Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్తి పువ్వు చిట్లించినట్లు
బ్రతుకు భారము మోయలేక
నిగూఢంగా మనిషి
గూడు కట్టుకున్నాడు నాలోని మనిషి....
మిరప పండులా ఘాటుగాటుగా
భాష వేషం కట్టింది....
అకాల వర్షానికి
జారిపడ్డ మామిడికాయ
తలవంచినట్టు ఆత్మవిశ్వాసం కూడా
నిరాశతో అడుగుగలిపింది..
కన్నీరు, ఉప్పుసముద్రంగా
కంటి గడప దాటి దార కట్టింది.....
చేతులు, అచేతనంగా మారి
మట్టి పరిమళాలను మర్చిపోయింది....
పాదాలు పదును కోల్పోయి
అధమపాతంలోకి అడుగుపెట్టింది...
మనిషిలో మొలకెత్తిన
ఈ పరాయి మనిషి
పరాజయగీతం ఆలపిస్తుంటే....
ఉషోదయ కిరణం
కొత్తగా నన్ను మళ్లీ చిత్రించి
అక్షర ఆయుధాలను
పదాల పదాతి దళం
హక్కలు నేర్చుకున్న వాక్యాలను
కలగలిపి కణకణంలో
నిప్పుల కుంపటిని
నిలిపింది.
- సాదే సురేష్
9441692519