Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవన వేదనే ఆధునిక కవన తత్వమని మరోసారి విశ్వవ్యాప్తంగా రుజువైంది.. తన స్వీయ అనుభవాలే తన సాహితీ సర్వస్వం అని 2022 నోబుల్ బహుమతి రచయిత్రి అనీ ఎర్నౌ కుండబద్దలు కొట్టింది. ఆమె ఫ్రెంచి రచయిత్రి. వయస్సు 82 ఏండ్లు.
నోబుల్ సాహితీ బహుమతి ఇప్పటివరకు 119 మందికి లభిస్తే వారిలో కేవలం 16 మంది మాత్రమే స్త్రీలు. 17వ రచయిత్రి అనీ ఎర్నౌ. నోబుల్ సాహితీ బహుమతి పొందిన తొలి ఫ్రెంచి మహిళ.
'నిజంగా మనం ఓ కపట సమాజంలో జీవిస్తున్నాం. జాతి - మతం - వర్గం వంటి భయంకర అసమాన ఛాందస అణచివేతలో మగ్గుతున్నాం. నిజమైన స్వేచ్ఛ ఏమిటో అర్థం కాకుండానే శతాబ్దాలు గడచిపోతున్నాయి. బానిసలకు బానిసకు మాదిరి ఈ వ్యవస్థల్లో స్త్రీ లోకం అంతర్గతంగా బతుకుతున్నది. పురుషాహంకార అణచివేత ఈ అణచివేతలన్నింటిలోనూ సమాంతరంగానో, ఇంకా ఎక్కువగానో సాగుతూనే ఉన్నది. అందుకే దాపరికం లేకుండా రాయడానికే ధైర్యంగా ప్రయత్నించాల్సి వచ్చింది. అవమానాలు, పరాభవాలు, ఆటంకాలు ఎన్ని ఎదురైనా అక్షరానికి స్వేచ్ఛా ప్రాణం పోయాలనే దృఢంగా సంకల్పించుకున్నాను' - అనీ అంతరంగ ఆవిష్కరణ.
అనీకి 23 ఏండ్లు ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయింది. అవాంఛిత గర్భం. దానిని తొలగించుకోవాలని నిశ్చయించుకున్నది. అయితే గర్భస్రావం చట్టరీత్యా నేరం. లోపల - బయట చెప్పనలవిగాని ఘర్షణ. గర్భావిర్భావానికి తన ప్రమేయం ఎంత? తన ఇష్టత ఎంత? తన సహకారం ఎంత? ఏమీ లేకున్నా ఈ పరిణామం ఏమిటి? తన ప్రమేయం లేని ఈ భారాన్ని ఎంత కాలం మోయాలి? అసలు ఎందుకు మోయాలి? ఇవన్నీ అవాంఛిత గర్భం దాల్చిన ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రశ్నలే. అంతరంగ ఘర్షణే.
1963లో ఆమెకు జరిగిన ఈ విపత్కర పరిణామానికి 36 ఏండ్ల తర్వాత 1999లో అక్షరరూపం ఇచ్చింది. మూడున్నర దశాబ్దాల మదనం. లావాలా పెల్లుబికిన ఆ నవలా జననం. హ్యాపెనింగ్ (జరిగింది). 136 పేజీలతో అచ్చయిన ఆ నవల తీవ్ర సంచలనం రేపింది.
కాల్పనిక సాహిత్యానికి ఇక సెలవ్ అని అనీ భావించి స్వీయానుభవాలతో అక్షర సేద్యం చేయడమే అసలైన సాహిత్యమని గ్రహించింది. పురుషాధిక్య ప్రపంచాన్ని ఓ శక్తివంతమైన అక్షరంతో బోను ఎక్కించాలని తలంచింది.
హ్యాపెనింగ్ నవల తొలుత తన మాతృభాష ఫ్రెంచిలోనే 'ఇవెన్మో' పేరుతో ఆవిష్కృతమైంది. ఆ సందర్భంగా అనీ చేసిన వ్యాఖ్య ఎందరో రచయిత్రులకు మార్గదర్శకమైంది.
'నా జీవితంలో నాకు జరిగింది రాయడమంటే ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే'. నాకు అవాంఛిత గర్భం ఏర్పడినప్పుడు అది నా వ్యక్తిగత విషయం కాకపోవడ మేమిటి? అదిగాని బయటపడితే నా కుటుంబం మొత్తం అపవాదను భరించడం ఏమిటి? ఒక అసంబద్ధమైన సామాజిక నీతి చట్రంలో నేనూ, నా కుటుంబం ఇరుక్కుపోయామా..? నాలో చెలరేగే ప్రశ్నలకు ఓ సమాధానంగా, ఓ స్వాంతనగా ఆ నవల బయటకొచ్చింది' అని అంటుంది అనీ.
'నా శరీరం పై నాకు మాత్రమే గల హక్కును ఓ పతాకలా ఎగురవేయగలిగాను' - వక్కాణింపు. అనీ అనుభవించిన సామాజిక కుటుంబ పరిస్థితులకు మన భారత సామాజిక కుటుంబ పరిస్థితులకు ఎన్నో సారూప్యతలు ఉన్నట్టు ఇట్టే గోచరమవుతుంది.
