Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవత్వ పరిమళాలు హృదయం నిండా వెదజల్లిన అక్షరసేన డా|| మహమ్మద్ హసేన కలం నుంచి జాలువారిన వ్యక్తిత్వ కవిత్వం ''బిడ్డా ఎప్పుడొస్తావ్''. కవిత్వం రాసినట్టుగా లేదు అక్షరాలా అక్షర కవాత్తు నిర్వహించినట్టుగా ఉంది. చదువుతున్న పాఠకుల హృదయాలలో అక్షర శిబిరాలు మొలకెత్తినట్టుగా ఉంది. తిరుగుబాటు చేసినట్టుగా లేదు, పురోగతి బాట వైపు నడిపించినట్టుగా ఉంది. పసిపిల్లవాడు పదాలతోనే పదునైన భావాలు పలికించినట్టుగా ఉంది. పసితనం కోల్పోని ఋషి డా|| మహమ్మద్ హసేన. పువ్వులు చేసే శబ్దం పుస్తకం నిండా పూయించినట్టుగా ఉంది. వీరి కవిత్వం చదువుతుంటే మనసు నిండా పున్నమి ప్రశాంతతా, నిజాలని నిఖార్సైన నినాదాలుగా నిలబెట్టిన నిండైన వ్యక్తిత్వం వీరి కవిత్వం.
హసేన నిత్య అభ్యాసకుడు కాబట్టే ''అభ్యాసం'' శీర్షికతో ఉన్న కవితలో ఇలా అంటారు. ''ప్రపంచమే ఉత్తమ గ్రంథం కాలమే ఉత్తమ గురువు'' ''ఊపిరి పోసుకున్న దశ నుంచి ఊపిరి వదిలే వరకు ప్రతి మనిషి నిత్య విద్యారి'' అని ప్రకృతి పాఠం చెప్తారు. గూగుల్‌ను కూడా గురువుగా భావిస్తున్న ఈ రోజుల్లో గురువుకే పట్టం కట్టాలంటారు. సుద్ద ముక్కకు పునర్ సృష్టి చేశారు పై కవితలో. వీరి కవిత్వంలో ఇమ్యూనిటీ ఎంత ఉంది అనేదాని కంటే ''హ్యుమానిటీ'' ప్రతి అక్షరంలో నిభిడికృతంగా ఉంది అని చెప్పొచ్చు ''నువ్వు - నేను'' కవితలో ప్రేమతత్వాన్ని పదిల పరిచాడు. ''తీరం వలే నువ్వు - కెరటం వలే నేను'' అంటూ స్వచ్ఛమైన ప్రేమకు పదాలు సాక్షిగా నిలబెట్టారు. ''శేష ప్రశ్న'' ఇది నిజంగా మైదానసారం నింపుకున్న ''ప్రశ్న''. అంగారక గ్రహం చేరినా అంధకారపు పోకడలు ఎందుకని ప్రశ్నిస్తాడు? కుక్కను మొక్కను పెంచుతున్న మనం వృద్ధాప్యంలో అమ్మనాన్నను ఎందుకు పోషించట్లేదు అని అక్షరాస్త్రాలు సమాజంపై సంధిస్తాడు.
''ఎవరు నువ్వు..?'' అనే కవితలో కావ్య కన్యను వర్ణించిన తీరుపదాలపై కాదు పెదాలపై ముద్రించినట్టుగా ఉండి పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ''బ్రహ్మ సృష్టించిన అద్భుతం అమ్మ'' అంటాడు. తన మాతృమూర్తికి కావ్యాన్ని అంకితం చేసి జన్మను సార్థకం చేసుకున్నాడు. అదేవిధంగా అమ్మ గూర్చి చెప్తూ ఉగ్గుపాలతో ఊరడించే తొలి వైద్యురాలు అనే వాక్యంతో చరిత్ర చెప్పని సత్యాన్ని తన కవిత్వంలో చక్కగా పదిల పరిచాడు. ఈ కవితా సంపుటిలో ప్రతి పేజీ ఆలోచనాపరులకు సృజనకారులకు ఒక పరిశోధనా పత్రం. ఓ.పీ.హెచ్.డి. డిగ్రీ.
ప్రకృతిని ప్రేమించిన వీరు వనాలను కూడా పెంచాలంటాడు. ఆహుతి అవుతున్న అరణ్యం గురించి ఆవేదన పడిన తీరు కంటిదార జలపాతంగా జారుతున్నట్టే అనిపిస్తుంది ''పోరు బందర్లో పుట్టినావు పోరుబాట పట్టినావు'' అంటూ ''గాంధీని'' చారిత్రక సత్యాలతో వర్ణించిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ఆ సత్యశోధకున్ని హృదయపు గుడిలో గోపురంగా నిలబెట్టాడు. ''నీ జ్ఞాపకాలు'' అనే కవితలో చివరికి నీ లక్షణమైన వ్యక్తిత్వమే నిలబెడుతుంది చివరిగా చిరంజీవిగా'' ''నీ జ్ఞాపకాలు తరుముతూ ఉండాలి నీ వారిని నిన్ను ఆదర్శం గా తీసుకున్న వారిని'' అంటూ జీవిత తత్వాన్ని జీర్ణించుకున్న ప్రబోధకుడిలా కనిపిస్తాడు.
