Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుని తొలి సౌందర్యానంద చర్యల ఆలోచనలలో కవిత్వం ఒకటి. అది ఆనాటి ప్రజల ఉద్విగ మానస సాధారణ సంభాషణ. ఈ ఉద్విగ భాషణం మొదట సంగీతంతో కలిసే ఉండేది. అందుకే కవిత్వం లాక్షణికంగా పాట. ప్రపంచంలోని ప్రాచీన సాహిత్యం సంగీతం కలగలిసే వున్నాయి. ఆదిమ కవిత్వ రూపాన్ని మనం పాటలోనే చూస్తాము. అంతటి ప్రాచీన సాహితీరూపం నేటికీ ప్రజల హృదయా లను పరవశింప చేస్తూ ప్రభావాన్ని, చైతన్యాన్ని కలిగిస్తూనే వున్నది.
పనితో పాటుగా పుట్టిన పాట, వేదనకు, ఆరాధనకు, లాలనకు, ఓదార్పుకు, నిదురపుచ్చేందుకు, మేల్కొలిపేందుకూ ఆలంబనగానే వున్నది. అలాంటి సాహిత్య సంగీత సమలంకృతరూపం పాటకు జేజేలు పలుకుదాం రండి!
మన తెలంగాణ మట్టిని ముట్టుకుంటే పాటల పల్లవులు వెల్లువెత్తుతాయి. జానపదుల జీవన దృశ్యాలను కళ్ళముందుంచుతాయి. జనం గాధలను గానం చేస్తాయి. ''పలుకే బంగారమాయెనా కోదండపాణి' అని భక్తుడు పిలిచింది... పల్లెటూరి పిల్లాడి కన్నీళ్లను తుడిచింది... అగ్నిధారలు కురిపించి, రుద్రవీణలు మోగించింది... నిరంకుశత్వాన్ని గోరీ కడతామని నినదించింది... ధీరులకు మొగసాలరా! తెలగాణ వీరులకు కాణాచిరా' అంటూ మాతృగీతికై గొంతెత్తింది... ఇక్కడి పాట. అందుకే ఈసారి తెలంగాణ సాహితి' సాహిత్యోత్సవం.. పాటనెత్తుకున్నది.
''పరితాప భారంబు భరియింప తరమా!'' అంటూ తొలి తెలుగు సినీ గీతాన్ని అందించిన చందాల కేశవదాసు నడయాడిన నేలపైన సినీ గీతాలపై విశ్లేషణోత్సవాన్ని మొదటిసారిగా జరుపతలపెట్టాము.
2015 నుండి తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌ను నిర్వహిస్తూ ప్రతిసారి ఒక విషయంపై చర్చలు, సెమినార్లు, గోష్టులను జరుపుతూ భాషా సాహిత్యాలపై సంకలనాలు తెస్తున్నాము.
మూడు రోజుల ఈ సాహిత్యోత్సవంలో ఈసారి పాటకు పట్టం కడుతూ గీతరచయితలను, గీతాలాపకులను ఆహ్వానిస్తూ వాగ్గేయకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నాము.
ఈ సాహిత్యోత్సవంలో ప్రారంభ సభకు ప్రసిద్ధ వాగ్గేయకారులు, రచయితలు, సాహితీవేత్తల సందేశాలు, సినీ గీత సాహిత్యంపై విశ్లేషణా వ్యాస సంకలనం ఆవిష్కరణలు ఉంటాయి. మొదటి రోజు కార్యక్రమానికి మూడు విభాగాలలో వాగ్గేయ కారుల, రచయితల సమావేశాలు, వారి ప్రసిద్ధమైన పాటలు గానం, రచయితల, గాయకుల పరిచయం, అభినందన ఉంటాయి. రెండవరోజు, మూడవ రోజు కార్యక్రమాలలో సినీ గీత సాహిత్యంపై పరిశోధకుల పత్ర సమర్పణ, ప్రముఖ సినిమా పాటల రచయితలు, విమర్శకులు, సాహితీవేత్తలు పాల్గొంటారు. ముగింపు కార్యక్రమంగా కవి సమ్మేళనం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఈ నెల 20, 21, 22 లలో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. వివరాలకు 8897765417, 9490099083, 9393804472 నందు సంప్రదించవచ్చు.