Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది బాల సాహిత్యమే. వేల ఏండ్ల కిందటి నుంచే తెలుగు నెలలో మౌఖికం ద్వారా బాల సాహిత్యం విలసిల్లింది. చాలామంది ప్రాచీన, ఆధునిక కవులు తమ బాల్యం నుండే రచనలు ప్రారంభించారు. పసి హృదయాలలో బాల సాహిత్యం ద్వారానే విజ్ఞాన బీజాలు మొలకెత్తుతాయి. భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. తద్వారా అనేక మంది పిల్లలు తమ ఊహాశక్తికి పదును పెడుతూ రచనలు చేయడం జరుగుతుంది. ఇది బాల సాహిత్యంలో విప్లవా త్మకమైన పరిణామం. ఇదో నూతన వరవడిగా భావించవచ్చు.
నేడు మన బడి పిల్లలు కవులుగా, రచయితలుగా పుస్తకాల రూపంలో అచ్చవుతున్నారు. బాల్యం నుండే బాల బాలికలలో బాల సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించినట్లయితే భవిష్యత్తులో మంచి నడవడిక కలిగిన పౌరులుగా ఎదుగుతా రనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకుగాను పాఠశాలలే బాల సాహిత్యానికి కేంద్ర బిందువులవ్వాలి. బడి అనే గుడిని కేంద్రంగా చేసుకొని బాల సాహిత్యం విస్తృతంగా సజన జరిగి తీరాలి. అందుకుగాను పాఠశాల గ్రంథాలయాలు, బాల సభలు, బాల కవి సమ్మేళనాలు ప్రముఖ పాత్ర వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో భాషాభిమానం పెరుగుతుంది. బాల సాహిత్యం రాస్తే ఏమొస్తది? అనే భావన ఇప్పటికీ సమాజంలో, చాలామంది ఉపాధ్యాయులలో నాటుకుని ఉంది. ఇది సరైన భావన కాదు. మంచి సమాజం రాణించాలన్నా, విలువలు గల వ్యక్తులుగా ఎదగాలన్నా బాల సాహిత్యం అందుకు ఎంతగానో దోహద పడుతుంది. బడినే కేంద్రంగా చేసుకొని, ఉపాధ్యాయుల మార్గ దర్శకత్వంలో కృషి జరిగినప్పుడే బాలసాహిత్యం వర్ధిల్లగలదు. అందుచేత పాఠశాలలే వేదికలుగా, పాఠశాల విద్యాకమిటీ, సాహిత్యోపాధ్యాయులు, భాషో పాధ్యాయులు, బాలసాహితీ వేత్తలు ముఖ్య భూమిక పోషించాలి.
బాల సాహిత్యంలో రోజురోజుకు పరిస్థితులు మారుతు న్నాయి. మూస పద్ధతిలో రాజులు, దెయ్యాలు, జంతువుల కథలను చెబితే వినే పరిస్థితుల్లో విద్యార్థులు లేరు. నేటి కొత్త తరం స్మార్ట్ తరంగా దూసుకొస్తుంది. వెనుకటి లాగా వెనుకటి కథలు చెబితే ఇప్పటి తరం పిల్లలు వినే స్థాయిలో ఉండరు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వచ్చినంక ''ఊ...'' కొట్టె కథలకు ప్రాధాన్యత తగ్గింది. పిల్లల ఆలోచన విధానము శరవేగంగా మారుతోంది. మరి ఇలాంటి పరిస్థితులలో బాలసాహిత్యం కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల కోసం పెద్దలు రాసే ఆలోచనా సరళి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల బాలికలలో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో నేటి తరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది. పిల్లల హదయాలను తాకే సాహిత్యాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నేటి బాలసాహీతీ వేత్తలపై ఉందని గ్రహించాలి. పెద్దవాళ్లలో కూడా పిల్లవాడు దాగి ఉంటాడని మనం భావించాలి. గతంలో కంటే ఇప్పుడు విస్తృత