Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృజన వైయక్తికం అయితే విమర్శ సామాజికం. ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉంది కనుకే మనకు సృజనకారుల కంటే విమర్శకులు చాలా తక్కువ. అందునా మహిళా విమర్శకులు మరీ తక్కువ. ఇలాంటి తరుణంలో ఒక విమర్శకురాలిగా ఉప్పల పద్మ రాసిన సాహిత్య వ్యాసాలు 'ఆకురాయి'సంపుటిగా తీసుకురావడం అభినందనీయం. ఆకురాయి అంటే శ్రమైక జీవన ప్రతీక. పదునుపెట్టే పనిముట్టు. విమర్శకుల విమర్శ సృజనాత్మకతకు పదును పెట్టే విధంగా ఉండాలి. అందుకే ఈ సంపుటికి 'ఆకురాయి' పేరు సమంజసం. ఇందులో కథా సాహిత్యంపై మూడు, పద్య సాహిత్యంపై మూడు, వచన కవిత్వంపై నాలుగు, బాల సాహిత్యంపై ఐదు ఇలా ఉన్నవి.
'ముదిగంటి సుజాతారెడ్డి కథలు - స్త్రీ దృక్కోణం' అనే మొదటి వ్యాసంలో వ్యాసకర్తగా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ.. ఆధునిక సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సుజాతారెడ్డి తన కథల్లో చిత్రించార''ని (పుట-7) డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి కథా దృక్పథాన్ని వివరించారు. ఈ వ్యాసంలో విసుర్రాయి, స్వేచ్ఛ, వారసత్వం, నేరమేంది, మోక్షం, కబ్జా, ధర్మపత్ని, బేరం వంటి కథలను సమర్థవంతంగా విశ్లేషించారు. ముస్లిం మైనారిటీ స్త్రీల జీవితాలను చిత్రించిన కథలు షబానా దుఃఖం, జహంగీరుతో పాటు ఉన్మాదంలోకి, బారామాసీలు, పొద్దుపొడవలేదు వంటి కథలు స్త్రీల జీవితాల్లో అణచివేత వల్ల వెలుగుకు నోచుకోవడం లేదన్న విషయాన్ని తెలిపే కథలను విశ్లేషించారు. స్త్రీలు శారీరక, మానసిక హింసను ఎదుర్కొనే కథలు దోపిడి, నిశ్శబ్దం-నిశ్శబ్దం, చిల్లిగవ్వ బతుకు, 'న స్త్రీ స్వాతంత్ర మర్హతి' వంటి కథలను పురుషాధిపత్య ధోరణిని చాటిన కథలుగా వివరించారు.
ఉపాధ్యాయ వృత్తికి విలువైన హారం 'ఆచార్యదేవోభవ కథలు' వ్యాసంలో వృత్తి పట్ల నిబద్ధత, బోధనాంశంపై ఆసక్తి, పిల్లలపై ప్రేమ, ఈ లక్షణాలన్నిటికి నిలువెత్తు నిదర్శనం దోరవేటి అంటూ 16 కథలకు సందర్భోచిత వ్యాఖ్యానాలు అందించారు.
నల్లగొండ జిల్లా స్త్రీల కథా సాహిత్యం, తెలుగు మహిళా తేజోమూర్తులు లాంటి వ్యాసాలు ఉప్పల పద్మ చారిత్రక స్పృహతో కూడిన అధ్యయనాన్ని తెలుపుతాయి. ఈ రెండు వ్యాసాలు పుస్తకాల నుండి కాకుండా విషయాత్మకంగా వివేచనతో చేసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం. నల్లగొండ జిల్లాకి చెందిన రచయిత్రులు బండారు అచ్చమాంబ, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, వనం సావిత్రినాథ్ వంటి 26 మంది కథా రచయిత్రుల గురించి సమగ్రంగా తెలిపేది ఒక వ్యాసం అయితే విరియాల కామసాని గూడూరు శాసనం గురించి, కుప్పాంబిక గురించి చెప్పిన చారిత్రక వ్యాసం మరొకటి.
