Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల నిర్మూలన కోసం పోరాడాల్సినప్పుడు కుల స్పృహ, కుల చర్చ తప్పదు. వృత్తి చర్చ కులచర్చలో భాగంగా అనివార్యమవుతుంది. ప్రత్యామ్నాయం చూపకుండా వృత్తుల విధ్వంసం శ్రామిక కులాలను మరింత వేదనకు గురి చేస్తుందన్నదీ వాస్తవమే. అందుకే కులాల పట్ల, వృత్తుల పట్ల బహుజనులది సంఘర్షణాత్మకమైన ప్రేమ. నిజానికి వృత్తుల మార్పు అనివార్యమైన అంశం. వృత్తి స్వేచ్ఛను కోరుకుంటూ కుల వృత్తి మీద వదిలి పెట్టలేని మమకారం కవులకుంటుంది. కవులు తమ మూలాలను ప్రేమిస్తారు, కాబట్టి అది అనివార్యమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే హక్కుల గురించిన, అసమానతల గురించిన ప్రశ్నలు సంధించగలగడం కవి కంఠస్వర తీవ్రతను తెలుపుతుంది.
'చట్టసభల కుర్చీలు
మలిచిన గాని
నేనెందుకో చుట్టాన్నే కాలేదు
సుప్రీంకోర్టు హైకోర్టుల్లో
వరుస బెంచీల నెంబర్ల
జడ్జీల నిలదీసే న్యాయం కురుస
వాదించ
అలల నుండి కళాశాల
నల్లబోర్డు మీద
నా బతుకు మార్పును
ఒక్క గీతరాత లేదు'
అంటుంది దాసోజు లలిత. కుర్చీలు చేసి కుర్చీ దక్కని వారి తరుపున దాతి కవితా సంపుటి నిండా బహుజనుల వృత్తి కవిత్వం పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకంటే ఇంతగా బహు జనుల జీవితపు మూలాలను చిత్రించిన కవితా సంపుటి ఇదివరకు రాలేదు. చాకలి స్త్రీ 'సౌడు పుంతలలో సర్ఫ్ను కనిపెట్టిన మహా శాస్త్రజ్ఞురాలు' అన్న సంగతి, ఉగ్గం తెగిన లొట్టిలా ఒట్టిపోతున్న' గౌడ స్త్రీ సుద్ద 'తూట్లు పొడుసుకున్న తలగోరు కుండ' లాంటి కుమ్మరి స్త్రీ వెతలు, 'తట్టలో సింగారాన్ని మోసుకు తిరిగే' పూసలమ్మ కాళ్ళనొప్పి, 'ఆస్మాన్ కామంచి గోసి' వోసిన వడ్డెర తల్లి నడుం నొప్పి దాసోజు లలిత దాతిలో ఆర్ద్రంగా చిత్రించింది.
వృత్తి దైన్యం చిత్రించడమే తొలి విశేషమైతే, దాన్ని ఆ వృత్తి స్త్రీ దృక్కోణంలో చిత్రించడం మరొక విశేషం. ఆమె ఒక ధ్వని, ఆమె ఉమ్మనీటిలో చెమ్మ, ఆకుపచ్చ చంద్రవంకలు, పిల్లల మడి, నాంచారి తల్లి పచ్చ సంతకం, పొత్తిలి కూన, ముతక సారె, ఆమె ఐరేండ్లకు ఆదిలిపి వంటి కవితా శీర్షికలు వృత్తి జీవితంలో స్త్రీ నిర్వహించే సింహ భాగపు భూమికను సూచిస్తున్నాయి.
'ఆమె ఒక లయ
ఆమె ఒక అనాది సంగీతం
ఆమె ఒక గజ్జిగి మొగ్గ
ఆమె ఒక గిల్లగజ్జె
ఆమె ఒక మూల ధ్వని'
అనడం దాన్నే సూచిస్తుంది. వృత్తిని, స్త్రీని అక్షరాలతో అపురూపంగా కొలిచిన లతిత ఉత్త భావోద్వేగపు కవయిత్రిగా కాదు. ఆమెకు అపారమైన లోచూపు ఉన్నది. సమాజపు గమన సూత్రాల డొల్లతనం తెలుసామెకు. 'శ్రమతడి అంటని అక్షరం, అగ్గికాదు బూడిద కణం' అంటుంది. 'కొలిమి మళ్ళీ రగలాలె, పనిముట్లలో కలం కూడా చేరాలె' అంటుంది. మా నాన్న ప్రొఫెసర్, మా అమ్మ ఆఫీసర్, మా ఇల్లు యూనివర్శిటీ' అంటుంది.
'కష్టజీవుల రెక్కల
చెమటను జుర్రుకునే
ధనపిచ్చి అక్రమార్కుల
లెక్కలు తేలాలే!'
అని సూటి ఎజెండా కూడా పెడుతుంది. కవయిత్రిలో ఉండవలసిన ఆర్ద్రత, క్రాంత దర్శిత్వం, ఫైర్ దాసోజు లలిత కవిత్వంలో ప్రతి కవితలోనూ గమనించవచ్చు. దానితో పాటు కొత్త వస్తువును చెప్పడంలో కొత్త ఈస్తటిక్స్ కూడా అలవోకగా అక్కడక్కడ వచ్చి చేరడం వస్తువు పట్ల ఆమె మమేకతను సూచిస్తుంది. వడ్డెర స్త్రీ సౌందర్యాన్ని చెబుతూ
'మన్ను పెళ్ళలాంటి కడ
గడ్డపారలాంటి వెన్ను'
అనడం కవిత్వంలో కొత్త. నాన్నను బ్రహ్మతో పోల్చడం అతిశయోక్తి అలంకారంలో కొత్త పాయ. ఇది చపలాతిశయోక్తి కాదు. అక్రమాతిశయోక్తి కాదు, అత్యంతాతిశయోక్తి కాదు. చూడండి.
'శ్రమ తెలువని
చతుర్ముఖ బ్రహ్మలపై
నిరంతర పోరాట కారుడు
చెమట సుక్కల యోధుడు
పంచముఖ బ్రహ్మకు మరో రూపం మా నాయన!'
దాతి కవితా సంపుటిలో బహుజన సేమిత వస్తు విస్తృతిలో సంపన్నంగా ఉంది. ఆచార్య జయధీర్ తిరుమలరావు చెప్పినట్లు 'సమాజ సౌందర్య జీవిత చిత్రణ పుష్కలంగా ఉంది. వాస్తవిక రచనాశైలి నిండుగా ఉంది. బహుజనుల అస్తిత్వాన్ని లోకానికి కొట్టొచ్చేట్లుగా వినిపించగలుగుతుంది దాతి'
- ఏనుగు నరసింహారెడ్డి
8978869183