Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాణీకి గతి లేదు
ఠికాణాకు గజం జాగా లేదు
నాలుగు గింజలు పండించేందుకు
గుంటెడు చెలుక ఉండదు!
జీవితకాలం జిల్లా పొలిమేరలు దాటని
జీవన వలయాలు!
కాలే కడుపులు నింపుకునేందుకు
కాని పనులు చేసే కాబూలీవాలాలు!
టోలీల పర్యవేక్షణలో రాటుదేలి
చోరీల శిక్షణతో కేటుగాళ్ళై
మూడో కంటికి తెలియకుండా
కీసలు కత్తిరించే సంత ముచ్చులు!
దొంగతనాలు చేస్తారు కాబట్టి
పనిదొరకదేమో?
పనిదొరకదు కాబట్టే
దొంగతనాలకు ఒడిగడతారేమో??
భారత్ బ్లేడనే బ్రహ్మాస్త్రంతో
బతుకు సమరాన్ని సాగిస్తారు!
ఆడా మగా మెడలమీది గొలుసులను
అతిలాఘవంగా తస్కరిస్తారు
ఒక్కొక్కప్పుడు.....
చెయ్యని నేరాలకు
శీఘ్ర శిక్షలనుభవిస్తారు
చేదు ఫలితాలను చవిచూస్తారు!
ఏ సంబంధమూ లేని
ఎదిగే మొక్కలు సైతం
పత్రహరితాన్ని కోల్పోయి
నిర్దాక్షిణ్యంగా నిర్జించబడతాయి!
అప్పుడు... ఇప్పుడు...ఎల్లప్పుడూ!
కోట్లకు కోట్లు కొల్లగొట్టే
స్కీములు స్కాములు స్వాములు...
నింపుకునే సొంత బొచ్చెలు!...
అధికారాన్ని
హస్తగతం చేసుకునేందుకు
అనేకానేక అడ్డదారులు!
నిచ్చెన మెట్ల
నీచ కుల వ్యవస్థ నీడన
నిమ్న జాతుల దీనావస్థలు!
నిబద్ధత లేని కవాటాల మాటున
ఒక్కో వర్గానికి
వివిధ బద్ధల కొలమానాలు!!
- కరిపె రాజ్‌కుమార్
8125144729