Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలోని గుణాత్మక మార్పును మాత్రమే అక్షరబద్ధం చేసేది నిజమైన సాహిత్యం. ఆ సాహిత్యం కాలాతీతంగా, వ్యవస్థీకృతంగా, వివిధ ప్రభావాల ఫలితాలతో మనిషిని ప్రగతివైపు నడిపిస్తుంది. వర్తమానంలోని మలుపులను, మైలురాళ్లను వాస్తవికంగా లిపీకరిస్తూ భవిష్యత్తుకు అందిస్తుంది. గమన స్వభావం కలిగిన సమాజంలో స్వయంచలితమై నిగూఢతతో శిల్పసౌందర్యాన్ని నింపుకొని, ఆ గమనానికి కావాల్సిన చక్రాలను సిద్ధం చేస్తుంది. అందుకే సృష్టించబడేదంతా సాహిత్యం కాదు. రచయితలందరూ సాహిత్యకారులూ కారు. సంక్లిష్టమైన, విచ్ఛిన్నమైన, విభిన్నమైన, వైవిధ్యమైన సమాజ పోకడల్లోంచి ఏక సూత్రతను పట్టుకున్న రచనే సాహిత్య స్థాయికి చేరగలుగుతుంది. అద్భుత శిల్ప రహస్యాలను ఆవిష్కరించ గలిగిన వాళ్లే రచయితలవుతారు. అలాంటి రచనలే ముందు వెనకల్ని విభజించే సాహిత్యరేఖలుగా నిలిచిపోతాయి.
సమకాలీన ప్రపంచం భిన్నత్వం నుంచి ఏకత్వంవైపు వైజ్ఞానికంగా అమానవీయతతో పరుగులు తీస్తుంది. వ్యక్తులు తమకు తామే వ్యవస్థల్లా మారిపోయి ఛిద్రమవుతున్నారు. పల్లె నుంచి పట్టణం వరకు, దేశీయత నుంచి విదేశీయత వరకు, ప్రకృతి నుంచి నాగరికత వరకు మనిషి తనను తాను భౌతికంగా ప్రోది చేసుకుంటూనే, మానసికంగా ఒంటరవుతున్న సందర్భం ఇది. అందుకే వర్తమాన సృజనకర్త తనను తాను ప్రశ్నించుకుంటే, తనలో దాగిన తనను కనుగొంటే అతనికి ప్రాపంచిక దృక్పథమే కాదు, దాని స్వరూపం, స్వభావం కూడా కళ్లెదుట నిలబడుతుంది. అలా నిలబడిన సమాజాన్ని, వైయక్తిక పొరలను కొత్తదనంతో నింపి కథల్లోకి తీసుకొస్తున్నారు పాణిని జన్నాభట్ల. మానవీయతను మరచిన అత్యాధునిక మనిషిని ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తిలోని అనేక మంది వ్యక్తులను జెరాక్సు తీస్తున్నారు. పరిపూర్ణత నిండిన కథా నిర్మాణంలోంచి తనదైన వస్తు విశ్లేషణల్లోంచి అనర్గళంగా పాత్రలను తవ్వి తీస్తున్నారు.
వీరి కథలు నేటి ప్రపంచ ముసుగులు తొలగించిన వేడి గాలుల స్పర్శలు. సామాజిక మాధ్యమాల టెక్నాలజీతో ఊహల ఆకాశంలో సంచరించే మనుషులు. అత్యాధునిక జీవన విలువల అత్యల్పసారం. కనుమరుగవుతున్న మాన వీయ బంధాల ప్రతిస్పందనలు. వైజ్ఞానికతతో మరణిస్తున్న హృదయ స్పందనలు. రుజువైన మనిషిని నేలకుదించే ప్రయత్నాలు. కథానుగుణంగా, సందర్భానుసారంగా కథల్లో రచయిత చెప్పే ఎన్నో తాత్విక వాక్యాలు, జీవన సత్యాలు గుండెను కోస్తూ, కల్మశాన్ని తొలగిస్తూ మనిషి రుచి ఎలా ఉంటుందో చూపిస్తాయి. బతుకడంలోని అర్థాన్ని అనురాగంతో గరుకుగా అద్దుతాయి.
