Authorization
Mon Jan 19, 2015 06:51 pm
i
రెక్కలను తొడుక్కుని ఎగిరే
పిల్లలను చూస్తుంటే
లోకంలోని రెక్కలన్నీ పిల్లలే ధరించినట్టు
అవధుల్లేని ఆకాశమంతా పిల్లల రెక్కలే
ఎగురుతున్నట్టు
అందని అనంతమైన ఆకాశాన్ని
రెక్కల మీదేసుకుని భూమి వైపు
మోసుకొస్తున్నట్టు
రెక్కలను తొడుక్కుని ఎగిరే పిల్లలను
చూస్తుంటే
పిల్లలే రెక్కలుగా మారిపోయినట్టు
అనిపిస్తుంది
ii
రెక్కల్లేని పిల్లలను చూస్తుంటే
జాలేస్తుంది
తెగిన రెక్కలను ముందు వేసుకుని
ధీనంగా చూస్తూ
లేని రెక్కలను తడుముకుని
దిగులు దిగులౌతూ
రెక్కల్లేని పిల్లలలో రెక్కలను
వెతుక్కుంటున్నాను
iii
రెక్కలుంటేనేం లేకపోతేనేం
రెక్కలు తొడుక్కోవాలన్న ఆకాంక్ష ముందు
ఆకాశం లోబడుతుంది
భూమి లేలేతగా నవ్వుతుంది
ఊహ రెక్కలు తొడిగితే
రెక్కలూ ఊహల్లో ఊరేగుతాయి
- చంపావతి, 9676493680