Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊళ్లు విస్తరించాల్సిన చోట
స్మశానాలు విలసిల్లుతున్నాయి
పూటకో కొత్త సమాధితో
ఇప్పుడు దింపుడు కల్లం పులకరిస్తున్నది!
మనుషులు మాయమైపోతున్న చోట
ఊరు, వాడ కళతప్పి పోతోంది
నియాన్ లైట్ల అవసరమే లేకుండా
స్మశానం కాంతులీనుతోంది...!!
పాడెకట్టెలు, పగిలిన కుండముక్కలు
అన్నీ చెల్లాచెదురై
నిత్యం చావులకు స్వాగతం పలుకుతున్నాయి
పాతబట్టలు తోరణాలు కడుతున్నాయి
అకాల మరణాల రుతువులో
వల్లకాడు దినదినాభివృద్ధి చెందుతోంది
పేదబీదల ఏడుపుల ముందు
కీచురాళ్లు మూగబోతున్నాయి
కొంపలు ఖాళీ అవుతున్నాయి
బొందలు రాజ్యమేలుతున్నాయి
పాలకుడు సైతం ఊరిని కాదు
స్మశానాలనే అభివృద్ధి చేస్తున్నాడు
ఇప్పుడు ఆత్మీయులను తలచుకునేందుకు
ఊరికి కాదు...
నేరుగా స్మశానానికే వెళ్లాలి!
పండిన పండు నేలరాలడం
మట్టిలో కలిసిపోవడం
అంతా ప్రకృతి ధర్మం
మరి పసిమొగ్గలు స్మశానానికి చేరడం
ఏమి న్యాయం?
పండుటాకులకు మెతుకులు లేవు
పసిమొగ్గలకు నూకలైనా లేవు
ఇక స్మశానాలు విస్తరించకుంటే
ఊరు-వాడలు విస్తరిస్తాయా?!
రాజ్యం ఎప్పుడూ ఇంతే
ఉరితాళ్లు పేనుతూనే
ఉచిత పథకాల ఊరేగింపులు చేస్తుంటది
కలల్ని ధ్వంసం చేయడం
ఒక తరం తరాన్నే
మట్టిలో కప్పేయడం
చేతికి దుమ్ము అంటకుండా
చేయగల నేర్పరితనం
ఈ పాలకులకు మన్నుతో పెట్టిన విద్య!
బహుశా స్మశానం...
ఏదో ఒకరోజు పాలకుడి కోసం కూడా
తప్పకుండా ఎదురుచూస్తుంది!
- డా.పసునూరి రవీందర్
7702648825