మహా భారత గాథ కర్ణుని జననం - 'కుంతీ విలాపం'గా కరుణశ్రీ కలం నుండి జాలువారిన విషయం తెలిసిందే. కాకతాళీయం అయినప్పటికీ గర్భస్రావ (అబార్షన్) హక్కు స్త్రీలు కలిగి ఉంటారని మన సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే తీర్పును వెలువరించడం మహిళలకే కాదు మానవ లోకానికే ఓ ముందడుగు. అలాంటి తీర్పులు వెలువడటానికి ఇలాంటి సాహిత్యమే ద్యోతకమవుతుందని వేరుగా చెప్పక్కర్లేదుగా మరి.
అనీ చిన్నప్పుడు తల్లిదండ్రులు ఫ్రాన్స్‌లోని 'ఇవెట్తో' అనే చిన్న పల్లెటూర్లో ఓ చిల్లర కొట్టు నడిపేవారు. తండ్రికి చదువు అంటే అంత ఇష్టం లేదు. అయితే చదువు జీవన గమ్యాన్ని మార్చే దిక్సూచి అని తల్లికి తెలుసు. అందుకే ఆమె కష్టపడి తమ స్థాయికి మించిన మంచి పాఠశాలకు అనీని పంపించింది.
ఇది తనకు తొలి పాఠం నేర్పినట్టు అనీ తెలిపింది. 'చదువు ద్వారా, మంచి పద్ధతుల ద్వారా, శ్రామిక వర్గానికి మన్ననలు మర్యాదలు దక్కుతాయని తెలుసుకున్నాను. మనల్ని మనం చులకన చేసుకోవడం కంటే ఘోరం ఏముంటుంది? ఆత్మస్థైర్యమే కదా అసలైన జీవనమార్గం. అదే మనల్ని నిటారుగా నిలబెట్టే వెన్నెముక. మనదైన సొంత చిరునామా'. అప్పటి జ్ఞాపకాలు, అనుభవాల ఆధారంగా ఎ గర్ట్స్ స్టోరీ (ఓ బాలిక కథ) అనే నవలను 2016లో రాసింది.
'పద్దెనిమిదేండ్ల ఈడొచ్చిన అమ్మాయి విద్యార్థుల స్నేహబృందంలో నచ్చిన సహచరునితో లైంగిక అనుభవం తొలిగా పొందితే ఎంత సంతోషకరంగా ఉండాలి? ఆ అనుభూతి. వసంతంలా విరబూయాలి కదా.. కానీ ఇది తెలిసిన మగ విద్యార్థులు కొందరు నేరం చేసినట్టు నన్ను గేలి చేశారు. నా అద్దం మీద అసభ్యంగా రాసి వేధించారు. అపరాధ భావంతో కుంగిపోయేలా నన్ను తీవ్ర మానసిక క్షోభలోకి నెట్టారు' - ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో జీవన సంఘటనలకు నా రచనలు అద్దం పడ్తాయి' అంటారు అనీ
ఆమె కౌమార జీవితం ఓ పుస్తకం, వైవాహిక జీవితం ఓ పుస్తకం. ప్రేమ వ్యవహారం మరో పుస్తకం. తల్లి మరణం ఓ పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకో పుస్తకం. అయితే ఈ అనుభవాలు, అనుభూతులు ఏదీ వ్యక్తిగతం కాదు. సామూహికమే. సహానుభూతి (ఎంపథీ) కల్గినవే. సంఘటితంగా స్పందించేవే. అందుకే వాటికంత బలం.
ఆమె రచనలు అలా సాగాయి గనుకనే అనీ - 'ది గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్'గా గణతికెక్కారు.
'అంతర్దానమయ్యేలోపు జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకోవాలి' అని భావించే అనీ ఫ్రాన్స్ సమాజ ఉమ్మడి జ్ఞాపకాలను ఆ విధంగా నమోదు చేయగలిగారు.
సాహితీ సృజన వ్యక్తిగతం అయినప్పటికీ, ఆ దుర్భిణీ నుంచి సమాజ చీకట్లను దర్శించడమే కాదు చీకటి గోడలనూ బద్దలుకొట్టవచ్చని అనీ రచనలు తెలిపాయి. అనీ తను దాటి వచ్చిన దశలన్నీ అక్షర ప్రాణమై పుస్తకాలుగా నిలిచాయి. కల్పన అవసరం లేదు. అదీ ఓ రకమైన మోసమే. గాఢాత్మ కథనంతో పాఠకుల హృదయాలను తట్టిలేపాలి. ముందుగా తన హృదయ ప్రయోగశాలలో ఆ అనుభూతులను సాహితీస్రష్ట పరీక్షకు పెట్టుకోవాలి. నిగ్గు తేల్చాలి అనేది అనీ భావన.
చదువు ముగిసాక అనీ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. తదనంతరం లిటరరీ ప్రొఫెసర్ అయ్యారు. 2000లో రిటైర్ అయిన తర్వాత పూర్తికాలపు రచయిత్రిగా కొనసాగారు.
అనీ రచనలు సూటిగా, సరళంగా ఉంటాయి. ఎలాంటి అమరికలు ఉండవు. అదే ఆమె రచనా శైలీ విశిష్టత. జీవన తత్వం - రచనా తత్వం వేర్వేరు కావని ఆమె శైలి చెప్పకనే చెప్తుంది. అందుకే నోబుల్ కమిటీ అనీ రచనా శైలి సాధారణ భాషతో స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మెరిసిపోతుంది కలకాలం అని వ్యాఖ్యానించింది.
- కె.శాంతారావు, 9959745723