Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహితీవేత్త, కవి, రచయిత డా.పత్తిపాక మోహన్‌కు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రావడం ఉభయ తెలుగు రాష్ట్రాల బాలసాహితీ లోకానికి ఒక స్ఫూర్తి, ఒక ఆనందకరమైన వార్త. ముఖ్యంగా తెలుగు బాల సాహిత్యోద్యమానికి ఊపిర్లు పోస్తున్న అనేకమంది బాల వికాసకారులకు శుభవార్తే. నిన్న మొన్నటి వరకు సాహిత్య ప్రక్రియల్లో శీతకన్నుతో చూడబడుతున్న బాల సాహిత్యం ఇటీవలి కాలం నుండి పునర్జీవమైంది. సారవంతమైంది. చైతన్యవంతమైంది. ఎంతోమంది కవులు బాల సాహిత్యం వైపు, బాలల్లో సాహిత్య సృజనల వైపు దారిమళ్లిస్తూ, సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు. అలా బాల సాహిత్యాన్ని భుజాన మోసుకొని ఇరవై అయిదేండ్లుగా నడుస్తున్న వాళ్ళలో డా.పత్తిపాక మోహన్ ఒకరు.
మోహన్ రాసిన బాలల తాత బాపూజీ బాలల గాంధీ గేయాలు, గేయ కథకు ఈ అరుదైన గుర్తింఫు దక్కింది. ఇది మోహన్ జాతిపిత గాంధీజీ 150వ జన్మదినోత్సవాల సంబురాలను పురస్కరించుకొని 2020 అక్టోబర్ 2న విడుదల చేశారు. కాగా స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా పుస్తకానికి మహోన్నతమైన పురస్కారం దక్కడం తెలంగాణా బాల సాహిత్యానికి, సాహిత్యకారులకు, సాహిత్య లోకానికి దక్కిన గౌరవం.
ఈ ఏడాది మోహన్ బాల సాహిత్య రజతోత్సవ సందర్భం. 1997లో బాల సాహిత్యం వైపు మళ్ళిన మోహన్ పత్రికల్లో రాసి, పుస్తకాలు తెచ్చినప్పటికీ 2007లో నేషనల్ బుక్ ట్రస్టులో సంపాదకులుగా చేరాక, బాల సాహిత్యంపైనే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. తెలుగు బాల సాహిత్యంపైన, అనువాదాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. భారతీయ బాల సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు జేసుకొని, బాలసాహిత్య రచనలు, దీని కార్యకలాపాలపై, ముఖ్యంగా కార్యశాలలు, కొత్త రచనల విస్తృతిపై ప్రత్యేకంగా పనిచేశారు. 15 ఏండ్లలో 11 పుస్తకాలు, 35 అనువాదాలు, 20 కి పైగా సంకలనాలు తెచ్చారు, దాదాపుగా 200కి పైగా బాల సాహిత్య కార్యశాలలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎంతో మంది బాలబాలికల్ని బాల సాహిత్య రచయితలుగా తీర్చి దిద్దడమే కాకుండా, ఎంతోమంది సాహిత్య కారులు బాల సాహిత్య రచయితలుగా ఎదగడానికి స్ఫూర్తిని ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు.
తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య పురస్కారం మొదలుకుని కరీంనగర్ గ్రామీణ కళాజ్యోతి పురస్కారం, కరీంనగర్ జిల్లా యువజన పురస్కారం, 1997లో ఆంధ్ర ప్రదేశ్ తొలి యువ సాహిత్య విశిష్ట సాహిత్య పురస్కారం డా.వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం, ఇదే ఏడాదిలో డా.నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, మధురకవి మల్లవరపు జాన్ కవి సాహిత్య పురస్కారం, డా.చింతోజు బ్రహ్మయ్య బాలమణి బాల సాహిత్య వికాస పురస్కారం, రాజన్న-సిరిసిల్లా జిల్లా వేడుకల సాహిత్య పురస్కారం, 2018లో అంగల కుదురు సుందరాచారి సాహిత్య పురస్కారం, డా. తిరుమల శ్రీనివాసాచార్య సాహితీ పురస్కారం, బాల గోకులం వారి బాలనేస్తం పురస్కారం, 2019లో బాల బంధు కవిరావు బాల సాహిత్య పురస్కారం, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు జన్మదిన పురస్కారం, మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, బాల బంధు సమతారావు బాల సాహిత్య పురస్కారం, శకుంతలా జైని తొలి బాల సాహిత్య పురస్కారం, మైగిప్ట్ యువ సాహిత్య పురస్కారం, తెలంగాణా సాహిత్య కళా పీఠం వారి కాళోజీ బాలసాహిత్య పురస్కారాల్ని అందుకొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బాలల తాతా బాపూజీ బాలల పుస్తకం జాతిపిత మహత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాలను పురస్కరిం చుకొని సిరిసిల్లా- మారసం 63 వ పుస్తకంగా అచ్చులోకి తెచ్చారు. జాతీయ సమైక్యతకు, సమతా భావనలకు, జాతీయ సాంస్కృతిక విలువల పునరుద్ధరణకు ఒక చక్కటి బాటగా ఈ పుస్తక రచన నిలిచిందని చెప్పాలి. బాపూజీ చరిత్రను బాలల కోసం సచిత్రకంగా 68 పేజీలలో రాశారు. ఇందులో రెండు భాగాలుగా విభజించి రాశారు. ఒక గేయాలుగా, మరొకటి గేయకథగా తీర్చిదిద్దారు. ముఖ చిత్రాన్ని ప్రముఖ యువ చిత్రకారుడు దుండ్రపల్లి బాబు వేయగా, లోపలి చిత్రాలను ప్రముఖ చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ సందర్భోచితంగా వేశారు.
