Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ మాట కొస్తే
ఈ మహా నగరం నాకు కొత్తేమి కాదు
కొన్నేళ్ళ కింద
నన్ను తీర్చి దిద్దిన విద్యా నగరమే!
ఇప్పుడంతా మారి పోయింది
అలనాటి కూడళ్ళన్నీ
ముడతలు పడ్డ ముసలవ్వల ముఖాలై
పాత బస్తీ బజార్లతో జత కట్టినవి!
అబిడ్స్ కోఠి సుల్తాన్ బజారులు
మా ఊరి సంతలకు ప్రతి బింబాలు
నగరం సరిహద్దుల వెంట స్థిరపడి
మనల్ని మోహితులను చేస్తున్నది!
ఇప్పుడు పాత నగరానికి ఎంత దూరముంటే
నీకంత ఘనతన్న మాట!
ఇక్కడ అంతా కలిసున్నట్లే ఉంటారు
కాని ఎవరి నేల వారిదే
ఎవరి ఆకాశం వారిదే!
వయో లింగ బేధాలక్కర లేదు
అందరి చుట్టూ ఓ నిశ్శబ్ద ప్రపంచం!
తలంపులూ ప్రతిస్పందనలూ అన్నీ
పచ్చి యాంత్రికాలే
ఎవరి సుఖం వారిదే
ఎవరి దుఃఖం వారిదే
మనిషికీ మార్కెట్ వస్తువుకు
పెద్ద తేడా ఏమీ ఉండదు!
చుట్టపు చూపులా వచ్చి పోతే
పెద్ద బాధ లేదు
ఇక్కడుంటేనే అన్నీ ఉన్నా
జీవితం కోల్పోయిన అనుభూతి
నువ్వెంతైనా వెతుకు
ఎక్కడైనా మనిషి ఆనవాలు కనిపిస్తే
ప్లీజ్! నాకో సారి కబురు చేయవా?!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261