Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజమైన మార్క్సిస్ట్‌లకు విశ్వంలో వున్న ప్రతిదీ పరిశీలనార్హం. రాఘవ శర్మ పుస్తకం గురించి విన్నాక ఆసక్తి కలిగింది! ఒక మార్క్సిస్ట్ ప్రేమికుడికి తిరుమలగిరుల్లో యేం దొరుకుతుంది అనే సందేహాస్ప దులకు సైతం ఆయన పుస్తకం ఒక కళాత్మక అనుభూతిని మిగుల్చుతుంది. తిరుమలేశుడి గురించో, కోట్ల భక్తులు అనునిత్యం దర్శించే ''పుణ్య'' క్షేత్రాల గురించో కాకుండా (వీటి గురించి ఈ దేశంలో తెలియని వారెవ్వరు?) శేషాచలగిరుల్లో, లోయల్లో, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాతి పొరల్లో సుడులు తిరిగి ముడులు వేసుకున్న అవక్షేప శిలా శైథల్యాల లోయల్లో నేరుగా దిగి ఒక జియాలజిస్ట్ క్యూరియాసిటీతో అసలు సిసలైన దర్శనీయ ప్రదేశాల్ని ఒక దృశ్య కావ్యంగా మలచారు.
తిరుమల దృశ్య కావ్యంలో భక్తులు పరమ శ్రద్ధతో వెతుక్కునే బ్రహ్మోత్సవాలో, మాడ వీధుల్లో వూరేగింపులో, పవళింపు సేవల దృశ్యాలో ఇందులో ఎక్కడా లేవు! సర్వాంతర్యామి తాలూకూ ఆనవాళ్లు కూడా ఎక్కడా కనరానే లేదు! భక్తి రస ప్రవాహాలు మచ్చుకు లేవు! భక్తుడు తాను సృజించుకున్న భగవంతుని ముందు తనని తాను పిపీలికంగా భావించుకుంటూ వినమ్రు డౌతాడు. సజీవంగా వున్న అనంత ప్రవృతిముందు ప్రవృతి పరిశీలకుడు అప్రతిభుడౌతాడు. ఇది నూరు పాళ్లూ ''తిరుమల'' కావ్యమే, కానీ ''తిరుమలేశు''ని వూసులేని ''తిరుమల'' కావ్యం.
సెలయేళ్ల గలగలా రావాలూ, సేద తీర్చే చలువరాళ్ల ఆరామాలూ, నింగినంటే ఎర్ర చందనాల వృక్ష రాజాలూ, వైవిధ్యమైన ప్రాణికోటి జీవన రాగాలూ ఒకటేమిటి అనంతమైన భూమి కోటిపై విలసిల్లే సమస్త జీవధార ఈ కొండ కోనల నడుమ విరాజిల్లుతోందన్నట్టు ఆ పర్వత సానువుల్లో మనని నడిపిస్తూ ''అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని'' మరిపించే మరో లోకంలోకి తీసుకెళతారు. సెలయేటి పరవళ్ళు, నెలకోన వెన్నెల్లో గిల్లి తీగలపై వుయ్యాల సంబరాలు, తలకోన వెంటే దివి నుండి భువికి అనంత ఉల్కాపాతంలా జారే గుంజన జలపాతం, అడుగడుగునా పొంచి వుండే గండాలు, బ్రహ్మ గుండాలూ, విష్ణు గుండాలు, సేద తీర్చే అరిమాను బండలు, ఎఱ్ఱొడ్ల మడుగులూ, గుర్రప్ప కొండలూ, 270 అడుగుల ఎత్తు నుండి వెన్నెల్లా జీరాడే తల కోన జలపాతపు హోరు, చిరు మాను చెట్లూ, అల్లిబిల్లిగా అల్లుకుపోయన అల్లి తీవలూ, నల్లబలుసలూ, అనంతమైన ప్రకృతిశోభ నిజంగా హృదయాన్ని రాగ రంజితం చేస్తాయి.
అంతే కాదు పరిశోధకుడిగా ఇంగువ కార్తికేయశర్మ సాహసం గురించీ, గుడిమల్లం శివలింగం గురించీ, చంద్రగిరి దుర్గం గురించీ, లంకమల రాతి సితారపై జారుతూ వినిపించే జలస్వరాల గురించీ మనోహరంగా అక్షరబద్ధం చేశారు రాఘవశర్మ. ఇందులో వర్ణ చిత్రాలు సమ్మోహనంగా వున్నాయి.
ఎన్నిసార్లు ఎక్కి దిగారో, ఎంత శ్రమించారో, ఎంతగా సాహసించారో ఈ పుస్తకాన్ని చూసిన వారికి తప్పక అర్థం అవుతుంది అది నిజంగానే ఒక దృశ్య కావ్యమని! ఒక విలక్షణమైన అపురూప కానుక అనీ! భక్తులకోసం పుస్తకం ప్రత్యేకించి రాయకపోయినా యే కొండ కోనల్లో నెలవై ఉన్నాడని తాము నమ్ముతున్నారో ఆ తిరుమలగిరుల్లో తాము తెలుసుకోదగ్గ విశేషాలు తాము తెలుసుకోదగ్గ విషయాలు అనేకం వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాత వారికి అర్థం అవుతుంది. భౌగోళిక విశేషాల పట్లా, ట్రెక్కింగ్ పట్లా ఆసక్తి గలవారికి ఇదొక చక్కని మార్గదర్శి.
- వి. విజయకుమార్, 8555802596