Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుంకిరెడ్డి రాసిన 'వాద కవి కాదు బాధ కవి అన్నవరం' (17.10.22) అన్న వ్యాసం కొంత ఆశ్చర్యానికి గురిచేయక మానింది కాదు. ఈ వాద, బాధ ప్రాసల సంగతి అటుంచితే, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కవిత్వ సర్వస్వ ప్రచురణ సమయాన ఈ ముందుమాట ఎన్నో ఆలోచనలకు ఆస్కారమిచ్చింది. 12 సంపుటాలు, మూడు పదుల కవిత్వ సహవాసం, అంతకు రెండింతల జీవితానుభవం; ఎంత తోడుకుంటే అంత జలకు వీలున్న సందర్భాన్నిచ్చాడు తెలంగాణ భాషాభిమాన కవి దేవేందర్.
వాద ప్రస్తావన ఎప్పుడు పదునెక్కిందీ, దానిక్కారణాలూ ఇక్కడ అసందర్భోచితం అవుతాయి గానీ, ఇన్నేళ్ళ తరువాత కూడా ఎంత వద్దనుకున్నా సాహిత్య వాదాల ప్రసక్తి రాక మానడం లేదు చూడండి. అసలు దేవేందర్ కవిత్వానికి ఆలంబన ఏమిటి ? అతను ఏ వాదానికి తన గొంతునివ్వ లేదా? బహుశా ఆ మాట సుంకిరెడ్డి అనలేదు. ''దేవేందర్ వస్తు నియమం, రూప నియమం పెట్టుకోలేదు. దేవేందర్ ఒక చట్రానికి లోబడలేదు. తనని ఏది కదిలిస్తే దాని మీద రాసిండు. అందుకే వాద కవి కాదు బాధ కవి'' అన్నానంటారు. దేవేందర్ సకల వాదాల్నీ బలపరిచినవాడు కదా? అయినప్పటికీ ఏ వాదానికీ చెందకుండా ఉండగలగడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? కనుక ఆ అపార్ధాన్ని నేనే పక్కన పెడుతున్నాను.
కవి పాటించే నియమాల మీద, తన కవిత్వ దృక్పధంలో ఉండే నిబద్దత మీదనే సహజంగా పాఠకుడి గురి కుదురుతుంది. దేవేందర్ కవిత్వం ప్రధానంగా వస్తుగత కవిత్వం. అతని కవిత్వ పరిశీలనలోని వాస్తవికత కేవలం ఊహల్లోంచి ఊడిపడదు. అలాగే అతని కవిత్వ శైలి కూడా రూప మాయకు ఎన్నడూ లోనుకాలేదు. శిల్పానికున్న విలువను ఎన్నడూ దేవేందర్ తగ్గించలేదు. వాక్య నిర్మాణం (syntax), అందులోని వివిధ భాషా లక్షణాలను గమనిస్తే ''దేవేందర్ తెలుగు కవిత్వంలోని సకల భాషాధిపత్యాలను బద్దలు కొట్టాడన్న'' బూర్ల వెంకటేశ్వర్లు మాట ప్రశంసార్హమనిపిస్తుంది. తెలంగాణ జీవన వ్యవహారికాన్ని నిఖార్సుగా కవిత్వంలోకి తెచ్చాడు అన్నవరం దేవేందర్. అయినప్పటికీ అతని వ్యక్తీకరణ గురించి కన్నా, వస్తుతాత్వికత గురించే ఎక్కువ పరిపక్వ చర్చావసరం ఉన్నదన్నది నా అభిప్రాయము. 'కవిత్వ వస్తువే కవిత్వమైపోతుందా' అంటారేమో స్వర్గీయ శ్రీకాంత శర్మ. నా మట్టుకు నాకు కవిత్వ వస్తువు లేకుండా కవి ఏ ప్రయోగమూ చేసే సాహసం చేయలేడనిపిస్తుంది. తెలంగాణ సాంస్కృతికత- అన్నవరం కవితావస్తువు వెన్నెముక.
కవి సహజసిద్ధంగా 'కదిలిపోతేనే' కవిత్వమౌతాడు. ఈ కదలిక అతని సాహిత్య తత్వంలోంచి వస్తుంది. ఆనక అది ప్రజామోదం పొందుతుంది. దేవేందర్ సాహిత్య తత్వం 'బాధ' నుంచి పుడుతుందని సుంకిరెడ్డి భావించి ఉంటారు. నేనిప్పుడు బాధ పూర్వాపరాలూ, వాటి పర్యవసానమూ చర్చించను. అది మరొక ఫ్రాయిడ్ సూత్రాణ్వేషణ అవుతుంది. దేవేందర్ ముప్పయ్యేళ్ళుగా రాసిన కవిత్వంలో బాధ ఉన్నప్పుడు దాని మూలంలోంచి కవి ఉన్నాడని నేనంటాను. ఆ మూలం అతనున్న కాలాన్ని ప్రభావితం చేసిన వివిధ సామాజిక సిద్దాంతాలు; వాటినుంచి ప్రేరణ పొందిన ప్రజా పోరాటాలు, ఉద్యమాలు. అతని అనుభూతుల్లో సామాజిక మమేకత చాలా ఉంది.
