Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడు
కార్పొరేట్ మల్టీ ముహాలకోసం
ఆదివాసీల్ని వెళ్లగొట్టి
అడవుల్ని చదునుచేసి
రాచ మార్గాలు పరిస్తే-
మనం
చెట్టూ చెట్టూ ప్రగతికి మెట్టూ అంటూ
వీధుల్లో ఊరేగుదాం
హరిత హారాలు పేరుద్దాం
అడివిబిడ్డల ఆత్మ శాంతికి
కొమ్ము బూరలు ఊదేద్దాం
మోడు వారిన బతుకు మొదట్లో
ఒక మొక్క నాటేసి మురిసిపోదాం
వాడు
పంట పొలాల మీద
నల్ల తారు పూసి
సరుకులు మోసే రహదార్లు వేసి
చూసుకో అభివద్ధి అంటే
వామ్మో ఎంత పెద్ద రోడ్డు
అనుకుంటూ హాశ్చర్య పోదాం
వాడు
తంబాకు బేళ్లతో
సిగరెట్టు సామ్రాజ్యాలు నిర్మిస్తే
మనం
విసిరి పారేసిన పీకలు ఏరుతూ
పొగాకు దినోత్సవాలు చేసుకుందాం!
వాడు
ఈ భూగర్భాన్ని
విష రసాయనాలతో నింపుతూ
ప్లాస్టిక్ తో నిర్వీర్యం చేస్తుంటే
మనం
తాగి పారేసిన
బాటిళ్ళ భూతం ముందు ఫోటోలు దిగి
పర్యావరణ దినోత్సవం చేసుకుందాం
భాషా దినోత్సవం రోజు భాషని గౌరవిద్దాం
అమ్మ దినోత్సవం రోజున
అమ్మని తలచుకుందాం
మహిళా దినోత్సవం రోజున
మహిళని ఆకాశానికి ఎత్తేద్దాం
అక్కా, అన్నా, చెల్లీ, పిల్లీ, తల్లీ
ఏదో ఒకటి ఎవరిదో ఒకరిది
దినోత్సవాలకేం కొదవలేదు
దారి మళ్లించడానికి సవాలక్ష దారులు
కాలక్షేపానికి శత కోటి ఉపాయాలు
ఆత్మ వంచనకు అనంత కోటి మార్గాలు
హతవిధీ! చైతన్యపు దారేది?
- వి.విజయకుమార్, 8555802596