Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సాయంకాలపు నీడ -
మెత్తబడిన సూర్య కిరణాల అంచులు
ఇంకా పదునుగానే వున్నాయి
ప్రశాంతంగా తోట, తోటలోన బెంచి,
బెంచీ మీద నేను నాలోని ప్రశాంతతను వెదుక్కుంటూ
అది ధ్యానమూ కాదు, విశ్రాంతి కాదు
- ఒకలాంటి సందిగ్దత
మెళకువలోకి వచ్చిన మట్టి రేణువులు
హేమంతపు వర్ణాలతో
పాదాల దగ్గర అల్లరి చేయసాగాయి
సూరీడు ఆకాశంలో ఇంకాస్త కిందికి జారాడు,
నీడలు సాగి మరింతగా చీకటిని లాగసాగాయి
తోటలో ఆడుకునే పిల్లలు నీడల్ని
వెంటబడి తరుముతున్నారు
ఆ నీడల్లోని నా బాల్యం మసక
చీకటిలో కరిగిపోతున్నట్లు -
నేనింకా తోటలోని బెంచీనే ఆశ్రయించాను
సాయంకాలపు నీడను దాటి వచ్చిన నీరెండలో
గోధుమ రంగు పోగల్నితాగుతూ
నా యవ్వనం దర్శనమిచ్చింది.
అంతటా ప్రశాంతత - యుద్ధం ముగిశాక
ఆవరించిన బరువైన మౌనంలా
వాన వెలిశాక ఆవహించిన నిశ్శబ్దపు చిత్తడిలా..
తోట అంతటా ప్రశాంతత
నడిచి వచ్చిన తొవ్వ
ఎక్కడ మాయమౌతుందో తెలియదు!
తొవ్వలు మాట్లాడవు, నీడలు మాట్లాడవు
కొన్ని మతిమరుపు దుప్పట్లు కప్పుకొని ముసలివైపోతాయి
మరికొన్ని ఇప్పుడిప్పుడే బాల్యాన్ని చిగురిస్తుంటాయి
తోటలో వున్నంత సేపు నాతోనే నేను,
నాలోని నేనుతో,
నేనులోని ఒంటరితనంతో - సంభాషణలు
అన్నీ మౌనంగానే, శూన్యం లాంటి మౌనం,
నా లోలోపల శూన్యం
అక్కడ ప్రవహించే నదులు, హౌరెత్తించే సాగరాలు,
కొండలు, అడవులు,
ఆకాశం, అంతరిక్షం
సమస్త విశ్వంలా విస్తరించిన తోట ..
నాకనిపిస్తుంది, ఇప్పుడు కలల ముఖం మీద
కమ్ముకున్న ధూళిని తుడిపేసుకోవాలని !
- డా. రూప్ కుమార్ డబ్బీకార్, 99088 40186