దేవేందర్ విప్లవ, దళిత బహుజన వాదాలను హత్తుకున్న వాడు. వీటిని చర్చకు పెట్టినవాడు. తొలిసంపుటిలో రహస్య యుద్ధం చేయాల్సిందే అని రాసినవాడు, మంకమ్మతోట లేబర్ అడ్డాలోని ముచ్చెమటలు, చర్చలు, చర్చలు-II లాంటి కవితల ద్వారా విప్లవ పంధాపై ప్రశ్నలు కూడా వేశాడని నేను భావిస్తున్నాను. దళిత బహుజన వాదాల పట్ల గల అపేక్షకు సాక్ష్యంగా ఎన్నో కవితలున్నాయి. 'మా జ్యోతీరావ్ పూలే తొట్ట తొలి మహాత్మా' అన్నాడు. బువ్వకుండ స్వయంగా అతని జీవనాస్తిత్వంలోంచి రూపుదిద్దుకున్న కళాత్మక దీర్ఘ కవితా రూపం. 'నా జండా ఆకలి పేగుల అలికిడి. నా గమ్యం నలనల్లాని సూర్యుడు' అని రాసినదాంట్లో ఏం పలుకుతోంది ? ఆ శబ్దాన్నుంచి కవిని దూరం చేయలేను.
అతనిలోని తెలంగాణ వాదం గురించి చెప్పేందుకు మన దగ్గర మాటలు చాలవు. 'ఆంధ్రా భూస్వామి, అమెరికా ఆసామి; ఇద్దరూ ఒక్కటే' లాంటి వాక్యాల నుంచి మొదలుపెట్టి అతని కోపం, ఆక్రోశం, బాధ, ఆగ్రహం సకల మానసికోద్వేగాలను పరిశీలించాల్సిందే గానీ చెప్పనలవి కాదు. అవన్నీ స్వచ్ఛమైనవి. నిజమైనవి. కడుపు మండి రాసినవి. అందుకే దేవేందర్ 'తెలంగాణ వాద కవి' అనడానికి వెనుకాడను. అంతకు మించైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తనూ ఒక అక్షరాయుధ మయ్యాడంటే అతిశయోక్తి లేదు. పొక్కిలి వాకిళ్ళ పులకరింత సంపుటిలో అతని భావనలు పతాకస్థాయిలో ఉంటాయి. తెలంగాణా వాద చట్రంలో కూడా దేవేందర్ లేడనుకోవడం కష్టమైన విషయం.
దేనికీ చెందకపోవడమూ, దేన్నీ వ్యతిరేకించక పోవడమూ ఒక తత్వంలా తయారవ్వడం కవిత్వంలో; ఆ మాటకొస్తే సాహిత్యంలో ఇప్పుడే బయల్దేరిన (అవ) లక్షణం ఏమీ కాదు. బహుళ తాత్విక చర్చ ఎన్నో ఏళ్ళ నుంచీ నలుగుతున్నదే. అన్నవరం దేవేందర్ బహుళ తాత్విక కవి కాదు. బలమైన ప్రాంతీయాస్తిత్వాన్ని, అందులోకి సమస్త వాదాల సారాంసాన్నీ ఇముడ్చుకుని దాన్ని తన సాహిత్య దృక్పధంగా స్వీకరించిన కవి. ఇక్కడ 'సాహిత్యానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదన్న' టీఎమ్మెస్ ని గుర్తుచేసుకుంటున్నాను. అన్నవరం దేవేందర్ ఏ వాదానికీ అతీతంగా రాయలేదు కనుక ఏ వాదాన్నీ స్వంతం చేసుకోలేదని భావించనవసరం లేదు. అన్నింటినీ స్పృశించాడు కనుక అన్నింటికీ చెందినవాడనీ ఆకాశానికెత్తనక్కరలేదు. అతను వాద స్పృహ లేకుండా తన బాధ పలికించలేదు.
ఏ కవి రచనలన్నింటిలోంచైనా అతని మూల హృదయ అనుకంపన తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు. ఆ ప్రయత్నం ఏ వాద సిద్ధాంతానికైనా అవసరమైన విషయం. ఏ వాదానికి చెందకపోయినప్పటికీ (?) తేల్చుకోవల్సినది కూడా. దేవేందర్ ఆధునిక దృష్టి గల పల్లెటూరివాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంత కరువుని, అక్కడి ఎద్దుల గోసని, ప్రబలిన కులవివక్షని, పీడనని, దోపిడీనీ, వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్ని, కన్నీళ్ళని దేవేందర్ తన కవిత్వంలో ప్రస్తావిస్తాడు. తెలంగాణకు దోఖ చేస్తే అస్సలు ఊరుకోలేడు. ఆ సాంస్కృతిక పోరాటంలో తన బాధ్యత తను నెరవేర్చిన వాడు. సుంకిరెడ్డి Interpretation of life, Reflection of Life నిర్వచనాలతో దేవేందర్ కవిత్వాన్ని పోల్చడం అన్నవరానికి అత్యున్నత గౌరవాన్నివ్వడమే. కవిత్వంలో ఏం ప్రతిఫలించిందీ అంటే 'ఏది కదిలిస్తే అది రాసిందంతా అనుకోవడానికి' వీలు లేదు. రాసినవన్నీ నిలబడితే కవిత్వ చరిత్ర ఎన్ని టన్నుల బరువెక్కి ఉండేది ? దేవేందర్‌కు అతని చట్రాలు అతనికి మాబాగా తెలుసును. ఆ సంగతి అతనిప్పటికే తేల్చుకుని ఉన్నాడు. లేకపోతే ఈ కవిత్వ సర్వస్వాన్ని ఇంత ధైర్యంగా తీసుకురాకపోవును. అతనికి హృదయపూర్వకమైన అభినందనలు.
- శ్రీరామ్, 9963482597