Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా వాడు 'సాఫ్ట్ వేర్'
తెగ బడాయిలు పోతుంటారు కొందరెందుకో
వినడానికీ ఇంపుగానే ఉంది పేరు
దిగితేనే కదా జోరు తెలిసేది..
ఆహా..!
వారానికి ఐదే పని దినాలు ..!
అయితే
యే దినమైనా వారు తెర ముందే
టకటక లాడిస్తున్న వేళ్ళ కదలికే తప్పా
వాల్లో నిశ్చల స్వరూపులు నిత్య స్టాచూలు
ఇరువై నాలుగూ ఇంటు ఏడూ..
వాళ్ళు రోబోలే ..!
కనబడని నిరంతర చాకిరీ ముందు
గానుగెద్దే నయ్యం .!
పిల్లా జెల్లలతో కాసేపు గడిపినట్టనిపించినా
యే కాలకేయుడో తరుముతున్నట్టే..!
పనులు పురమాయించేందుకు అవతరించిన
కట్టుబానిసే కాలకేయుడంటే..
ఆ పెత్తన పైత్యమంతా
ఉద్యోగ నిర్వహనాదిపథ్యంల్లోంచి మొలకెత్తిందే
బహుళజాతోడి ఆదేశాలకతడో మరబొమ్మ
సకిలిస్తూ.. ఇకిలిస్తో
తూర్పారా పట్టడం వాడు అలవరచుకున్న నైపుణ్యం
కళ్ళముందటే..
మంచు ముక్కలా కరిగిపోతుంది వీళ్లకు ఆదివారం
ఇక మండే వచ్చిందంటే చాలు
మరింత వేపుడు
ఏమేం ప్రోగ్రెస్సంటూ ఎగిలివారక ముందునుంచే
మెదడు తినేందుకు మీటింగులు..!
వీళ్ల భాష 'ప్యాకేజీ' అంటే..
గుట్టుగా ఇచ్చే ప్రతిఫలమన్నమాట..!
స్కేలు రూలూ లెక్కా పత్రం జాంతా నహి..
ఎవరికెంతో..
ఎప్పుడెవరిని ఊడగొడుతారో
ఎవరిని ఊదరగొడుతారో
అంతు చిక్కని అయోమయం
విభజించి పాలించు ఇక్కడి నైజం.
పారదర్శకత, జవాబుదారీ తనమూ
ఉద్యోగభద్రత లాంటివి
వీళ్ళ డైరీల్లో దొరకని పదాలు
ప్రశ్నించే తత్వమ్ యూనియన్ల జాడ కొరవడిన
అడ్డమీది కూలీలే
ఈ సాంకేతిక మేధావులు..!
నడుం నొప్పి కోడి నిదుర
కళ్లకింద నల్లచారలూ పట్టించుకోరెవరూ
పండేట ప్పటికీ ఏ రెండో మూడో..
అవస్థల వ్యవస్తలో
నిత్యమూ విరాజిల్లే వారే సాఫ్ట్వేర్ నౌకరీలు.!!
మహాతల్లీ.. ప్రపంచీకరణా..!!
ఎంత పని చేస్తివే
యంత్రాలను కనిపెట్టి
మనిషిని ఓ మర బొమ్మగా మలిస్తివే
మా వాళ్ళని మాకు కాకుండా చేస్తివి కదే..!!
- నాంపల్లి సుజాత, 9848059893