Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు నాగన్న నాగన్నగానే తెలుసు. నాగన్నను తొలిసారి ఎక్కడ చూసి ఉంటాను? ఏదో ఒక మీటింగు మొదలు కావడానికి ముందు పాటల ప్రవాహంగా చూసి ఉంటాను. 'ఏదో ఒక మీటింగు' అంటే అర్థం ఏమిటి? సమాజం సజావుగా సాగడం లేదని అలా సాగని సమాజాన్ని సమూలంగా మార్చాలని, ఆ మార్పు కోసం అందరూ చైతన్యంతో పని చేయాలని, అవకతవకలను ప్రశ్నించాలని చెప్పే మీటింగ్. ఒక ఆలోచనను, ఒక దృక్పథాన్ని ఇచ్చే మీటింగ్, ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం ఆ గొంతులో దేనితో తక్షణమే కూల్చేస్తున్నట్లు, కూల్చే క్రమంలోనే నేలకు ఒరిగినట్లు, ఒరిగినంతలోనే తిరిగి నిలబడి ప్రశ్నించినట్లు ఉక్కిరిబిక్కిరి చేసి వొదిలే పాట. చింత చిగురు లాంటి ఎర్రదనమూ, కోత కొడవళ్లలాంటి పదునూ ఆ గొంతులో ఉండేవి. ఆ గొంతు పాటలను యుద్ధ శకటాలుగా పార్క్ చేసి ఉంచిన స్థలం ఆ గొంతు ఒక ఆయుధాగారం.
నాగన్న పాట విన్న తరువాత స్థిమితంగా ఉండటం చాలా కష్టం. అది నిన్ను నిలువునా తవ్వి పోస్తుంది. ఆ పాట నిన్ను అద్దం ముందు నిలబెట్టి నీ నిజరూపాన్ని నీకు చూపి విచారగ్రస్థుడ్ని చేస్తుంది. ఆ వెంటనే విప్లవ పథమే సరైనదనే వివేకాన్ని కలిగిస్తుంది. నిన్నొక అజ్ఞాత వీరుడిగా ఆవహిస్తుంది.
నాగన్నను విని ఊరుకోవటం చాలా కష్టం. పొంతకుండలో నీళ్లు కాగినట్లు నిన్ను కుతకుత ఉడికిస్తుంది. ఎటో ఒక వైపుకు ఉరికిస్తూ ఉంటుంది. నీటి ఉడుకు చల్లారి పోతున్నప్పుడల్లా వచ్చి ఆదుకుంటుంది.
నాగన్న తక్కువ మాట్లాడతాడు. పలకరింపు తర్వాత తానొక ఉద్యమ గీతమై పోతాడు. ఉద్ధృత స్వరంగా మారిపోతాడు. బహుశా నాగన్నలో గూడుకట్టుకుపోయిన ఒక భావజాలం నిన్ను ఆత్మీయంగా స్వీకరిస్తుంది.
నాగన్న రాసిన పాటల కన్నా పాడిన పాటలు వందల రెట్లు ఎక్కువ. పాటమ్మ పాదాలకు వందనం అంటూ విప్లవ విధేయుడై నిలబడ్డ నాగన్ననే నేను సదా చూస్తాను. పాటమ్మను అరుణోదయ వందనం అందుకోమన్నాడు. జానపదుల నోట పుట్టి జాతికి అంకితమైందని నాగన్న పాటను కీర్తించాడు. కానీ, తాను కూడా పాటగా మారి తనని తాను జాతికి అంకితం చేసుకున్నాడు నాగన్న. కాబట్టే గత నాలుగైదు దశాబ్దాలుగా పాటగా ప్రతినిత్యం పల్లవిస్తున్నాడు. విప్లవిస్తున్నాడు.
నాగన్నకు పాట, పదం శక్తి ఏమిటో తెలుసు. పాట ఉద్యమ నిర్మాణంలో, భావజాల వ్యాప్తిలో ఎంత పదునైన ఆయుధంగా ఉపకరిస్తుందో కూడా ముందే గ్రహించినవాడు. ఒక పాటలో జాతీయోద్యమ కాలం నాటి గరిమెళ్ల పాటను, అల్లూరి, భగత్సింగ్ల ఆశయాలను ప్రతిఫలించిన తీరును వివరించాడు. తెలంగాణ పోరాటంలో యాదగిరి పాటగా ప్రజలకు చేరిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. అంటే అణచివేతకు, పీడనకు వ్యతిరేకంగా నిలబడి ప్రజావిముక్తి గీతంగా విస్తరించాలన్న ఆకాంక్షను అంతర్భవింపజేసుకున్న లక్షణం నాగన్నలో చూడవచ్చు. బక్క రైతు చేతి బందూకుగా మారిందంటాడు పాటు. అదే విధంగా శ్రీకాకుళ పోరు, సవరజాతపు తెగల పోరాట నగారాగా పాట మోగిందని అంటాడు. పాటకు ప్రతిరూపంగా తాను నిలస్తూనే, పాటను నిలబెడుతున్నాడు.
ఉద్యమంలో అమరులైన వారి గురించి నాగన్న నాసినా, పాడినా విని తీరవలసిందే. రాజ్యం పెట్టే అన్ని హింసల రూపాలను పాటలో పొదిగి త్యాగంచేసిన అమరుల త్యాగగుణాన్ని గుర్తు చేసుకుంటాడు.
''వెచ్చనీ మీ రక్తములో ఎర్రజెండాను ముంచి
కొత్తగా సుత్తి కొడవళ్ళ గుర్తులేసేమూ
మీ ఇంకిన నెత్తురు సుక్కల అడుగున
మొక్కలు నాటేమూ మన విప్లవా పంటలకై
చెట్లు పెంచేమూ మన శ్రామిక రాజ్య స్థాపనకై''
అన్నాడు. ఆ ఆకాంక్షను తన జీవితాసాంతం గుండెల్లో నింపుకుని ఆశయాలను ఎదపెట్టిన వాడు. స్వప్న బీజాలను నాటిన వాడు. ఆదర్శాలను అడుగడుగునా పాటించి పాటై ఎలుగెత్తినవాడు.
- సీతారాం 9866563519