Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథలంటే జీవిత దృశ్యాలు. జీవితంలోని అన్ని పార్శ్వాలనూ కథలు మన కండ్లముందు ఉంచుతాయి. కొన్నిసార్లు అవి ఆహ్లాదపరుస్తాయి. మరి కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. ఎన్నో సార్లు మనలోని లోపాలను ఎత్తి చూపుతాయి. కేవలం కథలతోనే అంతా మార్పు వస్తుందా అంటే రాకపోవచ్చు. కానీ కచ్చితంగా ప్రభావితం మాత్రం చేస్తాయి. అలాంటి కథలను 'స్వర్శవేది' ద్వారా ఎమ్వీ రామిరెడ్డి మన ముందుంచారు. తాను ఏమి చేస్తున్నారో ఆ సామాజిక సేవనే కథలుగా మలిచి పాఠకులకు దగ్గర చేస్తూనే, మీకు ఆ బాధ్యత ఉందని గుర్తుచేస్తున్నారు. కథాప్రపంచానికి పరిచయం అక్కరలేని వ్యక్తి ఎమ్వీ రామిరెడ్డి. అద్భుతమైన సరళ శైలితో విభిన్న సామాజిక పార్శ్వాలను స్పృశిస్తూ, పాఠకుల హృదయాలను కదిలించేలా కథలు రాయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటికే వీరు మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. తాజాగా 'స్పర్శవేది' కథలు ప్రచురించారు.
పదిహేనేళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భాల్లో, తను దర్శించిన ఎందరో సేవా మూర్తులు, ఎదురైన అద్భుత 'సాయం' సమయాలను, నిజ అనుభవాలను కథారూపంలో గుది గుచ్చి 'స్పర్శవేది' అనే కథా సంపుటిని మనకు అందిస్తున్నారు ఎమ్వీ రామిరెడ్డి. 'ఏ లోహాన్నైనా స్వర్ణంగా మార్చే ప్రక్రియ పరుసవేది అయితే... దాన్ని మించి మనుషులను మార్చే సాధనం సేవా దీప్తి' అని ముందు మాటలో పేర్కొన్నట్లు, ఈ పుస్తకంలోని పదహారు కథలూ, మనుషులకు ఉండే- తోటివారికి సేవ, మానవత్వం అనే గుణాలను ప్రతిబింబించడం గమనార్హం.
స్పర్శ వేదిలోని ఒకొక్క కథ... ఒకొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవైపు కూతురి నిశ్చితార్థం, మరో వైపు అదే అపార్టుమెంటులో నివసించే ఎదురింటాయనకి గుండె ఆపరేషన్. ఎక్కడ తను ఉండాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నాడు జెకేయార్. ఆ స్థితిలో మాధవయ్యను వదిలి వెళ్లడానికి మనసొప్పడంలేదు అతనికి. ఇంటి వద్ద నుంచి ఒకటే ఫోన్లు, వెంటనే రమ్మని. మాధవయ్య కొడుకు రావడానికి చాలా సమయం పట్టేట్టుంది. చివరకు జెకేఆర్ ఏం చేస్తాడు? అనే ఆసక్తితో అక్షరాల వెంట కండ్లను పరుగులు తీయించే కథ 'మాధవసేవ'.
ఊహ తెలియని వయసులోనే నరకప్రాయమై జీవితాన్ని అనుభవించిన హైదరాబాద్ అమ్మాయి ప్రత్యూష. సవతి తల్లి ఆవిడను పెట్టిన కష్టాలు చూసి చలించని మనుషులు లేరు. ఆ సవతి తల్లికి ఆమె వేసిన శిక్ష, అందుకు సహకరించిన ప్రమోద్ గురించీ తెలిపే కథ 'సేవే మార్గం'. అలాగే తనను ఇబ్బందులకు గురి చేసి తన చిన్న బుద్ధిని బయట పెట్టుకున్న భ్రమరాంబకు, అరుణ కొత్త అనుభవాన్ని అందించిన తీరును 'అరుణారుణం'లో చూడవచ్చు. ఈ కథలు చదువుతుంటే మన చుట్టూ నిత్యం జరుగుతుందన్న అనుభూతికి గురవుతాం.
