Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రమజీవుల చెమటపూలు
పగలు నేలపై రాలితే భూమితల్లి నవ్వింది!
ఆ నవ్వుల మెరుపులే రాత్రి చుక్కలుగా మెరిశాయి!
ఆ చుక్కల చరిత్రను చందమామ పుస్తకంలో
చదువుకున్న ప్రకృతి
ఓ శ్రమకావ్యం రాసింది!
అదే కదా నిజమైన సౌందర్యర సాకృతి!
మానవజాతి చారిత్రక ధ్యుతి!
ప్రకృతి -మనిషి-శ్రమ-సౌందర్యం
ఇవేవీ లేకుంటే వాదం, వేదం, దైవం, మతం
సాహిత్యం కళలు ఉండేవా నాయనా!
పరిణామం ఓ అనుకరణ శిల్పమే కావచ్చు! కాని...
సమస్త వస్తూత్పత్తి సౌందర్యం శ్రమ ఫలితమేగా!
నెలవంకను చూసి కమ్మరి కొడవలి కనిపెట్టి ఉంటాడు!
మబ్బుల కొండను చూసి కుమ్మరి
కుండను శిల్పీకరించి ఉంటాడు!
ఇంద్రధనుస్సు చేనేత చేతి వస్త్రంగా
మారిన విషయం ఎందరికి తెలుసు?
ఎర్రని సూరీడే కార్మికుని 'ఎర్రజెండా'గ ఎగిరింది!
అనుకరణ ఓ అందమైన కళ!
శిలలో శిల్పాన్ని దర్శించడం శిల్పికల!
ఉలిదెబ్బలు తగిలి శిలదైవంగా మారింది!
దైవం మానవజాతిపై
మతం విసిరిన వల!
ప్రజలంతా వలలో విలవిలలాడే
చేపపిల్లలే!
శిల్పి చెక్కకుంటే...
శిలదైవంగా మారేదా?
కండలు కరగకుంటే
బండలు దేవళాలయ్యేవా?
సాలెల మగ్గాలు లేకుంటే
పట్టు శాలువాలెక్కడివి?
కంసాలి లేకుంటే కీటాలధగధగలేవీ!
డబ్బులపై అంటరాని చేతివేళ్ళు
నాట్యం చేయకుంటే దేవుళ్ళ
ఊరేగింపులు ఉండేవా?
రైతులు నవధాన్యాలు పండించకుంటే
నవ గ్రహాలకు నైవేద్యాలేవీ?
తర్కం శవంపై ఎవడో కప్పిన
తెల్లగుడ్డ భక్తి! నాయనా!
శ్రమజీవుల చెమట నీళ్ళ సంప్రోక్షణ తోనే.. మందిరాలు మసీదులు చర్చిలు వెలిశాయి! అవునా?
శ్రమ సౌందర్యమే కదా అందమైన ప్రపంచం!
సకల కళలకు మూలం మనిషే! మనసే!
శ్రమసృష్టే ఈ విశ్వ సౌందర్యం!
శ్రమప్రేమను కీర్తించని సాహిత్యం వ్యర్థం!
మతం రంగు పులుముకున్న కళలన్నీ
మానవతను కాటేసిన విషసర్పాలు!
భూగోళంపై మతాల రంగులు మాసిపోయిన రోజే...
మనవత్వం పసిపిల్లాడిలా నవ్వుతుంది!
ప్రేమతత్వం విశ్వమానవుడి
చిరునామా అవుతుంది!
అప్పుడు అరవిందుడు చెప్పిన
సూపర్ మ్యాన్ నువ్వే అవుతావు!
- బిక్కృష్ణ, 8374439053