స్థాయిలో బాల సాహిత్యం బయటకు వస్తున్న మాట వాస్తవమే. పిల్లల ప్రపంచం చాలా పెద్దది. పిల్లల కోసం బాల సాహిత్యం ఎలా ఉండాలి? అని ఆలోచించాలి. పిల్లల తరగతి, వారి మానసిక, శారీరక పరిస్థితులు, అవగాహన స్థాయిలను పరిగణలోకి తీసుకుని వారికి జ్ఞానాన్ని పెంచే విధంగా రచనలు సాగాలి. పిల్లలు పాఠ్య పుస్తకా లకు పరిమితం కాకూడదు. తెలుగు బాల సాహిత్యంలో చక్రపాణిని ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ ధరతో చిన్న పుస్తకాలను ముద్రించి ఆ రోజుల్లో అమ్మేవాడు. నేటి జనరేషన్‌కు తగ్గ కథలు రాసే రచయితలు తక్కువగా ఉండడం కొంత బాధగానే అనిపిస్తుంది. అవార్డుల కోసమే, పేరు కోసమే రాసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని రాయడం కాకుండా, పెద్దల అభిప్రాయాలను పిల్లల మీద రుద్దుతున్నారనే విమర్శ కూడా లేకపోలేదు. దళితులు, స్త్రీల గురించే ఎక్కువగా రాస్తున్నారని, కనీసం పిల్లల గురించి ఆలోచించడం లేదని చాలా మంది బాధ వ్యక్తం చేస్తున్నారు. విద్య ధనార్జన కోసం, మార్కుల కోసం కాకుండా, విశాల భావన కోసం,బాల సాహిత్య వికాసం కోసం ఉండాలి. సమాజంలో బాల సాహిత్య విలువలు లేకపోవడం వల్లే పిల్లలు సంకుచిత భావాలకు లోనై అసాంఘిక శక్తులుగా మారుతు న్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా స్కూళ్లలో పిల్లలు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. కానీ అదే మన పాఠశాలల్లో అయితే చించుతారని కొన్నిచోట్ల గ్రంథాలయాల్లోని పుస్తకాలు పిల్లలకు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా పిల్లలకు కలగాలి. చివరకు చెడు ఓడిపోతుందని, ధర్మమే గెలుస్తుందన్న భావన రావాలి. ప్రతి పాఠశాలలో డిజిటల్ టీవీలు ఉన్నందున యాని మేషన్‌తో కూడిన బాలసాహిత్య ప్రక్రియలను ఆయా చానల్స్ ద్వారా పిల్లలకు చూపించగలగాలి. బాల సాహిత్యం వల్ల పిల్లలలో విలువలే కాకుండా, తార్కికశక్తి, ఊహాజనిత శక్తి, శ్రవణ శక్తి,పఠణ నైపుణ్యం కలుగుతాయి. నేటి తరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతలకు బాల సాహిత్యం ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది. ఇదంతా మాతృభాష ద్వారానే సాధ్య మని ప్రముఖ భాషావేత్త ''నోమ్ చోమ్ స్కీ'' చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.
ఇవ్వాల విద్యార్థులు నేర్చుకునే స్థాయి నుండి రాసే స్థాయికి ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు . అనేక పాఠశాలల నుండి పిల్లలు రాసిన వందల కొద్ది పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి. ఇది గొప్ప పరిణామంగా మనం భావించాలి. దీని వెనక ఎంతో మంది ఉపాధ్యాయుల కృషితో పాటు, బాల సాహితీవేత్తల కృషి దాగి ఉందని చెప్పొచ్చు. బాల సాహిత్య విషయానికి వస్తే దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదట మౌఖిక/ రాతపరం గా విభజన ఉన్నప్పటికీ, సాధారణంగా పిల్లల కోసం పెద్దలు రాసేది ఒకటైతే, రెండోది పిల్లలే తమ కోసం తామే రాసుకునేది.
