Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్య యుద్ధ క్షేత్రంలో పుట్టిన వాడికి ధైర్య సాహసాలు, యుద్ధ తంత్రాలు సహజంగా అబ్బినట్లుగానే తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో కవిగా కన్ను తెరిచిన బిల్ల మహేందర్‌కు ప్రశ్నించడం, ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం, విప్లవ కాంక్షతో రగలడం, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించడం- వంటివి ఆయన కవిత్వ గుణాలుగా నిలిచాయి. 'విద్య ఫౌండేషన్' ఏర్పాటు చేసి దివ్యాంగులకు, అనాధలకు ఆర్థికంగాను, మానసికంగాను చేయూతని అందించడం మహేందర్ మానవీయతకు నిదర్శనం. భౌతిక జీవితంలో తాను చేతి కర్ర సాయంతో నడుస్తున్నప్పటికీ ఎందరో నిస్సహాయులకు వూత కర్రగా నిలబడుతున్నందుకు మహేందర్ అభినందనీయుడు.
2011లో 'పోరుగానం' గేయ సంపుటితో రచనా ప్రస్థానం ఆరంభించిన బిల్ల మహేందర్ 'బలిదానాలు మరుద్దాం' (2011), 'పిడికిలి' (2012) కవితా సంపుటులు వెలువరిం చాడు. ఆయన సంపాదకత్వ బాధ్యతలతో ప్రత్యేక ప్రతిభా వంతులపై 'కాలాన్ని గెలుస్తూ'(2014), 'గెలుపు చిరునామా' (2015), సంకలనాలను అందించాడు. ఈ గ్రంథాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. 2016లో 'కొన్ని ప్రశ్నలు జ్ఞాపకాలు' ప్రచురించాడు.
ఒక్క (2020) ఏడాదిలోనే ఏకంగా నాలుగు పుస్తకాలను ప్రచురించడం ఒక సంచలనమే! జనవరిలో 'తను నేను వాక్యం', ఫిబ్రవరిలో 'ఇప్పుడు ఒక పాట కావాలి' పేరుతో రెండు కవిత్వ సంపుటులను ప్రచురించాడు.
2019 ప్రపంచ మానవాళికి ఒక పీడకల. కోవిడ్ మహమ్మారి జన జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో విస్తృత సాహిత్యం వచ్చింది. ఆ సమయంలో 65 మంది వరంగల్ కవుల కవిత్వాన్ని 'కోవిడ్ -19' పేరుతో సంకలనం చేయడం ఒక ప్రత్యేకతను సంతరించు కుంది. ఈ కోవిడ్ సందర్భంలో వలస కార్మికుల దుర్భర జీవితాల పట్ల స్పందించని కవులు లేరు. దీని నేపథ్యంగా వలస కార్మికుల వేదనను ''వలస దుఃఖం'' పేరుతో తన సంపాద కత్వంలో ఒక మంచి కవిత్వ సంకలనాన్ని వేయడం ఒక చారిత్రక సందర్భం.
పుస్తకాలను ప్రచురించడం అంటే ఆర్థికంగాను మానసికం గాను శారీరకంగాను ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. అయినప్పటికీ ఒకే ఏడాదిలో ఇలా నాలుగు పుస్తకాలను తీసుకురావడం బిల్ల మహేందర్ కార్య వ్యగ్రతకు నిదర్శనం.
బిల్ల మహేందర్ రచించిన ''ఇప్పుడు ఒక పాట కావాలి'' కవిత్వ సంపుటికి కవి సంగమం వ్యవస్థాపకుడు కవి యాకూబ్ 2022 ఏడాదికి గాను రొట్టమాకురేవు (కె.ఎల్. నరసింహా రావు స్మారక) అవార్డును ప్రకటించారు. అందుకు చాలా సంతోషం. ఇప్పుడు బిల్ల మహేందర్ కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవడం ఒక సంధర్భంగా భావిస్తున్నాను.
బిల్ల మహేందర్ రచించిన 'ఇప్పుడు ఒక పాట కావాలి' పీడితుల పక్షాన నిబ్బరంగా నిలబడిన కవిత్వం, ఒక ధిక్కార గొంతుక, సూటిగా సంధించిన ప్రశ్న, వంగిన వెన్నుపాములోకి పాకి నిటారుగా నిలబెట్టే ధైర్యం, నిరాశ్రితులకు ఓదార్పునిచ్చే కౌగిలింతగా చెప్పుకోవచ్చు. ఇవి ఆయన కవిత్వ మౌలిక లక్షణాలు. తన మూలాల్ని ఏనాడు మరిచిపోని కవి.
