Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్య సాహిత్యానికి కొన్ని శతాబ్దాల చరిత్ర వుంది. ఎంతో మంది కవులు పద్య నియమాల్ని పాటిస్తూనే, తమదైన శైలిలో పద్యాల్ని నిర్మించారు. నియతులతో కూడిన పద్య రచన అంత సులువు కాదు. యతిప్రాసలు, గణాలకు సంబంధించిన నియమాల్ని తప్పని సరిగా పాటిస్తూ తాము చెప్పదగిన విషయాల్ని ప్రకటించాలి. అయితే అర్థంతో పాటు లయను సాధించడానికి పద్య నియమాలు కవులకు ఉపకరణాలైనాయి. కాలక్రమేణా కవిత్వం ఎక్కువ మందికి అందుబాటులో వుండడానికి వీలుగా కవిత్వ రూపంలో మార్పు అవసరమని భావించిన వారు నియమాల్ని సడలీకరిస్తూ గణాలు కాకుండా మాత్రల నియతితో మాత్రా ఛందస్సును రూపొందించారు. నిర్మాణపరంగా ఈ ఛందస్సు సరళతరమైంది. ఈ రూపంలో కొంత కాలం రచనలు సాగాక మాత్రల ప్రమేయం కూడా లేకుండా మరింత స్వేచ్ఛగా కవిత్వాన్ని నిర్మించడానికి వెసలుబాటునిస్తూ వచన కవిత్వం రూపొందింది. ఇవాళ అది విస్తారంగా వాడుకలో వుంది.
వచన కవిత్వాన్ని రాయడానికి నిర్ద్థిష్టమైన నియమాలేవీ లేవని చెప్పినా అందులో కవిత్వం వుండి తీరాలన్న నియమం మాత్రం వుందని అనుకోవాలి. ఈ రూపంలో రాసే కవికి స్వేచ్ఛ అపారమైంది.
- వచన కవిత్వంలో యతిప్రాసల్ని పాటించనక్కర్లేదు.
- గణాలూ, మాత్రల నియమాలు లేవు.
- నిడివి పరిమితి లేదు
- పాద పరిమాణం (పొట్టి లేదా పొడుగు) ఇంత ఉండాలని లేదు.
- పాద విభజన విషయమై సూత్రాలు లేవు
ఇవేవీ వుండాల్సిన అవసరం లేదు కనుక ఈ రూపంలో కవిత్వాన్ని రాసే కవికి వున్న స్వేచ్ఛ అపారమైంది. ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ కవిత్వ ధర్మాన్ని పాటిస్తూ రాసినపుడే అది వచన కవిత్వమవుతుంది. కవిత్వ గుణాన్ని రంగరించకుండా రాస్తే అది వచనమవుతుంది కానీ వచన కవిత్వం కాదు.
రూప దార్యత కోసం, గాఢమైన భావ వ్యక్తీకరణ కోసం వచన కవిత్వ నిర్మితికి వున్న స్వేచ్ఛా, వెసలుబాటును కవులు ఎంతమేరకు వినియోగించుకుంటున్నారనేది చాలా ముఖ్య మైన అంశం. ఏ నియమాలూ లేవు కదా అని శ్రద్ధ పెట్టక ఏవో కొన్ని వాక్యాల్ని పాదాలుగా విడగొట్టి రాస్తే అది కవిత్వమై పోదు.
రచనకు భాష ముఖ్యమైన మూలకం. ఎప్పటికప్పుడు భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా ఎవరూ పటిష్ఠమైన రచన చేయలేరు. ఈ జ్ఞానాన్ని పుస్తకాల నుంచే కాక ప్రజా బాహుళ్యం నుంచీ పొందొచ్చు. వచన కవిత్వమే కదా భాషా దోషాల పట్టింపు ఎందుకు అనే భావన సరైంది కాదు. ''శబ్దం'' అనే మాటను ''శబ్ధం''గా రాయడం దోషమే. అట్లాగే ఏ శబ్దాన్ని వాడ దల్చుకున్నా దాని వాడకం సరియైనదేనా అని చూసుకోవడం అవసరమే.
ఏ శబ్దాన్నయినా ఉపయోగించే ముందు దాని నిర్దిష్టమైన అర్థాన్ని తెలుసు కోవాలి. అట్లా కాక కొన్ని శబ్దాలు వినసొంపుగా వుంటాయని వాటి అర్థాలు తెలియకపోయినా వాడటం అభిలషణీయం కాదు.
తెలుగు, సంస్కృత పదాల్ని కలిపి సమాసం చేస్తే అది దుష్ట సమాసం అవుతుంది. రచనల్లో దుష్ట సమాసాల వాడకం కూడదనేది ఒక వ్యాకరణ నియమం. అయితే దుష్ట సమాసాలు అయినా కొన్ని పదబంధాలు వాడుక వల్ల భాషలో ఇప్పటికే స్థిరపడి పోయాయి. కవి కూడా ఎక్కడో ఓ చోట, ఎప్పుడో ఒకప్పుడు తన రచనలో వాడే పద సమూహంలో ఒక అవసరంగా ఓ దుష్ట సమాసాన్ని వాడితే దాన్ని కవి స్వేచ్ఛలో భాగంగా తీసుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో వచన కవిత్వంలో దుష్ట సమాసాల వాడకం బహుళంగా కనపడుతున్నది. ఉంటే ఏమవుతుంది? వాటిని వాడకూడదని ఎక్కడున్నది? అని వాదించొచ్చు. వాటి వాడకం ఎక్కువగా వుంటే భాషా సౌందర్యం చెదురుతుందని నా అభిప్రాయం.