ఈ పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త, వదాన్యులు నిజాం వెంకటేశానికి అంకితం ఇచ్చారు. ఇందులో వీరు పది బాపూజీ గేయాలను 20 పేజీలలో వేశారు.
''అమరుల త్యాగాలన్నీ
సార్థకమై నిలిచిన రోజు
గాంధీ మంత్రం ఫలించి
స్వేచ్చ విరిసిన రోజు'' అని పంద్రాగస్టు గూర్చి అలతి అలతి పదాలలో బాలలకు అర్థమయ్యే రీతిలో రాశారు.
''ఈ విశాల విశ్వంలో/ ధృవతారవు గాంధీ తాత/ అస్తమించని సూర్యుడివి/ నువ్వేగా గాంధీతాత'' అంటూ గాంధీజీ దేశ స్వాతంత్య్ర సముపార్జనకు చేసిన కృషిని స్వాతంత్య్ర సారథి అనే గేయంలో తేట తెల్లంగా చెప్పారు.
''సత్యమునే పలకాలని/చాటించి చెప్పినావు/ ఆచరించి చూపించి/ ఆదర్శం అయ్యావు'' అని అదే నీ మార్గం అనే గేయంలో గాంధీజీ ఆశయాలను, ఆచరణలను చక్కగా విడమరిచి చెప్పారు. 41 పేజీలలో గాంధీజీ గేయకథను రసరమ్యంగా గానామృతంగా అల్లడం చూస్తే, బాల సాహిత్యం ఆబాల గోపాల సాహిత్యంగా వర్థిల్లుతుందనడానికి ఇంకేమి నిదర్శనం కావాలని అనిపిస్తుంది.
''వాయువ్య భారతాన/ ఉదయించెను భానుడు/ భరత జాతికే పితగా/ వెలిగిన అసమానుడు'' వంటివి గేయ కథల్లోని వాక్యాల కూర్పులో భావార్థాలే కాకుండా, శబ్ద, కవితా సౌందర్యాలు తొణికిసలాడుతాయి.
''మనిషిగనే పుట్టినాడు/ మనీషిగా మారినాడు/ స్వాతంత్య్రం సాధించి/చరితార్ఠుల చేరినాడు''... ఇందులోని పంక్తుల్లో నిసర్గ కవితా సౌందర్యంతో పాటుగా, బాపూజీ గూర్చి, ఆయన జీవిత చరిత్ర, స్వాతంత్రోద్యమ చరిత్ర గూర్చి గొప్పగా చెప్పడానికి వారి చరిత్రను ఎంతగా అధ్యయనం చేశారో కనిపిస్తుంది.
''వేసెను చెరగని ముద్రను/ శ్రవణ కుమారుని గాథ/ సత్యమహిమ తెలియజేసె/ సత్య హరిశ్చంద్ర గాథ'' అంటూ గాంధీజీ సన్మార్గాన్ని నడవడంలో ఆయనపై పడిన అపూర్వ పౌరాణిక కథల ప్రభావాలను డా.మోహన్ చెప్పడంలో కృతకృత్యులయ్యారు. భాషా పటిమ, అర్థవంతమైన భావం, శబ్ద పద ప్రయోగాలు ఈ పుస్తకంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.
''జన్మభూమి భరతధాత్రి/ దాస్య శృంఖలాలు అతనిని కదిలించగ తరలి మోపెనిచట కాలు''అంటూ గాంధీజీ స్వదేశాగామన కాంక్షను వెల్లడిస్తాడు. ''కొల్లాయిని గట్టెను/ చేత కర్ర బట్టెను/ గుండు పిలక రూపం/ గాంధి మార్చుకొనెను'' అని గాంధీజీ మారిన రూప వేషధారణ గూర్చి చక్కగా చెప్పడంలో మోహన్ రచనా పటిమ వెల్లడవుతుంది. ''నేటికి ఆ మహాత్ముడు/ ఈ నేల మీద పుట్టి/ నూటా యాభై యేండ్లు/ గడిచినాయి చిత్రంగా'' అంటూ గాంధీజీ 150 వ జన్మదినోత్సవాల సంబురాల విశిష్టతలను వెల్లడిస్తాడు.
ముగింపులో ఇలా చెబుతాడు ''తరతరాలకు ఈ స్ఫూర్తి/ కొనసాగాలని కోరుదాం/ జై అందాం అందరమూ/ బతికినన్ని నాళ్ళు'' అంటూ ఈ విశిష్ట సందర్భాన్న, ప్రత్యేకమైన సందేశాన్ని అర్థమయ్యేలా వివరిస్తాడు.
ఈ విశిష్ట రచన ద్వారా యివాళ్ళ ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడెమి బాల సాహిత్య పురస్కారం అందుకొన్న మోహన్ కు అభినందనలు.
- సంకేపల్లి నాగేంద్రశర్మ, 80748 26371