''తనలో నన్ను'' సంపుటిలోని పదమూడు కథలు వస్తు వైవిధ్యంతోనే కాదు, శిల్పపరంగా కూడా భిన్నత్వంతో పాత రూప రహస్యాల్ని విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని వస్తుపరంగా కొన్ని భాగాలుగా చూస్తే ''తనలో నన్ను, సూర్యోదయం, కలవరమాయే 'మదిలో', ఎయిత్ సిన్'' కథలు మనసుకు, వాస్తవ జీవితానికి మధ్య తెగుతున్న పొర వల్ల కలుగుతున్న అనర్థాన్ని పట్టుకున్నాయి. నకిలీ జీవన గమనంలో కొట్టుకుపోతున్న మనిషి మనసు ఎంత ఘర్షణకు గురవుతుందో టార్చిలైట్ వేసి చూపిస్తాయి. మెదడుకు, మనసుకు మధ్య అగాథం ఎంత పెరిగితే మనిషి అంతగా దిగజారిపోతాడు, మానసికంగానే కాకుండా భౌతికంగా కూడా ఏకాంత మరణాన్ని ఆహ్వానిస్తాడని రుజువుచేస్తాయి. అంతేకాదు ఇవి మానసిక కల్లోలాల్లోంచి, అంతర్గత విలయాల్లోంచి, బయటకు చెప్పుకోలేని చీకటి గదుల్లోంచి ఉబికిన అక్షర పిడుగుల్లా పాఠకుల మదిని ధ్వంసం చేస్తాయి. ఆ ధ్వంసంలోంచే అమృతాన్ని వెలికి తీసుకోమంటాయి.
''తనలో నన్ను'' కథలో ప్రధాన పాత్ర ఎదురు అపార్ట్మెంట్లో ఉన్న శైలూను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా ఆమెకు తెలియకుండానే శైలూలో ఆమెను చూసుకుంటుంది. అదో మానసిక వ్యధలా మారిపోతుంది. శైలూకు, భర్తతో గొడవలు పెరిగి చనిపోతుంది. చివరకు శైలూ ఎవరో కాదు, ప్రధాన పాత్రలో అఛేతనంగా ఉన్న స్త్రీయే అని తెలుస్తుంది. 'నా రహస్యాన్ని పాతిపెట్టిన శ్మశానంలా ఉందది' అన్న ప్రధాన పాత్ర మాటతో కథ ముగుస్తుంది. ''ఎందుకొచ్చావీ భూమ్మీదకి?'' అనే ప్రశ్నతో మొదలయ్యే ''సూర్యోదయం'' కథ ఎదుటివాళ్లను చులకనగా చూసే మనిషి తత్వాన్ని ఎండగడుతుంది. తననుతాను గొప్పగా చూసుకునే మనుషుల మెదళ్లను చెళ్లుమనిపిస్తుంది. పుట్టుక నుంచి చావు వరకు గల ప్రయాణపు అర్థాన్ని సైకలాజికల్ కోణం నుంచి వివరిస్తుంది. ఇంద్రియాలకు సంకేతాలిస్తూ ఓ పాత్ర నడిపించే కథ ''కలవరమాయే 'మదిలో' ''. వర్తమానానికి, గతానికి మధ్య కథనశిల్పం అద్భుతంగా సాగుతూ, సరికొత్త అనుభవాలతో కథానాయకుడి ప్రేమను విస్ఫోటనంలా ఆవిష్కరిస్తుంది. ''ఎయిత్ సిన్'' కథ మనిషిలోని అహాన్ని అరలుఅరలుగా విప్పి చూపుతుంది. ఆ అరల్లో దాగిన హిపోక్రసీని, దాని వల్ల మనలోని నటించే స్వభావాన్ని కూలిపోయే చెట్టులా వర్ణిస్తుంది. దెయ్యంలా, నల్లని ఆకారంలా ''ఎయిత్ సిన్'' ప్రతి మనిషికి మలినం లేకుండా జీవించమనే సందేశాన్ని గుండెలపై చెక్కుతుంది.