డాక్టర్ చింతోజు మల్లికార్జునాచారి రాసిన మల్లికార్జున శతకం సమాజ స్థితిగతులకు నిలువుటద్దం. ఇది ఆధ్యాత్మిక శతకము వలె తోచినప్పటికీ నిండైన సామాజిక, సంస్కార విలువల సంపుటిగా ఉన్నదని స్పష్టత ఇచ్చారు.
హృద్యమైన జడ కందములు, ఛందస్సు, వ్యాకరణ పద్య విన్యాసంలో దిట్ట అయిన కంది శంకరయ్య సంపాదకత్వంలో 116 మంది పద్య కవుల రచనలతో వెలువడిన పద్య సంకలనమిది. ''వస్తువు ఒకటే అయినా 116 మంది కవులది ఒక్కొక్క బాణీ ప్రతి పద్యం హృద్యమే పుస్తకమంతా రసరమ్య సుగంధ భరితమే, అణువణువూ అమూల్యమే'' (పుట - 37, 42) అని వ్యాసకర్త వ్యాఖ్యానిస్తూ ప్రతి కవిని అత్యంత విలువైన సృజనకారులుగా పేర్కొన్నారు.
వచన కవితకు సంబంధించిన నాలుగు వ్యాసాలలో 'జ్వలించే కవిత్వపు దివిటీ - కాళోజీ' అనే వ్యాసంలో నారాయణరావు సాహితీ ప్రస్థానం, వారి ముద్రిత రచనలు, అముద్రిత రచనలను కాళోజీ బహుముఖీన మైన సుదీర్ఘ సాహిత్య కృషిని తెలియజేస్తుంది. అలాగే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మూలమలుపు కవిత్వ సంపుటిలోని 'గాయపడ్డాకే' కవిత గురించి ఎదను తడిమిన కవిత అనే వ్యాసంలో వివిధ సంఘటనలకు, సన్నివేశాలకు కవి పొందిన అనుభూతి దాగి ఉంటుందనీ, అందుకే ఆ కవిత్వం పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుందని వ్యాసకర్త చెబు తూనే కవిత్వంలో లోతైన పరిశీలన, అంతర్గత సంఘర్షణ, భావుకత, నిగూఢత, వాస్తవికత ద్వారా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఉద్యమ కవి వేణుసంకోజు 'మనిషిగా పూచే మట్టి' కవిత్వ సంపుటిపై 'కవిత్వమై పుష్పించిన మనిషి' అనే వ్యాసం ద్వారా ఆయన తొలి కవితా సంపుటిని వస్తుపరంగా, శిల్పపరంగా ఎంతో పరిణతి, తాత్వికత ఉందని వివరించారు. కవి, కథకుడు, సమీక్షకుడైన పెరుమాళ్ళ ఆనంద్ 'కాలస్పర్శ' కవిత్వాన్ని విశ్లేషిస్తూ కవి తన సిరాచుక్కలతో అక్షర దీపాలు వెలిగిస్తుంటాడని, సామాజిక దృక్పథం నిండుగా కలిగిన కవిగా 'సామాజిక చైతన్య వాహిక కాలస్పర్శ'లో పేర్కొన్నారు.
'తెలంగాణ భాషకు పట్టం కట్టిన పెండెం జగదీశ్వర్ కథలు' అనే వ్యాసంలో పెండెం జగదీశ్వర్ కృషికి నిదర్శనాలైన మూడు కథల సంపుటాల గురించి రాసిన వ్యాసమిది. జానపద కథలు ఉన్న 'బడిపిలగాల్ల కతలు'లో ఆద్యంతం హాస్యం, సందేశం నిండి ఉన్న కథలు అని చెప్పారు. 'గమ్మతి గమ్మతి కతలు', 'దోస్తులు చెప్పిన కతలు' కథా సంకలనాలలోని ప్రతి కథలోనూ దాగిన కథాశైలిని ప్రత్యేకించి తెలంగాణ జీవద్భాషను వివరించే ప్రయత్నం చేశారు. ఆయా కథల్లో దాగిన తెలంగాణ మాండలిక సొగసును, తెలంగాణ పలుకుబడులను ప్రత్యేకంగా విశ్లేషించారు. కథా సామ్రాజ్యానికి రారాజుగా నిలిచి ఎందరో పాఠక అభిమానులను సంపాదించుకున్న పెండెం జగదీశ్వర్ అంతర్దానం కావడం బాలసాహిత్యానికి తీరనిలోటు అని వారికి నివాళిగా వ్యాసం ముగించి ఆలోచింప చేశారు.
