Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కింశుకః అంటే సంస్కృత భాషలో మోదుగు పువ్వు అని అర్థం. ఈ పువ్వు చిలుక ముక్కు ఆకారంలో ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చిందని అని చెబుతారు. మరి పేరులోనే విశేషాన్ని కలిగిన ఈ పువ్వు, లేత కాషాయ రంగులో చూడటానికి ఇంకా మనోహరంగా కనిపిస్తుంది. హోలీ పండుగ రోజు బంజారాలు ఈ పూల నుంచి తయారు చేసిన రంగును ఒకరి మీద ఒకరు చల్లుకుని పండుగ చేసుకుంటారు. ఇలా ఈ పువ్వు బంజారాల సంస్కృతిలో భాగం అయింది. తెలుగు రాష్ట్రాల గిరిజన తెగల్లో బంజారా తెగ ఒకటి. వీరినే సుగాలీలని లంబాడీలని అంటారు. ఈ తెగ సంస్కృతి సాంప్రదాయాలలో మిగిలిన గిరిజన తెగలతో వైవిధ్యం కలిగి ఉంది. తండాలలో వీరి సమూహ జీవనం వీరి ప్రత్యేకతను కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. జొన్న రొట్టె, అద్దాల రంగుల వస్త్రాలు, పచ్చబొట్లు, శ్వేత శరీర వర్ణం, వెండి ఆభరణాలు, బంజారా భాష (గోర్ బోలి) వీరి విలక్షణతకు చిహ్నాలు. వీరి భాష, ఆహారమూ, ఆహార్యమూ భిన్నమైనది. తెలుగు సాహిత్యంలో అనేక వాదాలు బలంగా తమ వాదాన్ని సాహిత్యంలో ప్రతిబింభించాయి. గిరిజనుల సంస్కృతి సాహిత్యంపై వచ్చిన సాహిత్యం చాలా తక్కువ. చింతా దీక్షితులు ''సుగాలీ కుటుంబం'' తెలుగు కథా సాహిత్యంలో బంజారాల జీవితాన్ని చిత్రించిన గొప్ప కథ. ఇటీవల కాలంలో సమ్మెట ఉమాదేవి, ఆచార్య సూర్య ధనంజయ్, రమేష్ కార్తిక్ నాయక్ వంటి కథకులు లంబాడీల జీవితాన్ని తమ రచనల్లో ప్రకటిస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో గిరిజన తెగలలో ఒకటైన బంజారా రచయితలతో పాటు బంజారేతర రచయితలు వారి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే వీరి జీవితాలను చిత్రిస్తూ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ప్రధాన సంపాదకునిగా, ఆచార్య సూర్య ధనంజయ్, రమేష్ కార్తీక్ నాయక్‌ల సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 'కేసులా' మొట్టమొదటి బంజారా బృహత్ కథా సంకలనం.
