Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పతానం పెట్టెను పక్కన పెట్టి చాపల తట్టను నెత్తిన పెట్టుకొని ఇంటిని మోసిన ఆడ ఏసు. అమ్మ అంతా అమ్మే తన ప్రపంచం అంతా అమ్మే... తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కుటుంబ బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్నది అమ్మ అని అంటాడు మన ప్రముఖ కవి మునాసు వెంకట్... పొద్దంతా అమ్మ లేకపోతే... చీకటి... సాయంత్రం దీపం పెట్టే సమయానికి అమ్మ ఇంటికి వస్తూ వెలుగును వెంటబెట్టుకొని వస్తుంది. ఇల్లంతా వెలుగుతో నిండిపోతుందనీ, అమ్మ గురించి రాసిన కవితలో, రాసాడు వెంకన్న. అమ్మ కళ్ళల్లో నీళ్ళు మసులుతున్నప్పుడు, బియ్యం తెచ్చిన మామ ఇప్పుడు గొంతులో పొరపోతున్నాడనీ హద్యంగా చెపుతాడు. పేగు తీగ లాగితే అమ్మ తోడ మొలచిన మొలక మేనమామ, అయితే అక్కలు, అన్నలు వదినలు అమ్మలై... అమ్మ వాసనతో పులకించే జన్మబంధాలుగా అభివర్ణించాడు వెంకన్న.
నాన్న వాళ్ళ ఊరు నల్గొండ పట్టణం. అమ్మది నకిరేకల్ దాటాకా కేతపల్లి దగ్గర ఒక పల్లెటూరు. బెస్త సామాజిక వర్గానికి చెందిన వెంకన్న, కవిత్వం చెరువు చేపల చుట్టే తిరుగు తుంది. బుద్దుడికి బోధి వక్షం కింద జ్ఞానోదయం అయినట్లే, వెంకన్నకు, పానగల్లు చెరువు,దగ్గర కవిగా అన్నప్రాసన జరిగింది.ఆయన అమ్మమ్మ ఊరు, అక్కడ మేనమామలు,ఆ గ్రామీణ వాతావరణం, అక్కడి తెలంగాణ భాష, యాస కూడా ఒక రకంగా కవిగా మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగపడింది. తెలంగాణ బాషలోనీ, జీవాన్ని, జీవితాన్ని బాగా ఆకళింపు చేసుకుని, తనదైన శైలిలో సాహితీ ప్రపంచంలో పంటలు పండిస్తున్నాడు.
అప్పట్లో, కాంచనపల్లి చిన వెంకట రామారావు, నోముల సత్యనారాయణ, బోయి జంగయ్య, ఎన్‌కే రామారావు, యాదగిరి రెడ్డిలు సభ్యులుగా నల్గొండ యువ రచయితల సంస్థ ఏర్పాటైంది. వాళ్ళు నిర్వహించే సాహిత్య సభలను, ఆసక్తితో,ఎక్కడో వెనక బెంచిలో కూర్చుని వినేవాడు, వెంకన్న.ఆ తరువాత నీలగిరి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో వచ్చిన బహువచనం అనే కవితా సంకలనంలో భాగమయ్యాడు. ఆ తరువాత కొంత మంది మిత్రులతో, గోసంగి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసి, మొగి, మేమే అనే కవితా సంకలనాలను వెలువరించారు.
మా గురువు గారిగా భావించే, ఉదయం సీనియర్ సబ్ ఎడిటర్, విఎస్‌ఆర్ ప్రభాకర్, అప్పట్లో నల్గొండను బేస్ చేసుకుని గొడ్డలి అనే పత్రికను నడిపేవారు. అప్పటి నుంచి అందరూ ఆయనను, గొడ్డలి ప్రభాకర్ అని పిలిచే వారు. ఆ పత్రికలో కూడా వెంకన్న వాస్తవి అనే కలం పేరుతో కవితలు, రాసేవాడు. అంతే కాకుండా నల్గొండ స్థానికంగా రెండు సాయంకాల దిన పత్రికలు వెలువడేవి. అవి ఒకటి జగన్మోహన్ రావు ప్రజాపోరాటం, అయితే రెండవది యూసఫ్ బాబు ప్రజాపోరు. ఈ రెండూ అప్పట్లో పోటాపోటీగా నడిచేవి.
ప్రజా పోరులో వెంకన్న అసోసియేషన్ ఎడిటర్‌గా పని చేసారు. గొడ్డలి ప్రభాకర్, విష్ణు భరద్వాజ్ (షాడో రాజు), మునాసు వెంకన్న (వాస్తవి కలం పేరుతో) ప్రజా పోరాటం, ప్రజా పోరు పత్రికల్లో, ఉదయం పేపర్‌లో దేవీప్రియ రాసినట్లు, రన్నింగ్ కామెంటరీ అనే శీర్షికతో కవితలు రాసేవారు. ఈ ముగ్గురు కలిసి రేపటి కవితలు అనే సంకలనాన్ని ప్రచురించారు.
మునాసు వెంకన్న కొంత కాలం హేతువాద నాస్తిక ఉద్యమంలో కూడా పనిచేసాడు... పులిజాల నళిన్ కుమార్, కొంతమంది ఇతర మిత్రులతో కలిసి హేతువాద నాస్తిక మిత్ర మండలి స్థాపించాడు.ఆ మండలి తరఫున లవణం హేమలత, కత్తి పద్మారావులను పిలిచి సమావేశాలు కూడా నిర్వహించాడు మన వెంకన్న.
మునాసు వెంకన్న స్వీయ రచనలలో ఎన, వర్జి, మెద, కవితా సంకలనాలు, తన కవితా సంకలనం ఇంగ్లీషు అనువాదానికి ఆస్ట్రేలియన్ కవి ముందు మాట రాయడం గమనార్హం. జన కవితా సంకలనం అముద్రితం.... కట్ చేస్తే.... మునాసు వెంకన్న మరో రచన చందమామలు కవితల సంకలనం రేపు సాయంత్రం నల్గొండలో ఆవిష్కరణ కానుంది. ఆ పుస్తకాన్ని ఆళ్ళగడపకు చెందిన మట్టిముద్రణ పబ్లిషింగ్ హౌస్ ముద్రించగా, భావనా బ్రహ్మం అందంగా డిజైన్ చేశారు. కార్టూనిస్ట్ శంకరన్న గీసిన మునాసు వెంకన్న కారికేచర్ కవర్ పేజి పుస్తకానికి కొత్తదనాన్ని తీసుకువచ్చింది. అంతే కాకుండా శంకరన్న పుస్తకం లోపల గీసిన ఇల్లుస్ట్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి.
మునాసు వెంకన్న కలం నుంచి ఇంకా అనేక కవితా సంకలనాలు రావాలనీ కోరుకుంటూ....
- ప్రమోద్ ఆవంచ, 7013272452