Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా.. నేను బతికే ఉన్నాను
నవ్వుతూ కనిపిస్తాను పూసే ప్రతి పూవులో..
స్పృశిస్తాను నీ పాదాలను పొడిచే పొద్దులో..
నిత్యం నిన్ను చూస్తునే ఉన్నాను
అడవిచెట్ల ఆకులకళ్లతో..!
దుమికే జలపాతాన్ని జూడు..
విన్పిస్తాయి నా నవ్వుల గలగలలు
గుబురు కొమ్మల్లోని పిట్టల్ని జూడు..
వినిపిస్తాయి నా మాటల కువకువలు
పత్తి పొలం లాంటి ఆకాశంలోకి జూడు..
దోబూచులాడుతుంటాను మబ్బుల మాటున
గాలి కాదు తల్లీ నిను తాకేది నా ఊపిరే.. !
మోదుగుపూల వనాల్లో మెదిలే నీడను నేనే..
రెల్లుపూల వనాల్లో రేలారే పాటను నేనే..
చీకటి అడవుల్లో చిరుతపులి అడుగులు నావే..
అస్తమించలేదమ్మా.. రేపటి తూరుపు గర్భాన
పొద్దునై పురుడోసుకుంటున్నా ..!
తల్లీ.. పూసినపుడు నేనొక పూవునే
రాలిపోయినపుడు ఒక యుద్ధ వ్యూహాన్ని
శిరసెత్తిన నెత్తుటి జెండాని ..!!
- సిరికి స్వామినాయుడు
94940 10330