Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంకెళ్ళలో బంధించబడి
యమ యాతనలు పడుతున్న
బానిసలకు ఒక్కసారిగా
స్వేచ్చా ప్రపంచంలోకి తలుపు తెరుచుకుంది
కాపలా దారులు సెల్ తలుపులు తెరచి మరీ
బయటకు వదిలారు
వాళ్ళు నిజంగా స్వేచ్ఛా ప్రపంచం లోకి వచ్చారా ?
జైలు గోడలు కొడితే కదా.
నిజమైన స్వేచ్ఛ
నిజం ఇస్తే లభించేది స్వేచ్ఛ కాదు. అది ఒకరి దయా భిక్ష కాదు. అది పోరాడి సాధించుకోవాల్సిన ఒక అపురూప విజయం. జైలు గోడలు బద్దలు కొడితే లభించే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ. ఆ జైలు ఏదయినా కావచ్చు గృహ హింస, రాజకీయ పోరాటం, ఆధిపత్య భావజలం, నిర్బంధం ఏదైనా ఉంటే ఏదైనా చేధించలేని గోడే. గోడలు ఉంటే అది జైలే. జైలును బద్దలు కొడితేనే అది స్వేచ్ఛ.
స్వేచ్ఛా స్వరూపాన్ని ఇంత సులువుగా, సరళంగా చెప్పిన కవి అతడు ఏదేశానికి చెందిన కవో చెపితే మీరు ఆశ్చర్య పోతారు. సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతరత్రా మనకు లభించే సమాచారం మేరకు ఆ దేశం ఆకలితో అజ్ఞానంతో బాధపడే అత్యంత దీనావస్థలో ఉన్న దేశం. ఆ దేశం గురించి మనకు ఏది తెలిసినా, అదంతా మనకు పరోక్ష అనుభవమే. పరోక్ష అనుభవాలు ఎప్పుడూ మనకు సత్య దర్శనం చేయించవు. కానీ మనం పరోక్ష అనుభవావాల ద్వారానే మనుషుల మీద, దేశాల మీద అభిప్రాయాలు ఏర్పరచుకుని వాటినే ప్రచారంలో పెట్టి వాటికీ లెజిటిమసీ కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఎప్పుడో సత్యం తెలిసినా ఉపయోగం ఉండదు. అలా చాలామంది మన దురభిప్రాయాలకు బలి అవుతారు.
ఇంతకూ ఆ కవి పేరు చెప్పలేదు కదూ. ఆ కవి Bewketu Seyoum. ఇథియోపియాకు చెందిన సమకాలీన కవి. వ్యంగ్యాన్ని, అధిక్షేపాన్ని ఆయుధాలుగా మార్చుకుని తమ పాలకుల మీద విరుచుకుపడుతున్న వాడు. ఇప్పటి వరకూ మూడు కవిత్వ సంపుటులూ, కొన్ని కథలూ, మరికొన్ని మన గల్పికల లాంటి చిన్న అధిక్షేప రచనలు సి.డి. రూపంలో వెలువరించాడు. అన్ నేమ్‌డ్ హౌసెస్ 2000లో వచ్చిన అతడి ఆంగ్ల కవిత్వ సంపుటి. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అతడు తన మాతృ భాష అమ్హారిక్‌లో రాస్తే వాటిని ఆంగ్లంలోకి క్రిస్ బెకెట్, అలేము తెబ్జీ లాంటి వాళ్ళు తర్జుమా చేశారు. అతడి కవితల ఆంగ్ల అనువాదాలు చాలా మోడరన్ పోయెట్రీ ఇన్ ట్రాన్స్‌లేషన్‌లో వచ్చాయి.
ఇథియోపియా ఆకలితో బాధ పడే దేశం. కానీ ఆ బాధకి సహజ వనరులు లేకపోవడం కాదు. సంపద పంపిణీ సమానంగా జరగకపోవడం. సంపద కొద్ది మంది దగ్గరే పోగు పడటం. ఇది సహజంగా అన్ని దేశాలలో జరిగేదే. ఈ అసమాన పంపిణీ మీద ప్రపంచవ్యాప్తంగా చాలామంది చాలా కవితలు రాశారు. కానీ Bewketu Seyoum రాసిన ఈ కవిత చూడండి.
కొవ్వును అన్వేషిస్తూ
బక్క చిక్కి, చర్మం ఎముకలకు అంటుకుని, జీవచ్ఛవాలుగా,
ఉన్న కొన్ని ఎముకల గూళ్ళు
తమ దేశ లో కొవ్వు ఎక్కడికి పారిపోయిందో
అని వెతకడం మొదలుపెట్టాయి
ప్రతి పర్వతాన్ని, ప్రతి గాలి తరగనూ
రాయినీ, రప్పనూ,
భూమిలోని ప్రతి అణువునూ
ఆకాశంలోని ప్రతి అంగుళాన్ని
గాలించి, విసిగి వేసారాయి
చివరకు వాటికి తెలిసింది
కొవ్వు ఒకే ఒక్క మనిషి
బొజ్జలో పేరుకు పోయిందని
ఇన్ సెర్చ్ ఆఫ్ ఫాట్ పేరుతో క్రిస్ బెకెట్ అనువదించిన ఈ కవిత సమకాలీన ఇథియోపియా సామాజిక వ్యవస్థ మీద ఒక పెద్ద చురక. ఇథియోపియా ఒక ప్రతీక, ఒక సంకేతం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక మహబూబ్ నగరు, ఒక అనంతపురం, ఒక శ్రీకాకుళం కూడా ఇథియోపియాలా బాధపడుతున్న ప్రాంతాలే. కానీ ఆ ప్రాంతాల నుంచి ప్రశ్నించే ఒక్క గొంతూ లేకపోవడమే సమకాలీన విషాదం
ఇథియోపియా కవులకు విశ్వాసం ఎక్కువ. Bewketu Seyoum ఈ కవిత చూడండి.