''బంధం ఎప్పుడు బందీ కాదు'' అనే కవితలో బంధాల విలువను తెరకెక్కించినాడు. ''మనిషే కదా మానవత్వాన్ని ప్రదర్శించేది మనిషి మనిషినే కలిస్తేనే కదా బంధాలు బలపడేది.'' అనే బలమైన వాక్యాలు పదబంధాలుగా కూర్చాడు. ''యుద్ధం గెలుద్దాం'' అంటూ కరోనాపై నిశ్శబ్ద యుద్ధం చేస్తాడు. ''కోటీశ్వరుడైనా, కూలివాడైనా అనాధ శవమే ప్రస్తుతం'' అంటూ మనిషి చివరి మజిలీ గూర్చి హితబోధ చేస్తాడు. అందుకే వీరు రాసిన పదాలు పాఠకుల హృదయాలలో ప్రతిధ్వనిస్తాయి, మనస్సును విశాలం చేస్తాయి. ''మగాళ్ళా మృగాళ్ళా''? అంటూ సమాజాన్ని నడిరోడ్డు పైన నిలదీస్తాడు. నిర్భయ చట్టాలొచ్చినా నిర్భయంగా రెచ్చిపోతున్న కామాంధుల గురించి వివరిస్తాడు పై కవితలో. మహిళలను హింసించే రేపిస్టు దళాలపై పదాలా తూటాలు పేల్చే ఓ ఫెమినిస్ట్. ''జనాభా నియంత్రణ పాటిద్దాం'' అనే కవితలో ''అజ్ఞానంలో ఉన్నప్పుడు అదుపులో ఉన్న జనాభా విజ్ఞానం వికాసం పెరిగిన తరువాత విధ్వంసం సృష్టిస్తూ విపత్తుగా మారిందంటాడు. తార్కికంగా ఆలోచింపజేసి తత్వబోధ చేస్తుంది. ఈ కవిత సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను భుజాల పైకి ఎత్తుకుని. సమస్యలకు సవాలు విసిరేదే అసలు సిసలు కవిత్వం.
''ఓ మనిషి నీ ప్రయాణం ఎటువైపు? అని నాగరిక సమాజాన్ని కవితాత్మకంగా నిలదీస్తుంది. మానవతా విలువలు పతనం అవుతూ జీవిత చిత్రం పలుచబారిపోతున్న ఈ రోజుల్లో మనిషి కాసుల వేటలోపడి బతుకు ఛిద్రం చేసుకుంటూ ప్రాణం విలువను గ్రహించలేకపోతున్నాడు. గంగానదిలోనో, ఊరు సరిహద్దులోనో, రోడ్డు కూడలిలోనో చోటు ఏది అయితేనేమ్ అడుగడుగున ''వైకుంఠదామాలే''.
వస్తానన్న బిడ్డ ''శవంగా'' మారి వస్తుంటే తల్లి గుండెలు పగిలి జీవచ్ఛవంగా మారిపోతుంది. శోకం కన్నీటి సద్రమైపోతుంది. కొడుకు లేడన్న నిజాన్ని నమ్మలేక భ్రమలో బతుకు ఈడుస్తుంది. ''బిడ్డా ఎప్పుడొస్తవ్''...? అంటుంటే కంటిదార మృత సముద్రంగా మారిపోతుంది. ''కడుపుకు కత్తెర పడితే గాని బయటకు రానని మారం చేస్తే కత్తిగాట్లు భరించినా'' అంటుంది. ఈ కవితలో ప్రతి అక్షరం గుండె కోతకు గురిచేస్తుంది. ఇది చదివితే కఠిన శిలలు కూడా కన్నీటి దారలైతయీ.
''అవును నేను మట్టినే''? అనే కవితలో మట్టి సువాసనను మనుషుల అడుగుజాడలను తెలిపి, హద్దురాళ్లు వేసి హద్దులు దాటుతున్నావు అంటుంది. ఇంకా వీరి కవిత్వంలో లౌకికతత్వం, మానవత్వం, ఆశావాదంను ఏ కొలమానంతో కొలవలేము. పసవుంటే అది కవిత్వం. పదునుంటే అది కవిత్వం. ఆ రెండు ఉన్న కవిత్వం హసేన గారి కవిత్వం. వారి పుస్తకాన్ని వైజ్ఞానిక పరికరాలతో పరిశీలిస్తే ప్రతిది సత్యం అనిపిస్తుంది. వీరి కవిత్వం చదువుతుంటే తేలికగా ఉంటుంది. గాలిలో తేలియాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది DTP అక్షరం కాదు DNA ను మార్చే అక్షరం. వారి అక్షరాలను కణకణంలో జీర్ణించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
అదేవిధంగా ఈ కవితా సంపుటికి డా|| ఏనుగు నరసింహారెడ్డి, ఆచార్యులు సూర్యధనంజరు, డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా|| వైరాగ్యం ప్రభాకర్ ముందుమాటలతో కవి లక్ష్యం, లక్షణం, వ్యక్తిత్వం, కవిత్వం ప్రామాణికతను విశదీకరించారు. అలానే కూరెళ్ళ శ్రీనివాస్ కవితా వస్తువు సరిపడే విధంగా అందమైన బొమ్మలు వేసి పుస్తకానికి మరింత శోభను సొబగులు అద్దినారు. పాలపిట్ట బుక్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించి సాహితి ప్రియులకు అందుబాటులోకి తేవటం గొప్ప విషయం.
- సాదే సురేష్, 9441692519