ఉద్యోగరీత్యా హనుమకొండలో స్థిరపడిన ఈ కవి తన పుట్టిన 'ఊరికి వెళ్తున్నప్పుడు' మేడలు దాటి, మిద్దెలు దాటి, రోడ్లు కూడళ్ళు జంక్షన్లు దాటి, ముసుగేసుకున్న ముఖాల్నీ, నవ్వుల్ని అతికించుకున్న పెదాల్ని... మనుషుల్నీ దాటి, ఊరెళుతున్నప్పుడు తనకు కలిగిన భావాల్ని-
''...................
ఊరెళుతున్నప్పుడల్లా
మనసు ఊయలెక్కుతది
కాళ్లు జింక పిల్లలై ఎగురుతయి
సంబురం మత్తడై దొనుకుతది
పండుగకో
పబ్బానికో
ఊరుకొచ్చి పోతున్నప్పుడల్ల
ఊపిరి నడిచినట్టు ఒకటే రందయితది
అవ్వ దూరమైపోతున్నట్టు ప్రాణమంతా గుబులయి తది''- అంటూ ఎంతో సహజంగా కవిత్వం చేస్తాడు.
ఆధునికత మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చి పెట్టింది. పాత విషయాలు స్మృతులుగా మాత్రమే మిగిలాయి. చిన్నప్పుడు తాను అన్నం తిన్న 'తలె' యాది చేసుకుని బెంగ పడతాడు మహేందర్ -
''చందమామోలే
చూడసక్కగుండేది
కళ్ళను జిగేల్ మనిపిస్తూ
తళ తళ మెరిసేది
చిన్న పోరనుగున్నప్పుడు
అవ్వ దాంట్లనే బువ్వ కలిపి ముద్దలు పెట్టేది''- అంటాడు.
ఇలాంటి సున్నితమైన భావాలను వెలిబుచ్చిన మహేందర్ కవిత్వాన్ని ఆషామాషీ వ్యవహారంగా చూసేవాడు కాదు.
''ఏ బాల్కానీలోనో
హాయిగా ఉయ్యాలూగుతూ
తాగేందుకు నా కవిత్వం కాఫీ కాదు
దేహం మీద నుండి రాలుతున్న చెమటచుక్క'' (నా కవిత్వం) - అని భావించిన మహేందర్ బాధ్యతాయుతంగా కాక మరోలా రాయలేడు కదా!
''ఎత్తాల్సిన కాడ పిడికిలెత్తకపోతే
గొంతు మూగబోతది
ప్రశ్నించాల్సిన దగ్గర ప్రశ్నించకపోతే
తల ముక్కలవుతది'' (నా కవిత్వం) అంటాడు. కవిగా ఇది మహేందర్ స్టాండ్.
వస్తువు ఎంపిక విధానంలోనూ, శిల్ప పరంగాను- ఎంతో కషి చేస్తూ, ఒక నూతన అభివ్యక్తి కోసం పరితపించడాన్ని మనం ఈ కవితా సంపుటిలో స్పష్టంగా గమనించవచ్చు.
''....................
నిన్నటిదాకా
తరగతి గదిలో మామిడి తీపి గురించి
పాఠమై మోగిన నేను
రేపు విషమని ఎలా చెప్పను ??
ఇప్పుడు
నా దళిత బిడ్డలకు
ఈ దేశపు జాతీయ ఫలం కూడా
అంటరానిదేనని ఎట్లా బోధించను??'' (అంటరాని పండు)- అంటూ రెండు మామిడి పండ్లు దొంగతనంగా తిన్న నేరానికి సింగంపల్లిలో బక్కి శ్రీనును ఉరితీసిన సంఘటనను కళ్ళకు కడతాడు. స్వాతంత్య్రానంతరం అందవలసిన వారికి ఫలాలు అందడం లేదనే విషయాన్ని ధ్వనింపజేయడం ఈ కవిత ప్రత్యేకత.
''వస్తూ ఉన్నప్పుడు
పిడికెడు మట్టిని తెండి
మొలకెత్తడం నేర్చుకుందాం
వస్తూ ఉన్నప్పుడు
దోసెట్లో మల్లెలను తీసుకురండి
పరిమళించడం నేర్చుకుందాం
....................................