బంజారాలే కాక బంజారేతరులు రాసిన సుమారు 55 కథలు ఈ సంకలనంలో చోటు సంపాదించుకున్నాయి. ఈ కేసులా కథా సంకలనంలో ఒక్కో కథ తెలుగు బంజారాల జీవితాన్ని ఆవిష్కరిస్తూ వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిచయం చేస్తాయి. భిన్న దృక్పథాలతో, వస్తు వైవిధ్యం కథల్లో నిండి ఉంది. బంజారాల జీవితాన్ని భిన్న కోణాల్లో కథకులు ఆవిష్కరించారు. 'కేసులా' అంటే బంజారా భాషలో మోదుగు పువ్వు. బంజారాల గురువైన సంత్ సేవాలాల్ కేసులాను మానవ జీవితానికి ప్రతీకగా భావించారు. ఎందుకంటే ''జ్వలించే వేసవి మంటల్లో కూడా కాంతివంతంగా ప్రకాశిస్తుంది మోదుగచెట్టు'' అని సేవలాల్ బోధించారు. ఈ కేసులా నేపథ్యంగా ఆచార్య సూర్య ధనుంజరు ''కేసులా'' అనే కథలో మద్యానికి బానిసై భర్త చనిపోవడంతో కుటుంబ భారాన్ని మోయాల్సి రావడంతో సోనీ అనే బంజారా స్త్రీ పడే వ్యథనూ, ఆమె ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా 'కేసులా' పువ్వు ఎలా స్ఫూర్తినిచ్చిందో తెలిపే కథ హృద్యంగా సాగింది. కృష్ణ గుగులోత్ ''బుజ్జీ'' కథలో లక్పతి అనే పదమూడేండ్ల బాలుడికీ, తాను పెంచుకున్న గొర్రెపోతు మధ్య గల అనుబంధాన్ని కరుణ రసాత్మకంగా చిత్రించారు. ఈ కథలో బంజారాల జీవ కారుణ్య దృష్టి గోచరిస్తుంది. సమ్మెట ఉమాదేవి రాసిన బొడ్రాయి కథలో కేవళ్యా అనే మహిళ దస్మా అనే అమాయక మహిళను మంత్రగాడి బారి నుంచి ఎట్లా రక్షించిందో తెలుపుతూనే, మూఢ విశ్వాసాల వలన వారు పడే అవస్థలను, బంజారా స్త్రీలకు పుట్టింటిపై ఉండే మమకారాన్ని చాటిచెబుతూ వారి జీవితాన్ని చిత్రించే ప్రయత్నం జరిగింది. బంజారాలు జరుపుకునే సీత్లా పండుగ (సప్తమాతృకల) విశేషాల సమాహారం బానోత్ భరత్ ''సీత్లా కర్రెచ'' కథ. ''చైతన్యం'' అనే కథలో తిరునగరి దేవకీదేవి, బంజారాలలో ఉన్నత స్థాయికి చేరి, వాళ్ళ తెగ అభ్యున్నతిని ఆకాంక్షించే సోనీ అనే విశ్రాంత ఉద్యోగిని పడే తపనను అక్షరబద్దం చేశారు. తమ పండుగలన్నీ మళ్ళీ పూర్వ వైభవంతో జరుపుకో వాలనే కాంక్షను ప్రకటిస్తూ, పార్టీలకతీతంగా సాంస్కృతిక పరమైన ''ఏకీకరణ'' బంజారాలలో కలగాలని రాజారాం నాయక్ ''పండగ వచ్చింది'' లో కనిపిస్తుంది. బంజారాల ఆహారపుటలవాట్లను తెలిపుతూ, రోజూ సెనగపిండి కూరనే బంజారాలు చేసుకోవడానికి గల నేపథ్యాన్ని మంత్రి శ్రీనివాస్ 'పిట్లో' కథలో తెలుపుతారు. బంజారేతర సమాజంలో కొంత మందికి బంజారాల పట్ల గల ఏహ్యాభావాన్ని, అపోహలను ''ముగ్గురక్కల'' కథలో లిఖిత్ కుమార్ గోదా పట్టి చూపించారు. రమేష్ కార్తిక్ ''ఢావ్లో'' కథ బంజారా పెండ్లి కూతురు పుట్టింటిని విడిచి అత్త వారింటికి వెళ్లే సందర్భంలో ఆమె పాడే విషాదగీతాల సంస్కృతిని విశదీకరించే క్రమం పఠితల గుండెను తడి చేస్తుంది. కె.వి మన్‌ప్రీతమ్ ''దేవ తారలు'' కథలో సమాజంలోని దోపిడి వ్యవస్థ వల్ల దేవ్నాయక్ అనే బంజారా వ్యక్తి కుటుంబ జీవితం అల ్లకల్లోలం అయిపోయిన రీతి తెలియ జేస్తుంది. ''పిడుగు'' కథలో డాక్టర్ ఎం దేవేంద్ర మేఘి పాత్ర ద్వారా బంజారా స్త్రీల ఆదర్శవంత మైన మరో కోణాన్ని ప్రకటించే ప్రయత్నం జరి గింది. వేంపల్లి గంగాధర్ ''ఆ యమ్మి లేదు'' రాయలసీమ ప్రాంత బంజారాల దుస్థితిని కండ్లకు కడుతుంది. ఆంధ్రా, తెలంగాణ సరి హద్దు ప్రాంతాల బంజా రాల వలస బతుకు జీవన చిత్రాన్ని కవిని ఆలూరి 'వాళ్ళ బతుకులు' కథలో వివరించన వైనం కంట నీరు పెట్టిస్తుంది. బహుశా వేణుగోపాల్ ''కిరాయి'' కథలో అనే బంజారా వృద్ధురాలి దీనమైన పరిస్థితిని, ఆమె పంచిన ఆప్యాయతను కండ్లకు కడుతూ ధనం కంటే మానవత్వం ఉన్నతమైనదని సందేశమిస్తోంది.
రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర మూడు ప్రాంతా లకు చెందిన కథకులు తమదైన భిన్న నేపధ్యంలో రాసిన కథలు కూడా ఈ సంకలనంలో చోటు చేసు కోవడం మరో ప్రత్యేకత. తెలుగు ప్రాంతాల బంజారాల సమగ్ర సంస్కృతి సాంప్రదాయాలు సాధకబాధకాలు ఈ కథాసంకలనం ప్రతిబింబిస్తుంది. ఇవేకాక గూండ్ల వెంకట నారాయణ ''తండా పిల్ల,''. నాగిల్ల రమేష్ ''ఉడుము'', శిల్మా నాయక్ ''అడ్డకులీలు'', హుమాయన్ సంఘీర్ ''దేవ్లా నాయక్'' కథలు భిన్న కోణాల్లో బంజారా జీవితాలపై కాంతిని ప్రసరించాయి. ఇంకా ఇక్కడ ఉదహరిం చని మరెన్నో ఉత్తమ కథలు ఉన్నాయి ఈ కథా సంకలనంలో.
మొత్తంగా ఈ కథల్లో బంజారాలు వారి సాంస్కృతిక సామాజిక అభ్యున్నతిని కాంక్షిస్తూనే దానికి మార్గంగా సాంస్కృతిక మూలాలను సంరక్షిసూ ''ఏకీకరణ'' కావడ మనే దృక్పథం కనిపిస్తుంది. దానితో పాటు బంజారేతర సమాజం వారి పట్ల ఎలాంటి అనుబంధాన్ని, దృష్టి కోణాన్ని కలిగి ఉన్నారో, యథార్థ అనుభవం నుంచి చిత్రించిన కథలివి. బంజారాల భాషా సాంస్కృతిక సామాజిక అస్తిత్వాన్ని బలంగా చాటుతు న్నాయి ఈ కథలు. ఈ యాభైఐదు కథలు బంజారాల సాంస్కృతిక వైవిధ్యము, జీవన పోరాటం దర్శింప జేస్తాయి. తండాల్లోకి వెళ్లి వారి జీవన సౌందర్యాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. వారిపై సమగ్రమైన దృష్టి కోణాన్ని పాఠకులకు అందించే ''విజ్ఞాన సర్వస్వం''గా ఈ కథా సంకలనం నిలుస్తుంది. గిరిజన సంస్కృతి పరిశోధకులకు ఒక ఆకర గ్రంథంగా కాగలిగిన విషయసామగ్రి ఉంది ఈ కథాసంకలనం నిండా. కథలు చదివాక మోదుగపూల వనంలో విహరించిన అనుభూతి కలుగుతుంది అనడం అత్యుక్తి కాదు.
- సూరపల్లి జయ ప్రకాశ్ నారాయణ
8977197335