Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రాత్రి అత్యంత విషాద వాక్యాలను రాయగలను
రాస్తా, ఉదాహరణకు 'ఈ రాత్రి చెదిరిపోయింది,
నీలి నక్షత్రాలు దూరంగా వణుకుతున్నాయ'ని.
రాత్రి గాలి పాడుతోంది, ఆకాశంలో సుడులు తిరుగుతూ.
ఈ రాత్రి అత్యంత విషాద వాక్యాలను రాయగలను నేను
నేనామెను ప్రేమించా,
కొన్నిసార్లు ఆమె కూడా నన్ను ప్రేమించింది.
ఇలాంటి అనేక రాత్రుల్లో ఆమెను నా బాహువుల్లో పొదువుకుని
అంతులేని ఆకాశం కింద ఆమెను మళ్లీ మళ్లీ చుంబించాను.
ఆమె కొన్నిసార్లు నన్ను ప్రేమించింది, నేను కూడా ప్రేమించా
అద్భుతమైన ఆమె అచంచల నేత్రాలను ప్రేమించకుండా
ఎలా వుండగలడెవడైనా
ఈ రాత్రి అత్యంత విషాద వాక్యాలను రాయగలను నేను
ఆమె నా దగ్గర లేదనుకుంటూ,
నేనామెను కోల్పోయిన వేదనతో.
ఈ రాత్రి చీకటి, ఆమె లేకపోవడంతో మరింత చిక్కబడుతోంది
పచ్చికపై మంచు బిందువుల్లా,
ఆత్మపై కవితా వాక్యాలు రాలుతున్నాయి.
ఆమెను పట్టించి వుంచలేని నా ప్రేమకు అర్థమేముంది
ఆమె నాతో లేని ఈ రాత్రి భళ్లున బద్ధలవుతోంది
ఇంతే, దూరంగా ఎవరో పాడుతున్నారు, దూరంగా.
ఆమెను కోల్పోయిన నా ఆత్మ అసంతప్తితో నిండిపోయింది
నా చూపులు వెతుకుతూ ఆమె వెంటే వెళ్లాయి
నా హదయం ఆమె కోసం ఎదురుచూస్తోంది,
ఆమె నాతో లేదు.
అవే వృక్షాలను, అదే రాత్రి దేదీప్యమానం చేస్తోంది
అప్పుడున్న మేము, ఇప్పుడలా లేం.
ఇకపై నేనామెను ప్రేమించను, అది మాత్రం నిజం.
కానీ, ఆమెను నేను ఎలా ప్రేమించాను.
ఆమెకు వీనుల విందుచేసే గాలి కోసం
నా గొంతు తహతహలాడేది.
మరొకరిది ఆమె మరొకరిది కావచ్చు,
నా ముద్దులకు ముందువలె
ఆమె సువాసన, మెరిసే ఆమె దేహం,
అనంతమైన ఆమె నేత్రాలు.
ఇకపై నేనామెను ప్రేమించను, అది మాత్రం ఖచ్చితం.
కానీ, ప్రేమిస్తూనూ వుండొచ్చు
ఎందుకంటే, ప్రేమ అణువంతైతే, మరపు అనంతమంత కదా
ఎందుకంటే, ఇలాంటి అనేక రాత్రుల్లో
ఆమెను నా బాహువుల్లో పొదువుకున్నాను
ఆమెను కోల్పోయిన నా ఆత్మ అసంతప్తితో నిండిపోయింది
నన్ను బాధించడానికి ఆమె కలిగించిన చివరి నొప్పి ఇది
ఆమె కోసం నేను రాసే చివరి కవిత ఇది
- పాబ్లొ నెరూడా
అనువాదం : దేశరాజు