''శబరి, మరో కురుక్షేత్రం, ఆత్మసమర్పణ'' కథలు మాజిక్ రియలిజంతో వర్తమాన సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా పరిష్కారాలనూ చూపుతాయి. పురాణాంశాలను వర్తమాన దృష్టితో చూడడమే కాకుండా, సమకాలీనతను సంలీనం చేస్తాయి. స్థిరమైన తాత్వికధారతో పరిపూర్ణతను సంతరించుకున్నట్లు కనిపిస్తాయి. ''శబరి'' కథ సినిమాటిక్ రీతిలో సాగి సస్పెన్స్‌ను పండిస్తుంది. రామాయణంలో శబరి రాముడి మీద ప్రేమతో పండ్లు తను కొరికి అతడికి తినిపించి, భక్తిని చాటుకుంటుంది. ఈ కథలో శబరి తన మనుమరాలిని చంపిన వ్యక్తి ఎమ్.ఎల్.ఎ. కాబోతున్నాడని తెలిసి శ్రీశైలం అడవుల్లో అతడి కారుకు పంక్చర్ చేసి, నమ్మకంగా తనూ తింటూ, అతడికీ పండ్లు కట్ చేసి పెట్టి చంపేస్తుంది.
''మరో కురుక్షేత్రం'' కథ రాజరికం కన్నా, ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ప్రజాపక్షంగా చెప్తుంది. ప్రజల ఆకాంక్షలు, చారిత్రక సత్యాలు, మహాభారతంలోని రాజరికపు కుట్రలు, అధికార దాహాల వెనకున్న రహస్యాలను బట్టబయలు చేస్తుంది. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయపార్టీల స్వభావాలను విమర్శిస్తూ, ప్రజాస్వామ్య లక్ష్యాన్ని, ప్రజాయుతంగా గద్దె ఎక్కే విధానాన్ని కండ్ల ముందు నిలబెడు తుంది. ఇక ''ఆత్మసమర్పణ'' కథ రామ, రావణ యుద్ధాన్ని ఒక సాధారణ వానరుడి దృష్టికోణం నుంచి వర్ణిస్తుంది. ధర్మం కోసం ప్రాణత్యాగం చేయడం సైనికుడి స్వధర్మం అని ఈ కథ వెల్లడిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలే మహానుభావులను, సామాన్యులను వేరుచేస్తాయని, పదవులూ, సంపదలూ కావని రుజువు చేస్తుంది.
''డిపార్చర్ గేటు, విద్యాదానం, గుప్పుమన్న నోట్లు'' కథలు మానవసంబంధాల్లోని మార్మిక సౌందర్యాన్ని, ఇంకా సమాజంలో మిగిలి ఉన్న మానవీయతను మహోన్నతంగా వర్ణిస్తాయి. పాత్రలు, వాటి ప్రవర్తనలు, మాటలు, కథను ముందుకు నడపటంలో వాటి స్వభావాలు... బంధాల్లోని పరిమళాన్ని పదిలంగా ఎలా పట్టుకోవాలో చూపిస్తాయి.
''రంగు మార్చిన సముద్రం, ఎందుకీ అగాధం?, డిజిటల్ ఫ్రెండ్'' కథలు పరిణతి చెందీచెందని మనుషుల్లోని స్వభావాన్ని, అనుబంధాల కోసం తపించే వారి ఆర్తిని విశ్లేషిస్తాయి. సామాజిక మాధ్యమాలలో వైయక్తిక పోకడలతో నిండిన అహాన్ని, దాన్నే కల్చర్‌గా భావించే నేటి తరానికి, సామాజిక ప్రయోజనాన్ని జీవన సౌందర్యంగా మలచుకునే ముందు తరానికి మధ్యగల భేదాన్నీ చూపుతాయి. మేధస్సు సాధించే టెక్నాలజి మనిషిని నియంత్రిస్తే సమాజం ఎంత అల్లకల్లోలంగా మారుతుందో వివరిస్తాయి. అత్యాధునిక పార్శ్వాల్లోని అభివృద్ధి నీడల్లో దాగిన వెలుగులను తేటతెల్లం చేస్తాయి. ఉక్కిరిబిక్కిరి ఆడని నయా పోకడల గుట్టును రట్టు చేస్తాయి. ''రంగు మార్చిన సముద్రం''లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటివి సమాచార వ్యవస్థలో భాగమై యువతను లైక్‌లు, కామెంట్స్‌తో నాయకులను చేస్తున్నాయి. సమాజాభివృద్ధిని పట్టించుకోని స్క్రీన్ కల్చర్‌లో నేటితరం మార్కెటింగ్ రంగాన్నే వాస్తవలోకమని భావిస్తుంది. అదే గుర్తింపు తెచ్చే మంచి మార్గమని ఆలోచిస్తుంది. దీనిని తిప్పి కొడుతూ మానవసేవే నిజమైన గుర్తింపని తండ్రి ఆనంద రావ్ ద్వారా కూతురు నందితకు తెలిసేలా చేస్తుందీ కథ.