'బాలల మూర్తిమత్వ వికాస సోపానాలు' అనే వ్యాసంలో ప్రముఖ బాలల కథా రచయిత గరిపల్లి అశోక్ కృషి గురించి ఉన్నది. బాలల ప్రపంచానికి వారు అందించిన మూడు బహుమతులు 'ఎంకటి కతలు', 'మాబడి కతలు', 'సరికొత్త ఆవు పులి కథలు'. బాలల ఉన్నతి ప్రధాన కేంద్రంగా విభిన్న ఇతివృత్తాలతో సరికొత్త కోణంలో రాసిన కథలు ఈ మూడు పుస్తకాలలో దర్శనమిస్తాయి. గరిపెల్లి అశోక్‌ను కథల చందమామ అని వారు పిల్లల్లో దాగివున్న సృజనాత్మక శక్తులను వెలికి తీసే చోదకశక్తి అని ఎందరో ఉపాధ్యాయులకు, వర్తమాన బాల సాహిత్య రచయితలకు ప్రేరణాశక్తి అని చెప్పడం బాగుంది. ఈ మూడు పుస్తకాలకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు గ్రహీత, బాలసాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ సంపాదకులుగా వ్యవహరించారు. 'బాలల కథల పాలవెల్లి మా గరిపెల్లి' అంటూ పిల్లల్లో ఆసక్తినే కాక ఆనందాన్ని, ఆలోచనను, సృజనను పెంచే ఇలాంటి కథల ఆవశ్యకత ఎంతైనా ఉందని విశదీకరించారని వ్యాసకర్త చెప్పారు.
'తెలంగాణ బడి పిల్లల పచ్చని కవిత్వం' అనే వ్యాసం డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్ సంపాదకత్వంలో మానేరు రచయితల సంఘం 30 ఏండ్ల పండుగ, మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా వెలువరించిన తెలంగాణ బడి పిల్లల కవితా సంకలనం 'ఆకుపచ్చని ఆశలతో' పచ్చదనానికి బాసటగా చిట్టి చేతులు సమర్పించిన పచ్చని కవితాహారంగా విశ్లేషించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వట్టిమర్తి విద్యార్థుల 'విజ్ఞాన విహార యాత్రారచనల' వ్యాస సంకలనం 'రెక్క విప్పిన బాల్యం'ను 'సాహితీ వినీలాకాశంలో విహరించిన విహంగాలు వట్టిమర్తి పిల్లలు' అనే వ్యాసాన్ని అందించారు. వ్యక్తి జీవితంలో బాల్యం మురిపాల పంట. తిరిగిరాని జ్ఞాపకాల నిధి. ఆటపాటలతో అల్లుకున్న మధుర జ్ఞాపకాల లోగిలి. అమూల్యమైన భావి జీవితానికి విజ్ఞాన రహదారి అంటూ బాల్యం రెక్క విప్పిన దశలో రాసిన విద్యార్థుల అనుభవాల కూడలి అని చెప్పారు. ఇది ఒక వైవిధ్య భరితమైన యాత్రాస్మృతుల సంకలనంగా సాహితీ చరిత్ర పుటల్లో నిలిచి ఉంటుందని వివరించారు.
