Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనం చిటికెన వేలు
పట్టుకొని నడుస్తూ
పాములు,తేళ్ళను
బొమ్మలను చేసి
ఆడుకుంటవు
ఉదయం
సాయంత్రాలను
మోకు ముస్తాదుగా చుట్టుకొని
నిలువెత్తు
నల్లనిరంగు రోడ్డుమీద
బతుకుబండిని
లాగుతుంటవు
వంకతాడు, దుబ్బతాడు
పొట్టితాడు, పొడుగుతాడని
పేర్లు పెట్టి పిలుసుకుంటూ
కన్నబిడ్డల లెక్క
ప్రేమగా చూసుకుంటవు
గొలలకు మెరెస్తూ
నీళ్ళు తాగినంత సులువుగా
కల్లు బొట్టుకు
ప్రాణం పోస్తవు
గీతకో కత్తి
ముంజలకో కత్తి
ఒక్కొక్క కత్తిని ఒడుపుగా
వాడుకుంటూ
దూదసొంటి తెల్లని కల్లు దీత్తవు
నురగలు కక్కే
ఆ తెల్లని నదిని
పటువలో పట్టుకొచ్చి
మండువదగ్గర కూర్చున్నోళ్ళ
మనసు గాయాలకు
మందు పూస్తవు
తాడు దిగంగనే
మోదుగాకులో,మర్రి ఆకులో
తెంపుకొచ్చి ఇచ్చి
కల్లు ఒంపుతూ
లోకాన్నంతా గిర్రున తిప్పే
చక్రమవుతవుజి
ఏ గశి
గొంతులకు పోకుండా
ఆకులతోనే బుచ్చ చేసి
ఒక్క నలుసు కానరాని
అచ్చమైన కల్లును
పట్లు పట్లుగా వంచుతవు
సమయానికి తిండి తినక
నల్లకట్టెబడి
ఎండనక, వాననక కల్లుగీసి
వాడిక పోసి
బొగ్గు గీతల్లోనే
రూపాలు లెక్కబెట్టుకుంటవు
కుండలిచ్చిన కుమ్మరన్నలో
కత్తులు సర్సిన కమ్మరన్నలో
పక్క బజారోళ్ళో
నీవు ఉండే బజారోళ్ళో
అడిగిందే తడవుగా
ముంజలు పట్టుకొచ్చి ఇచ్చి
వాళ్ళ మనసునంతా
నీ చుట్టూ తిరిగే
తుమ్మెదను చేస్తవు
రాత్రిపూట
తీయటి వడగల్లు పోసి
చుక్కలనే మరిపిస్తవు
కాయకష్టం చేసి
అందరాని లోతుల్లోకి
కూరుకుపోతూనే ఉన్నా
నువ్వు వేసే
ఒక్కో అడుగు తడబడుతూనే ఉన్నా
వడగాలులుజి
చుట్టు ముడుతున్నా
ముసిరిన మబ్బులవాన
ఓర్వనితనంతో మీద కురుస్తున్నా
చెట్టు చెట్టు ఎక్కి
వచ్చే రాకడ లేక
బతుకంతా కుక్కిన పేను లెక్కయిన
వాన దెబ్బకు
ఎంతమంది
తాటిపండు రాలిపడ్డట్టు పడ్డా
మరోచెట్టు పుట్టుకకోసం
మట్టలను చెలుగుతూనే ఉంటవు
- తండ హరీష్ గౌడ్
8978439551