రీవాదోద్యమం గౌరవింపబడింది. అడుగు సామాజిక వర్గాలనుండి వచ్చిన రచయిత్రులు ఒక స్త్రీగా తమ జాతిలోనున్న మహిళలపై సామాజిక వివక్ష, పీడన, కట్టుబాట్లు, పేదరికం, చిన్న చూపు, అవమానం, అంటరానితనం, మానసిక, సామాజిక, కుటుంబ ఒత్తిడులు, అత్యాచారాలు, హత్యలు వంటి ఎదుర్కోబడుతున్న బలమైన సమస్యలను కవిత్వంలో చెప్పారు. ఇప్పుడు సోని ఒకడుగు ముందేసింది. ఉత్తమ రాజకీయాలు శ్రేయో ప్రభుత్వానికి పునాది వేస్తుంది. అలాంటి ప్రభుత్వాలు వస్తే స్త్రీకి రక్షణ, ఆత్మ విశ్వాసం కలుగు తాయి. స్త్రీ గుర్తించ బడుతుంది. ఉత్తమ ప్రభుత్వా లను ఎన్నుకోవడంలో పౌరులను అప్రమత్తం చేస్తూనే మహిళా సమస్యలను ప్రస్తావించడం ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకతగా కన్పిస్తుంది.
సోని వ్యక్తిగతంగా స్వేచ్చా స్వాతంత్య్రాలను అమితంగా ఇష్టపడే వ్యక్తి. సామాజిక అభ్యుద యానికి శ్రేయస్సుకు తపనపడే నిత్య కృషిశీలి.
సాహిత్య సావాసం, ప్రేరణనిచ్చే 'చురకత్తి' లాంటి జీవిత భాగస్వామి కట్కూరి మహేందర్ ఇద్దరూ తమ కవిత్వంతో నిలబడినవారు. కాబట్టి ఈ కవిత్వం ఇంత బాధ్యతగా వచ్చింది.
సోని కట్కూరి రాసిన ''అటాప్సి'' కవితా సంపుటిలో దాదాపుగా ముప్పై కవితలున్నాయి. ఇవన్నీ సామాజిక లోటుబాట్లను ఎత్తిచూపే కవితలు. మంచి భవనం నిర్మించాలంటే మంచి పునాది అవసరం. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్మించిన ప్రజాస్వామ్య సౌధంలో సామాన్యుడికిచ్చిన బలమైన ఆయుధం వోటు. వ్యక్తి మారితే సమాజం మారుతుంది. ఒక రచయిత్రిగా ఈ విషయాన్ని గమనించిన సోనీ సమాజానికి చేసిన సాహిత్య చికిత్స ఈ '' అటాప్సి''.
''అమ్మకానికి నిలబడ్డావో, వ్యాపారవేత్తలు నీ వందేళ్ళ బతుకునీ కొనేస్తారు'' అని సమాజంలో ఉన్న వ్యాపార ఆధిపత్యాన్ని తేలికైన పదాలతో కవిత్వీకరించారు. అంతే కాదు మరి విముక్తి ఎలా అంటే'' అధికారానికి తిరగబడాలని, అప్పుడే వర్తక చరితను తిరగరాయగలవని'' పరిష్కారం చూపింది. ''దశాబ్దాల అధికార దుర్నీతికి చరమగీతమిది, రక్తపు మరకలేని నిష్కళంక రణమిది, కోట్ల మంది ప్రజా ఆత్మాభిమానాన్ని నోట్లతో కొల్లగొట్టు కాలానికి ఎదురీత ఇది'' అని వర్తమాన సమాజానికి కర్తవ్యాన్ని బోధించింది. పల్లేరు కవితలో 'చావులతో చెలగాటమాడేదెవరు? ఆకలి పేరున దోచుకునేదెవ్వడు? ' అని పేదల పక్షాన గొంతెత్తింది. ''ఎదురించలేని చవట ఎవ్వడు? అని నిలదీసింది. స్వస్తి ఇక అనే కవితలో 'చనుపాలు తాపిన తల్లి మానాన్ని చెరబడుతుంటే చలించని కొడుకులెందుకు?'' అని ప్రజాస్వామ్యం దొంగ ఓటుతో ఖూనీ అవుతుంటే చూస్తూ ఉండే వాళ్లకి చెర్నాకోలతో కొట్టినట్టు చెప్పింది. ఇంకా ఈ పుస్తకంలో మనీఫెస్టో, గణతంత్రం, విజయ పరాజితులు, ఓటుకంబం, ఫెయితీజం,జమిలి, మరక,ఆకలి, ఓటేయ్యాలి, నాకెందుకు? పాజితులు, మాయా జనంవంటి ఉత్తమ కవితలున్నాయి.
అటాప్సి పుస్తక శీర్షిక ఉన్న కవితలో ''రాజకీయాల కన్నా రాజరికం ఎక్కువైంది'' అని సమకాలీన పార్టీల మనోగతాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరాలలో పొదిగింది. కులిమి అనే కవితలో కులవివక్ష గురించి ''అరచేతిలో నెర్రెలు బారినట్టు గీతలు, రాతలు...'' అని చక్కగా తన మనసులోని భావాన్ని కవితలో రాసింది.
సోని ఈ తరం కవయిత్రి. కవితల్లో అక్కడక్కడా కొంచెం తడబాటు, సమన్వయ లోపం ఉన్నా, తనను తాను మలుచుకోగల శక్తిమంతురాలు. కాబట్టి సోని నుండి రాబోయే కాలంలో కవితలు మరింత శక్తిమంతంగా వస్తాయని చెప్పవచ్చు.
- వేముల ఎల్లయ్య