'చిట్టి కలాల సృజన సంతకం' అంటూ రాసిన మరో వ్యాసమిది. కవి, రచయిత, వాగ్గేయకారుడు కన్నెగంటి వెంకటయ్య ప్రోత్సాహంతో చెరువు మాదారం పాఠశాలలోని విద్యార్థుల రచనలతో వెలువరించిన 'కోయిలాలో... కోయిలా' గేయ సంకలనం గురించి సామాన్య ప్రజల్ని సామాజిక స్పృహ కలిగిన చైతన్యశీలురుగా పురికొల్పగల నిత్య నూతన ప్రక్రియ అని గానయోగ్యత కలిగి మాత్రా చందస్సుకు ప్రాధాన్యత ఇస్తూ లయాత్మకంగా సాగే గేయమని, ఆబాల గోపాలాన్ని అలరించే గేయ ప్రక్రియలో విద్యార్థుల రచనలు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
సాగర్ల సత్తయ్య వెలువరించిన కుందెన సాహిత్య వ్యాసాల గ్రంథానికి ప్రారంభం నుంచి చివరి దాకా వివిధ వ్యాసాలను విశ్లేషిస్తూ సహృదయ సాహితీ విమర్శ కుందెన అనే వ్యాసం వ్యాఖ్యానించారు. విమర్శ అనేది గత కాలపు సాహిత్యానికి వ్యాఖ్యానంగా మాత్రమే మిగిలిపోదు. రాబోయే సాహిత్యానికి మేనిఫెస్టోగా కూడా ఉంటుందని, సృజనకారుడిని నడిపి స్తుందని, అలాగే పాఠకుల్ని ఆ సృజన స్వీకరణకు సంసిద్ధులను చేస్తుందని అభిప్రాయపడ్డారు .
'ప్రజాకళలకు పట్టుగొమ్మ పాలడుగు నాగయ్య' అనే వ్యాసంతో విస్మృత జానపద వాగ్గేయకారుడు పాలడుగు నాగయ్య సమగ్ర సమాచారం అందించారు. మనసు కవి ఆచార్య ఆత్రేయ నాటకంపై రాసిన 'మనసూ - వయసూ నాటకం మనో విశ్లేషణ' వ్యాసం ఆమె పరిశీలనా దృష్టిని, పరిశోధనా దృక్పథాన్ని తెలుపుతుంది.
పుస్తకం వెనుక వైపు ప్రముఖ సాహిత్య విమర్శకులు నారాయణశర్మ అన్నట్లు 'కావ్యానుశీలనకు ఆత్మప్రవృత్తి మార్గం అభిరుచి విమర్శ. స్వతంత్ర ప్రవృత్తిలో రచనను అధ్యయనం చేయడం ఉప్పల పద్మలో కనిపిస్తున్నదని, తద్వారా అభిరుచిని, అధ్యయనాన్ని సానబెట్టుకునేందుకు ఈ ఆకురాయి కొంత ప్రేరణనిస్తుంద'ని చెప్పినట్లుగానే వివిధ అంశాలలో రాసిన వ్యాసాల శైలి చెప్పకనే చెబుతుంది. సృజనాత్మక సాహిత్యాన్ని పరామర్శించే విమర్శకులు వ్యుత్పన్నులై ఉండాలి. నిశిత బుద్ధితో విషయాన్ని ఆకళింపు చేసుకోగలిగే బుద్ధిశాలి అయి ఉండాలి. అవసరమైనచోట తులనాత్మక అధ్యయనం చేయగలిగి ఉండాలి. రచయితల సృజనశక్తి మీద గౌరవం కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉప్పల పద్మలో కనిపిస్తాయి. ప్రక్రియల వారీగా వ్యాసాలు రాసేటప్పుడు ఆ ప్రక్రియల యొక్క వైభవాలని ఉటంకించారు. ఈ వ్యాసాలన్నీ ఆయా పత్రికల్లో అచ్చయినవి కావడం విశేషం. తన వంతు బాధ్యతగా నిర్విరామ కృషి చేస్తున్న వికసించిన ఆకాశం కవయిత్రి, ఆకాశమే హద్దుగా కథలు రాసే కథా రచయిత్రి, పాటల రచయిత్రి, బాలసాహితీవేత్త, పరిశోధకురాలు, వ్యాస విశ్లేషకురాలు, తెలుగు సాహితీలోకం గర్వించే విధంగా బహుముఖీన కృషి చేస్తూ విమర్శకురాలిగా గా వెలువరించిన ఆకురాయి సాహిత్య వ్యాసాలను ''శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్'' ద్వారా ముద్రించడం అభినందనీయం.
- డాక్టర్ మండల స్వామి 9177607603