వస్తూ ఉన్నప్పుడు
ఓ అనాధ ముంగిలిని ముద్దాడండి
ఇక ఎలాగైనా బతికేయవచ్చు'' (బతుకు పాఠం)- అంటూ అనాధల పట్ల సున్నితంగా స్పందిస్తాడు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల పాత్ర మరువలేనిది. అందులో ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ఉద్యమ భావాలను ఆరిపోకుండా చూసు కున్నారు. ఉద్యమం సాకారమై 2014లో తెలంగాణ ఆవిర్భ వించింది. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారంతా అధికార పార్టీలోకి చేరారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోయింది. ప్రజల భ్రమలు పటాపంచ లయ్యాయి. బిల్ల మహేందర్ స్వయంగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసించడం ఈ కవితా సంపుటిలో చూస్తాం.
తెలంగాణ ఉద్యమ సమయంలో 'ధర్నా చౌక్' ఉద్యమ కారులకు ఒక ఆలంబనగా ఉండేది. కానీ 2017లో మన ప్రభుత్వం దాన్ని తరలించాలని చూసింది. ఆ సందర్భంలో మహేందర్ తన నిరసనను వ్యక్తపరిచాడు.
''అది ఓ యుద్ధక్షేత్రం
ఓ ఆత్మగౌరవ పతాకం
నిన్నటి ఆదిపత్యాన్ని అహంకారాన్ని
నిలువెల్లా కూల్చేసిన మహా క్షేత్రం
దొరల పెత్తనాన్ని దోపిడీ వ్యవస్థను
అడుగడుగునా ధిక్కరించిన ఉద్యమ క్షేత్రం
...............................................
అరె చల్
రాజ్యమేలేటోడు
వస్తూనే ఉంటడు పోతూనే ఉంటాడు
చివరిదాకా ఎదురు నిలిచే వాడే వీరుడు.'' (ధర్నా చౌక్)- అంటాడు.
అయితే 2019లో రాసిన ''మా చిరునామాలు ఇవ్వండి'' కవితలో ప్రభుత్వం డొల్లతనాన్ని మహేందర్ చాలా స్పష్టంగా విమర్శించిన తీరును గమనించవచ్చు.
''ఇప్పుడు
నా బంగారు తెలంగాణలో
నీళ్లు నిధులు ఉద్యోగాలే కాదు
మా పేద బిడ్డల చదువులు కూడా ప్రశ్నార్థకమే'' అంటూ అభిశంసించడం చూస్తాము.
శబరిమలై గుడిలోకి స్త్రీలను అనుమతించనప్పుడూ కలమెత్తి - ''ఏదీ/మైల పడని దేహమొకటి నా కంటికి చూపెట్టు.. పుటకనే ఉమ్మనీటిలోంచి కదయ్యా'' అని ప్రశ్నిస్తాడు.
అభ్యుదయం పేరుతో కలం పట్టిన కవి 'జనకవి'గా అవార్డు తీసుకోవడాన్ని ఎద్దేవా చేస్తాడు. ఆకలి చావుకు చలిస్తాడు. సిరియా సంక్షోభానికీ కదిలిపోతాడు. ఆదివాసీ లో ధర్మాన్నీ, మనిషి తనపు పరిమళాన్ని దర్శిస్తాడు.
''అప్పుడప్పుడు
నీకు నువ్వుగా ఒంటరిగా నడుస్తూ
ఎదురుపడ్డ రాళ్లు రప్పలు ముల్లుల్ని తొలగించి
ఓ కొత్త దారికి తోవ చూపాలి'' అంటూనే
......................................
పరిచిన దారి వెంబడి ఓ నలుగురు సమూహమై కదిలి పోతూనే ఉంటారు
నాలుగు దిక్కుల ముందుకు సాగుతూ ఓ కొత్త చరితను లిఖిస్తూనే ఉంటారు'' (నాలుగు) అని ముగిస్తూ దిశానిర్దేశం చేస్తాడు.
తప్పదు 'యుద్ధం చెయ్యాల్సిందే' అంటున్న బిల్ల మహేందర్ ఒక దశాబ్ద కాలంగా ఉద్యమశీలిగా, మంచికవిగా, సాహితీ సభల నిర్వాహకుడిగా, విద్యా ఫౌండేషన్ ద్వారా అనాధలకు, దివ్యాంగులకు స్నేహ హస్తాన్ని అందిస్తున్న వ్యక్తిగా తనను తాను మలుచు కుంటున్నాడు. తెలుగు సాహితీ మాగాణంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. మున్ముందు మరిన్ని ఉత్తమ కవితా సంకలనాలతో సాహితీ లోకంలో తనదంటూ ప్రత్యేక ముద్ర ఏర్పరుచుకో గల ప్రయత్నంలో విజయం సాధిస్తారని అభిలషిస్తున్నాను.
(రొట్టమాకురేవు కె.ఎల్.నరసింహారావు స్మారక అవార్డు అందుకోబోతున్న సందర్భంగా)
- కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, 9989584549