Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, ఉపాధ్యాయుడు, దర్శకుడు, నాటక కర్త ఇలా తన ప్రతిభతో తెలుగు సాహిత్య ప్రతిష్టను ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన ఆదర్శ ధృవతార అడవి బాపిరాజు. ''బావా బావా పన్నీరు'' పాట తెలియని తెలుగు వారు ఉండరు. కానీ, ఆ పాట రాసింది అడవి బాపిరాజు అని తెలిసింది కొందరికే. అందుకే ఆయనను సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు, విశ్లేషకులు ముద్దుగా ''బాపి బావ'' అని పిలిచుకునేవారు.
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అక్టోబర్ 8, 1895న బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భీమవరంలోనే హై స్కూల్ విద్యను పూర్తి చేసిన ఆయన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో బి.ఏ చదివారు. అనంతరం మద్రాస్ లా కాలేజ్‌లో బి.ఎల్ పట్టం పొంది, కొంత కాలం న్యాయవాద వృత్తిని నిర్వహిం చారు. తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విడిచి, 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా పని చేశారు. 1944లో హైదరాబాద్ నుండి వెలువడే తెలుగు దినపత్రిక 'మీజన్' సంపాదకునిగా వ్యవహరిం చారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా సేవలందించారు. 'నవ్య సాహిత్య పరిషత్'ను స్థాపించిన వ్యక్తుల్లో బాపిరాజు ఒకరు. గుంటూరులో చిత్రకళను నేర్పడానికి ఒక ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. బాపిరాజుకు చిన్ననాటి నుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. ఆయన రాసిన నారాయణరావు నవలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. 1922లో సహకార నిరాకరణోద్యమంలో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచారు.
కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్య పాత్ర పోషించిన 'గోన గన్నారెడ్డి'ని ప్రధాన పాత్ర చేసుకొని నవల రాశారు. బాపిరాజు కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన గొప్ప చిత్రకారుడు కూడా! ఆయన గీసిన తైలవర్ణ చిత్రాలెన్నో ప్రముఖ మ్యూజియంలలో కొలువు తీరాయి. విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలకు సైతం బాపిరాజు చిత్రాలను అందించారు. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. ఆ అభిరుచి తోనే కొన్ని చిత్రాలకు కళా దర్శకునిగా కూడా పని చేశారు. అలా తెలుగునాట తొలి కళాదర్శకుడిగా నిలిచారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఆయన రెండు సార్లు జైలు జీవితం గడిపారు. బాపిరాజు భార్య నరాల వ్యాధితో బాధపడుతూ ఉండటం వల్ల పిల్లల ఆలనాపాలనా కూడా ఆయనే చూసేవారు. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు సాంఘిక దురాచారాల పట్ల, మహిళల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.
ఇలా అన్ని కళలు ఒకే ఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. అన్ని కళలు, ఉన్న భావుకవి, అభ్యుదయ కవి అడవి బాపిరాజు. వీరు రచయితేకాక సాహిత్య పోషకులు కూడా. సామరస్యం, పరిమళ భరితమైన రచనాశైలి వీరి సాహిత్య లక్షణాలు. వీరి రచనా కాలంలో జాతీయోద్యమం, సంస్కరణో ద్యమాలు బాగా కొనసాగుతున్నాయి. వీరు చారిత్రక నవలలు రాయడంలో దిట్ట. వారి సృజనాత్మక నవల ''హిమబిందు''. ఆయన రాసిన నవలలలో, కవితలలో ప్రతి స్త్రీ మనసులో మెదిలే, ఆమె ఊహించున్న లక్షణా లున్న ఒక పురుష పాత్రను సృష్టించారు. ఒక సమగ్రమైన పరిధిలో విలక్షణమైన కథ ''వడగళ్ళు'' తెలంగాణను, హైదరాబాద్‌ను ప్రముఖంగా చూపిస్తూ రచనను అద్భుతంగా మలిచారు.
అలాగే అయన కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ''నారాయణరావు'' నవల. ఇది నిజ జీవితంలోని వ్యక్తుల జీవితాలను ప్రధాన ఇతివృత్తంగా స్ఫురింపజేసే సాహితీ నవల. ఈ నవలలో జీవితాలు, అభిరుచులూ ఆంధ్రుల గుణశీలాలు, గ్రామీణ జీవితాలు, రాజ్యాంగ వ్యవస్థలు, విదేశీ విశేషాలు స్థల పురాణాలు, శాస్త్రాల గురించి, స్త్రీలకి చదువు ఎంత ముఖ్యమైనదో ఈ నవల ద్వారా బాపిరాజు చాలా చక్కగా చెప్పారు. ఈ నారాయణరావు నవల ఆంధ్ర, చెన్నపురి విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంధంగా ప్రవేశపెట్టారు. నారాయణరావు వంటి సాంఘిక నవలలే కాదు... గోనగన్నారెడ్డి, హిమబిందు, అంశుమతి, అడవిశాంతి వంటి చారిత్రక నవలలూ బాపిరాజు కలం నుంచి వెలువడ్డాయి. వీటిలో కొన్నింటిని ఆయన మీజాన్ పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు అందులో ధారావాహికగా వెలువరించారు. అలా తెలుగులో తొలి సీరియల్ రచయిత బాపిరాజే కావచ్చు. ఆయన రచనలలో వర్ణన ఎక్కువగా ఉంటుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రంథా లలో సమాసభూయిష్టమైన పదజాలం ఎక్కువన్న ఆరోపణా లేకపోలేదు. నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. బాపిరాజు సెప్టెంబర్ 22 1952 లో తుది శ్వాస విడిచారు.
ఇలా సాహిత్యపరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అయన నడిచిన బాట తెలుగు నాట ఓ సాహిత్య ప్రస్థానంగా మిగిలిపోతుంది. ఆయన రాసినవి 44 నవలలు అయిన అన్ని ప్రసిద్ధి చెందినవి.. ఈ తరం రాబోయే తారలు గుర్తుంచుకోవాల్సిన అతి కొద్ది మహానుభావు లలో బాపిరాజు ఒకరూ. తెలుగు ప్రజల హృదయాలలో చిరకాలం గుర్తిండిపోతారు. బాపిరాజు నవలలు, జీవిత చరిత్ర, గీసిన చిత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. అధికారంగా జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా జరపాలని సాహితీ ప్రియులు, కవులు, కళాకారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడివి బాపిరాజు బాటలో నడుస్తూ సమాజానికి మేలు చేస్తూన్న ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, ఆయనను అభిమానించే వ్యక్తులకు ఇవే మా ఘన నివాళులు.
- పీలి క్రిష్ణ 7801004100