ఈ కథలన్నీ నేటి ప్రాపంచిక సమాజాన్ని అద్దంలో చూపే ప్రతిబింబాలే. ఆధునిక జీవన సరళి నుంచి అంతుచిక్కని ఆగాథాల్లో కూరుకుపోతున్న మనుషుల ఆలోచనలు, వాటి వ్యక్తీకరణలే. తెలుగు సాహిత్యంలో వాదాలు, ఉద్యమాల కాలం చెల్లిందని చెప్పకపోయినా, నూతన శతాబ్దంలో మనిషిని మనిషిగా చూపలేని యాంత్రిక శబ్దాల హోరులోంచి పుట్టిన వైవిధ్య భరితమైన ప్రకంపనలు. వైయక్తిక పోకడలను కాదని వ్యక్తిత్వ వికాసంతో కూడిన సామాజిక ప్రగతికి ఈ కథలు దారులు చూపుతాయి. వాస్తవీకరించబడిన న్యాయాన్యాయాల్లోంచి సంక్లిష్ట జీవన ప్రమాణాలను ఎలా అంచనా వేయలేమో కూడా తెలియజేస్తాయి. కొన్ని కథలు వేటికవే తెగిన, తెగుతున్న తాళ్లతో మనల్ని కట్టేస్తూ, కొత్త సూత్రాలను, సూక్తులను నేర్పుతాయి. తాత్వికతతో నిండి నిగూఢమైన రవళిని వినిపిస్తాయి.
ఈ కథల్లో సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతికాంశాలున్నాయి. అవన్నీ సంక్లిష్టమైన రీతిలో కథన పరంగా దాగిపోయాయి. శైలీ, శిల్పాల పరంగా ఈ రచయిత పాఠకుడ్ని నిరాశపరచరు. కొన్నిచోట్ల మౌఖికం, మరికొన్ని చోట్ల దృశ్యం, ఇంకొన్ని చోట్ల రచయితే మనతో మాట్లాడతారు. పాత్రలన్నీ కథా వస్తువును నడిపిస్తూ ఏకోన్ముఖంగా, అవసరమైనచోట బహుముఖీనంగా ముందుకెళ్తుంటాయి. ప్రారంభ, ముగింపులు ఆశ్చర్యమే కాదు, ఉత్కంఠనూ రేపుతాయి. ''శబరి'', ''తనలో నన్ను'', ''ఎందుకీ అగాథం?'' కథల ఎండింగ్ పాఠకుడి ఊహకు అతీతమే. ''డిజిటల్ ఫ్రెండ్'' కాలం, ప్రాంతం, సమయంతో నడుస్తుంది. ''ఆత్మసమర్పణ'' ఏక సంఘటనాత్మకం, బీభత్స వీర రస ప్రధానం. ''కలవరమాయే 'మదిలో''' శిల్ప పరంగా గొప్ప ప్రయోగమే. ఈ కథల్లో నాటకీయ కథనాలు, సంభాషణాత్మక కథనాలు కథను ముందుకు నడుపుతాయి. వాక్య నిర్మాణం కొన్ని చోట్ల చిక్కగా సాగి, కవితాత్మక ఛాయలతో పాఠకులను పరుగులు పెట్టించకుండా ఆలోచనల్తో నింపేస్తుంది. ఈ కథలు రాయడం వెనుక రచయిత వర్తమానాన్ని ఒడిసి పట్టుకున్నాడనడంలో సందేహం లేదు. తాత్విక సిద్ధాంతమో లేదా వైయక్తికంగా ఆకృతి దాల్చిన పరిష్కార మార్గామో ఉన్నట్లు కొన్ని కథల్లో కనిపించదు. నూతన సమస్యల చిత్రణతో పాటు వాటిని నరికే సైద్ధాంతిక కొడవళ్లను పట్టుకోవాల్సిన అవరమూ నేటి రచయితలకు ఉందనిపిస్తుంది. ఏది ఏమైన ఇవి నూతన ద్వారాలు. వర్తమానానికి అవసరమైన సాహిత్య కథా చిరపుంజులు.
- ఎ. రవీంద్రబాబు, 8008636981