ప్రేమలో మోసపోయి, వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వనజకు ఆ వృత్తి ఒక కూతురిని కూడా ఇస్తుంది. తనకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆశయంతో దూరంగా హాస్టల్లో పెట్టి చదివిస్తూంటుంది. ఆ చదువు ఓ గట్టుకు చేరితే వేశ్యా వృత్తిని వదిలేద్దామనే ఆలోచనలో ఉన్న ఆమెకు పరిస్థితులు వీరబాబు అనే మదపటేనుగు పాలబడేలా చేశాయి. తన స్నేహితురాలు సరోజ, ఎన్జీవో ఉద్యోగి బాలాజీ సహకారంతో ఎలా బయట పడిందో రామిరెడ్డి తనదైన శైలితో రాసిన 'కుచ్ తో హై' తెలుపుతుంది.
ప్రేమ పేరుతో యాసిడ్‌తో మొహం కాల్చిన పశువొకడు, అంత: సౌందర్యం నాకు నచ్చిందని బొంకి జీవితంలోకి ప్రవేశించిన పశువొకడు. చివరకు వాడు కప్పుకున్న మేక తోలుని చీల్చి, తన భావి జీవితాన్ని రేష్మ ఎలా మలుచుకుందో దాని ద్వారా ఏమాశించనుందో మీకు 'యాసిడ్ టెస్ట్' చెబు తుంది. స్త్రీల స్థితిని స్వార్థపరులు ఎలా అనుకూలంగా మార్చుకుంటారో ఈ కథలో తేట తెల్లం చేస్తారు రచయిత.
ఎవరూ కలలోనైనా ఊహించని ఉపద్రవాన్ని తెచ్చిన కోవిడ్ ఎందరి జీవి తాలను అల్లకల్లోలం చేసిందో, ఎందరి జీవితాలను ఊహించని దారులకు మళ్లిం చిందో లెక్కలేదు. కానీ ఇంత భయంకర మైన స్థితిలోనూ ఎందరి గుండెల్లో ఆరిపోయిన తడిని వెలికితీసి పక్కవారి గురించి ఆలోచించేలా చేసింది. అలాంటి సేవా సందర్భాలను తను చూసిన జీవితాల నుంచి ఒడిసిపట్టుకొని 'స్పర్శవేది'గా మన ముందుంచారు రచ యిత. ఈ కథను ఆవిష్కరించిన తీరు ఎందరో పాఠకుల మెప్పు పొందింది. అందుకే ఇదే పేరు కథా సంపుటి కవర్ పేజీపై పుటం వేసుక్కూచ్చుంది.
'ఆ మధ్యాహ్నం మరగ్గాగిన పొంత కాగులా ఉంది. ఆవిర్లు పోతున్న అట్లపెనంలా ఉంది' గమ్మత్తైన ఉపమానంతో మొదలైన కథలో, రియల్ ఎస్టేట్ భూతం తనను ఎలా చీల్చి చెండాడిందో నేలతల్లి హృదయ విదార కంగా చెబుతుంది 'గుండె చెరువై...'లో. మన కళ్ళముందే జరుగుతున్న మారణహోమాన్ని, నిర్లజ్జగా చూస్తూ నిలబడు తున్న మనలను చెరోపక్కన నిలబెట్టి నిలదీస్తున్నట్టుగా... మన తలలను కాళ్ళకు ముడిపెట్టే ప్రయత్నంలో కథ సఫలమవుతుంది.
