Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పగిలిన అద్దం అంచుల మెరుపును
వజ్రమని ఊరేగుతున్నపుడు
పునాదుల్లేని అంతస్తుల ఎత్తును
కొలుస్తూనే వున్న చోట
ఎవరి శ్రమాఫలాన్ని వారికి పంచడమే
సంక్షేమమై మెరుస్తుంది.
ఏడాదికో బడ్జెట్టూ, ఐదేళ్ళకో బాలెట్టూ
బహుకరించే మహాగ్రంధం ముందు
రోజువారీ బతుకులకు ఏ భరోసాలూ వుండవ్
గణాంక అభివృద్ధిని కాగితాల్లోనూ
వాస్తవాభివృద్ధిని
పెద్ద తలకాయల దొడ్లో దాచుతున్న చోట
వేల అప్పులకు అరదండాలూ
కోటాను కోట్లకు మాత్రం ఋణమాఫీలు
మతం జెండాలు అగ్ని కీలలవుతున్నపుడు
భ్రమలన్నింటినీ శుభ్రం చేసి
దేశాన్ని అప్రకటిత జైలులా మార్చుకుంటున్నాము.
విగ్రహాలు కట్టి మనుషుల్ని గాలికొదిలేసినా
ఏ ఓటూ రాజుకోదు.
స్వదేశీ మంత్రంలో ఎగిరే జెండా మొదలు
తొడిగే అంగీ వరకూ
శత్రుదేశపు ఉత్పత్తులే అయిన చోట
పాములే తప్ప నిచ్చెనల్లేని
వైకుంఠపాళీ బతుకులు
పుణ్య స్థలాలన్నీ న్యాయస్థానాల మెట్లను
పునీతం చేస్తూనే వున్నాయి.
సంస్కరణలన్నీ చిన్ననోట్ల నుంచి
పెద్దవిగా మారి అంతర్ధానమైపోయాయి.
మూతికి కట్టిన ముంతలు కుండలై వెక్కిరిస్తున్నాయి.
నాప్కిన్ అడిగిన వాళ్ళని దురాశాపరులుగా
కండోమ్ బుడగలు పేల్చి వెక్కిరిస్తాయి.
ఎప్పుడే తుపాకీ చూపు ఎవర్ని చూస్తుందో
ఎక్కడి కలలక్కడే గప్ చుప్.
భవిష్యత్తును గుప్పిట్లో పట్టుకుని
చీతాలాంటి యువత వలస పోతుంటే
జంతువుల్ని దిగుమతి చేసుకుని మురిసిపోతున్నాము
కుంభాకార అద్దంలో వుండాల్సింది
పుటాకారంలో కుదించుకుపోతున్నపుడు
కళ్ళారా నిద్రపోడానికో ఆయుధం ధరించాలి.
కిటికీల్లేని ఉక్కపోతల మధ్య చిక్కుకున్న దేశం
అసురసంధ్యలో వలసపిట్టయి ఎగిరిపోకముందే
చెరబట్టిన స్వేచ్ఛకు విముక్తి కలిగించాలి.
ఏ జెండా అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేది
ఏ గాలి పటమైనా పైకి ఎగిరేది
ఎదురుగాలి వీచినపుడే ..!
- ర్యాలి ప్రసాద్, 9494553425