Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణం లేని మనుషులం
ఊపిరాడని అస్తిపంజరాలం
మాకంటూ అస్తిత్వం లేని
అనామకులం
వుట్టిమాటల ఊరించే పథకాలకే
గ్యాస్ బెలూన్‌లా ఉబ్బి తబ్బిబ్బవుతాం!
కాలే కడుపుకి కాసింత
కారం మెతుకులే..
పరవాన్నం అనుకుంటే
నోటిబుక్క ఇట్టే లాగేస్తారు..
ఆధార్ సదర్ అంటూ సవాలక్ష
ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే..
జవాబు లేని మా జనాలు
నోరు పిడుచుకట్టుకు పోయి
ఎక్కడ పడితే అక్కడే..
వేలి ముద్ర వేసేస్తారు..
తాతల ముత్తాతల జాగల
జాడ తెలియక ఉన్నఫలంగా
ఉన్నదంతా అప్పచెప్పి..
మొగులుకేసి బేలగా చూస్తారు..
ఆధునీకరణ రంగుల లోకం
చూయించి..
మా పుట్టిముంచి
మా చెమట చుక్కల మీద
నవ భారత నిర్మాణం
జరుపుతామంటారు..!!
మేము ఎప్పటికి ఇలాగే
వుండాలని తిరుపతి యెంకన్నా
హుండీ నిండా మా శ్రమను
రాసులుగా దానం చేస్తారు.
మేమిప్పుడు ఏలికల
చూపుడు యేలుకి..
సంతలో గొర్రెలం
వాళ్లు ఆడే ఆటలకి
డూడూ బసవన్నలం.!
అయినా సహనాన్నికి
పుడమి తల్లి వారసులం
కన్నెర్ర చేస్తే..
కణ కణ మండే
ఎర్రటి నిప్పు కణికలం..!!
- రవీందర్ కొండ
9848408612