మానవాళికి ఎప్పుడు విపత్తులు సంభవించినా ఆ సందర్భాలు ఎవరో ఒకరి చేత ఏదో ఒక రూపంలో నమోదు చేయబడతాయి. అవి చిత్రలేఖనం గావచ్చు, సంగీతం గావచ్చు, నాటకాలు, నవలలు, కథలు ఇలా... ఇట్టి సందర్భాలు ప్రతిభావంతులైన రచ యితల ద్వారా భావి తరాలకు అంద చేయబడతాయి. అవి పాఠాలే అవు తాయో, పరిష్కా రాల ఆవిష్కరణకు దారే తీస్తుందో కాలమే చెబు తుంది. ప్రస్తుతం మనం ఎదు ర్కొన్న, ఎదుర్కొంటున్న ఇప్పటిస్థితి కూడా అందులో ఒకటి. ఇలాంటి సమాయావస్థ చిత్రించ బడిన కథే 'మరణానికి ఇవతలి గట్టు'. కథలో అంతర్భాగంగా అలముకున్న మానవ బంధాల పరిమళం మంచి కథను చదివామన్న తృప్తిని ఇస్తుంది.
రైతులను సెన్సిటైజ్ చేయడానికి వచ్చిన ఉదరు చావు బతుకుల కత్తి మీదకు చేరాడు. చివరకు ఉదరు ఏమవుతాడు? జానకిరామయ్య నేర్పదలచిన విషయాలేవీ? రైతుల స్థితిని చిత్రిక పట్టిన కథ 'నాగలి గాయాల వెనుక'... అయితే ఒక పిల్లల గలాటాలో కన్న కొడుకు స్పందించిన తీరునుంచి పాఠం నేర్చుకొని, సుదర్శన్‌కు ఎదురుతిరిగిన రైతు చంద్రయ్య గురించి 'సంకెళ్ళు తప్ప'లో చిత్రించి రైతు జీవితాలకు ఓ రెండు పార్శ్వాలను రచయిత పాఠకుల కళ్ల ముందు నిలబెట్టారు. అవినీతి సూపర్‌వైజర్ రూపంలో, దానవత్వం సింగారావు రూపంలో సుందరి దైనందిన జీవితంలో ప్రతి రోజూ ఎదురవుతాయి. చివరకు దానవత్వం చేతిలో చిక్కిన సుందరి ఏం చేసింది? చీకటి చెత్తను ఉడ్చేస్తూ డ్యూటీ ఎక్కిన సూరీడు, వ్యర్థాన్వేషణలో బయలుదేరిన సుందరికి పోలిక ఏమిటో 'వ్యర్థాన్వేషి'లో తెలుస్తుంది.
''మొక్కకు కాపు రాలేదని పత్తి మొక్కకు మందు కొట్టడం ఆపేస్తామా? అవలక్షణం ఉందని మడిసిని ఏరివేత్తామా? అందునా పేనాలకే పెమాదం ఉన్నప్పుడు. ఏమో! నేనయితే సూత్తా ఊరుకో లేను''. ఇది సాంబశివుడు మామయ్య చెప్పిన మానవతా పాఠం. ప్రవాహంగా సాగిన కథనంతో సాంబశివుడి 'శివతాండవం'తో కథ మరో మెట్టుకు చేరుతుంది.
పారిశుధ్య కార్మికురాలి మనుమరాలికి డెంగ్యూ వస్తే ఆసుపత్రి ఖర్చులకు కూడా సాయపడని శానిటరీ ఇన్సెక్టర్, సూపర్ వైజర్ల ప్రవర్తనతో ఇబ్బందులు పడి సామాజికవేత్త నాగరాజు సాయంతో గండం గట్టెక్కుతుంది. కొద్ది రోజులకే శానిటరీ ఇన్సెక్టర్ కొడుక్కి అదే డెంగ్యూ జ్వరం వస్తుంది. అప్పుడు ఇదే కార్మికురాలు సాయం అందిస్తుంది. ఈ కథకు 'చీపురు పుల్ల' అనే పేరు పెట్టడంలోనే రచయిత చతురత బయటపడుతుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఉపయోగించే కీమో థెరపీతో పలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియాలంటే 'కురుక్షేత్రం' కథ చదివి తీరాలి. ప్రత్యేకించి 'స్పర్శవేది' కథలు సంపుటిని 'కోవిడ్ వారియర్స్'కు అంకితం చేయడం సముచితంగా ఉంది. సామాజిక సేవే తన పరమావధిగా జీవించే ఆయన ఆ ఇతివృత్తాలనే కథలుగా మలుస్తూ నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- అనంతోజు మోహన్ కృష్ణ, 8897765417