పద్య కవికి అవసరమైనట్లే, వచన కవిత్వం రాసే కవికీ భాషా సంపత్తి చాలా అవసరం. కొన్ని శబ్దాలకు నానార్థాలు వుంటాయి. వాటిని సమర్థంగా వాడడం ద్వారా రచనకు అదనపు పుష్టిని చేకూర్చవచ్చు.
శబ్దాన్వయం, వాక్యాన్వయం అనేవి పద్య సాహిత్యానికే కాదు, వచన కవిత్వానికీ అత్యవసరం. అన్వయం లేని ఒక్క వాక్యం చేర్పు వల్ల ఒక మంచి రచన కొంతో, మొత్తానికో బలహీనమై పోవొచ్చు. ప్రతీకల ఎంపికలోనూ, పదచిత్రాల కూర్పులోనూ అన్వయం పాటిస్తే వాటి ఔపయోగికతకు సార్థకత వుంటుంది. అన్వయ రాహిత్యం వల్ల భావ ప్రసార కాంతి మసక బారుతుంది. దాని వల్ల పాఠకుడు క్లేశానికి గురయే ప్రమాదముంది.
వచన కవిత్వంలో పాదాల్ని ఎక్కడ విరవాలి అనే విషయమై నియమాలేవీ లేవు కానీ ఎట్లా విరిస్తే భావ ప్రసారం సులువవుతుందో, ప్రకాశవంతమవుతుందో కవి తనకు తాను యోచనతో నిర్ణయించుకోవడం మంచిది. పేరాలుగా వచన కవిత్వాన్ని రాసే ప్రయోగాన్ని కొందరు కవులు సమర్థ వంతంగా చేసారు.
వచన కవిత్వంలో ఇన్ని వర్ణనలూ, ఇన్ని శబ్దాలంకారాలూ, ఇన్ని అర్థాలంకారాలు వుండి తీరాలనే నియమం లేదు. నిరలంకారంగా గొప్ప రచనల్ని చేసి మెప్పించిన వారూ ఉన్నారు. అయితే అలంకారాల జ్ఞానం వున్న కవికి అది అదనపు శక్తి అవుతుంది. నియమమేమీ లేదు కదా అని రచన నిండా అలంకారాలను గుప్పిస్తే, అది సొగసునివ్వక పోగా, ఎబ్బెట్టు అయ్యే ప్రమాదం వుంది.
అయితే కేవలం భాషా మూలకాలతోనే, నిర్మాణ శ్రద్ధతోనే గొప్ప రచన చేయొచ్చని కాదు. అదొక పార్శ్వం. తాను ఎంచుకున్న వస్తువు గురించి, దాని పరిధి గురించీ లోతైన అవగాహన కవికి అత్యవసరం.
కవి ప్రయోగశీలి. ప్రయోగాల్ని చేసే క్రమంలో ఏ నియమాలు అవసరమో తేల్చుకునే స్వేచ్ఛ కవిదే. కవి చేసే ఏ ప్రయోగం రచనకు శక్తినిచ్చిందో విమర్శకులూ, పాఠకులూ నిర్ణయిస్తారు.
తమ వైవిధ్య పూరితమైన రచనలతో ఎందరో కవులు వచన కవిత్వాన్ని సంపద్వంతం చేసారు. చేస్తున్నారు. వాళ్ళ నుంచి స్ఫూర్తిని పొందుతూ కొత్త కవులు తమదైన మార్గాన్ని దూపొందించుకుంటూ వస్తు శిల్పాల నిర్వహణలో తగు శ్రద్ధ పెట్టి కవిత్వం రాస్తే, వచన కవిత్వం మరింత పరిపుష్టం అయే అవకాశం వుంది.
ఏటేటా 60 మేలైన కవితలతో నా సంపాదకత్వంలో ఒక సంకలనాన్ని రూపొందించాలని 2015లో సంకల్పించాను. ఆ పరంపరలో వస్తున్న ఏడవ సంకలనం ఇది. నా పరిధిలో, అవగాహనలో ఉత్తమంగా భావించిన 60 కవితలతో దీన్ని రూపొందించాను. ఎప్పుడూ చెప్పినట్టే, ఇదే సర్వ సమగ్ర సంకలనం అని నేను భావించడం లేదు. కవిత్వ ప్రేమికుడిగా ఏటేటా నేను చేస్తున్న ఒక ప్రయత్నం మాత్రమే. ఈ సంకలనం కూర్పు మీద సలహాలనూ, సూచనలనూ అందజేయాల్సిందిగా కవులనూ, విమర్శకులనూ, కవిత్వ పాఠకులనూ కోరుతున్నాను.
- దర్భశయనం శ్రీనివాసాచార్య