మేఘాలను చుంబించడానికి
పర్వతాలను అధిరోహించను
చిరునవ్వును వెలిగించడానికి
హరివిల్లులోని మెరుపును
దొంగిలించను
ఆకాశ పక్షి రెక్కలను అరువు అడగను
స్వేచ్ఛగా విహరించడానికి
నేను శిఖరం అధిరోహించాలనుకుంటే
శిఖరమే
నా పాదాల చెంతకు దిగి వస్తుంది
ఈ ఆత్మ విశ్వాసమే Bewketu Seyoum ను ఇథియోపియాలో అగ్రశ్రేణి కవిగా నిలిపింది
అతడివే మరి కొన్ని కవితలు
1
పారిపోతావా? ఎక్కడికి
అతడికి ఆమె కేవలం
ఒక స్త్రీ మాత్రమే కాదు
ఆమె తన శరీరంలో నక్షత్రాలను
నింపుకుంది
ఈ పధ్వీతలం
ఆమె ఆత్మలో కుదురుకుంది
అతడు జీవితాంతం ఆమె నుండి పరుగెత్తినా
ఆమె నుండి ఎక్కడికీ పోలేడు
2
ఏ గమ్యమూ చేర్చని రహదారి
హడావిడిగా ఉన్నట్టు కనిపించే వాళ్ళు
త్వరగా వెళ్లాలని చూసే వాళ్ళు
మంచి కారు నడిపే వాళ్ళు
డిజైనర్ షూస్ వేసుకున్న వాళ్ళు
నగ పాదాలతో నడిచేవాళ్ళు
ఈ మేధావులు, నిరక్షరాస్యులు అందరూ
పై నుండి కిందవరకూ రద్దీగా ఉన్న
రహదారి పైకీ కిందకూ నడుస్తున్నారు
చూడండి వాళ్లెలా ముందుకూ వెనక్కూ నడుస్తున్నారో
వెళ్ళేప్పటికీ తమ గమ్యం చేరలేరు
3
మూర్ఖుడి ప్రేమ
అతడికి
ఆమె కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు
ఆమె శరీరంలో నక్షత్రాలు
నిలిపి ఉంచుకుంది
ఆమె ఆత్మలో ఈ భూదేవి
తన జీవితమంతా పరుగెత్తినా
అతడు ఆమెను చేరుకోలేడు
4
నిషేధం
పొగ తాగుట నిషేధం
ఈల వేయుట నిషేధం
తొంగి చూడటం నిషేధం
ఈ గోడ మొత్తం నిషేధాలతో
తయారైంది
ఏది నిజం ?
నా క్కాస్త అధికారమూ
ఒక చిన్న గోడా ఉంటే
నేనీ నినాదాన్ని రాస్తాను
నిషేధాలు ఇక్కడ నిషేధం
Bewketu Seyoum ఇథియోపియాలో చాలా పేరున్న కవి. అడ్డిస్ ఆబాబా యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్న Bewketu Seyoum గొజ్జం, దగ్గర ఉన్న మంకుసలో పెరిగాడు. తండ్రి ఇంగ్లీష్ టీచర్ కాగా తల్లి సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చినది. క్రైస్తవ మతాచారాలను తూచ తప్పక పాటించే ఆధ్యాత్మికురాలు. తన Bewketu Seyoum మొదటి కవిత్వ సంకలనమ్ ''మనుషులు లేని ఇళ్ళు'' 2002లో వచ్చింది. ఆ తరువాత మూడు సార్లు పునర్ముద్రణ పొందినది. వాక్ స్వాతంత్య్రము, రాజకీయ అసమ్మతిని ప్రకటించే అవకాశమూ అతి తక్కువగా వుండే ఇథియోపియా సామాజిక, రాజకీయ సతిగతులను ప్రకటించే Bewketu Seyoum కవిత్వం సూటిగా, పదునుగా ఉంటూనే కొంత వ్యంగ్యాన్ని, మరికొంత హాస్యాన్ని లోపల ఇముడ్చుకుంటుంది. మన తమిళం లాగే Bewketu Seyoum రాసే అమ్హారిక్ భాష కూడా శబ్ద ప్రధానం కావడంతో Bewketu Seyoum రాసే కవిత్వం లో లయ,శబ్దం అనువాదానికి లొంగని విధం గా ఉంటాయి
''I think satire doesn’t fit well into my works. I am fond of melancholic humor. One evening I encountered a shabbily dressed guy rummaging through a garbage can in one of the streets of Addis. I came closer and asked “what are you up to man?” “I am only looking for some leftover for supper” said the man sadly. Touched, I took out my wallet and offered him ten birr to buy bread. The guy took the money and made his way to the nearby shop. Soon, he returned with a candle and a match and went back to the garbage can to look for some leftover. This is a kind of stuff I like to include in my work.''
ఇది ఒక ప్రశ్నకు Bewketu Seyoum చెప్పిన జవాబు. Melancholic Hummor తన కవిత్వ లక్షణం అని అతడు చెప్పకనే చెపుతున్నాడు. సమకాలీన కవిత్వ ప్రపంచంలో అతడిని భిన్నంగా నిలబెడుతున్నది అదే Bewketu Seyoum కవిత్వం చదవడం ఒక మంచి అనుభవం. మీరూ చదవండి. అమెజాన్‌లో పుస్తకాలు వున్నాయి.
- వంశీకృష్ణ
9573427422