బాలలపరంగా బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇతమిద్దంగా లెక్కించడం కష్టమే. రామా యణం, మహాభారత కాలంలో కూడా బాల సాహిత్య ప్రక్రియలు ఉన్నట్లు మనకు చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తుంది. పంచ తంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షిణ భారతదేశంలోని గోదావరి తీరాన శిష్యులకు బోధించాడని ఉంది. ఆ గోదావరి నది తీరం మన దగ్గరే ఉంది కాబట్టి బాల సాహిత్యం ఇక్కడే మొదటగా పుట్టిందని చెప్పవచ్చు. చరిత్రలో రుద్రమదేవి తన మనుమడైనా ప్రతాపరుద్రునికి బాల సాహిత్యం నేర్పించినందు వల్లనే గొప్ప రాజు అయ్యాడని ఆధారాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, బాల సాహిత్యాన్ని మొదట స్పృశించింది అమ్మ. తల్లే బాల సాహిత్య తొలి రూపకర్త. ఆమెనే బాల సాహిత్యాన్ని పలకరించింది. లాలి పాటలు, జోల పాటల ద్వారా తొట్టెలలో తమ పిల్లలకు చిలకరించింది. ఆ తర్వాత భాషావేత్తలు అనేక మంది బాల సాహిత్య రంగంలో కర్తలుగా, సేకర్తలుగా పని చేశారు. చందమామ, జాబిల్లి, బాలమిత్ర, బాల భారతం లాంటి పుస్తకాలు బాల సాహిత్యాన్ని పండించాయి. బాల సాహిత్య వికాసం కొరకు విశేషంగా కృషి చేశాయి. ఆకాశ వాణి కూడా ''బాలానందం'' పేరిట బాల సాహిత్యాన్ని పరిచయం చేసింది. అంతే కాకుండా బాలల అకాడమీ కూడా అద్భుతమైన కృషి కొనసాగించింది. అదేవిధంగా చాలా సంస్థలు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, ఉపాధ్యాయ లోకం పిల్లల అభ్యసన అభివృద్ధి కొరకు దోహదపడే బాల సాహిత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక నూతన పాఠ్య
పుస్తకాలలోనూ, హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ బాల సాహిత్యానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ బాల సాహిత్యం అను కున్నంత స్థాయిలో పిల్లలకు చేరువవుతలేదనే విమర్శ కూడా ఉంది. అందుకు పాఠశా లలు, ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా వ్యవహరిం చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
విద్యార్థులు రాసిన అంశాలను లేదా సేకరిం చిన అంశాలను ప్రదర్శింపజేయాలి. విద్యా ర్థులు రాసిన కథలు, కవితలు, గేయాలు, పద్యాలు, నాటికలు, చిత్రాలు, పుస్తక సమీక్షలు వంటి మొద లగు అంశాలను పత్రికలకు పంపడం గానీ, పుస్తక రూపంలో ముద్రితం చేయడం గానీ జరిగినప్పుడు విద్యార్థులు తమ రచనలను చూసి మురిసి పోతారు. మరింతగా ముందుకు వస్తారు. బాల సాహిత్యం అన్నప్పుడు భాష, భావం పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థుల్లో ఊహశక్తిని పెంపొందించాలి. వారికి పూర్తి స్వేచ్ఛ నిచ్చి, అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా విద్యార్థులు రాణిస్తారు.
పాఠశాలలో నిర్వహించే గ్రంథాలయ పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలి. చాలా పాఠశాలల్లో గ్రంథాలయ పుస్తకాలు నిర్వహణ సరిగా లేదనేది యదార్థం. విద్యార్థులకు పుస్తకాలు ఇస్తే చింపుతారునే భయం ఉంది. చాలామంది ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు అంశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. బాల సాహిత్యంతో మాకేమి సంబంధం అన్న భావనలో ఉన్నారు. అయితే ఆసక్తి గల ఉపాధ్యాయులున్న చోట గ్రంథాలయాల నిర్వహణ చక్కగా సాగుతోంది. నెలకొక సారి బాలసభ, బాలకవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించడం ద్వారా విద్యార్థులలో బాల సాహిత్య ప్రక్రియలపై అవగాహన పెరుగుతుంది. పాఠశాల వార్షిక సంచికలలో కూడా బాల సాహిత్య అంశాలను జోడించాలి.
బాల సాహిత్యం పరిఢవిల్లాలంటే సాహిత్యాభి మానులైన ఉపాధ్యాయులుంటే సరిపోదు. దానికి తోడు పాఠశాలలో ఇతర ఉపాధ్యాయుల సహకారం, ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. పాఠశాల గ్రంథాలయం లోని పుస్తకాలు వినియోగించే పద్ధతిలో పాఠశాల ఉండి తీరాలి. కాల నిర్ణయ పట్టికలో లైబ్రరీ పీరియడ్ కచ్చితంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు అమలు జరిగే విధంగా చూడాలి. పుస్తకాలచే పిల్లలను ఆస్వాదింప చేయాలి. ఆనందింపచేయాలి. సృజన దిశగా పాఠశాల నేపథ్యంగా కృషి జరగాలి. బాల సాహిత్య వికాసానికి బడులే ముఖ్యమైన తావులుగా మారాలి.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655