Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అట్లాసులో గీతల్ని చెరిపేస్తూ
లోహవిహంగాల్తో
లోకాన్ని జయించామన్న ధీమా
పిచ్చుకని చూడనంత వరకే.
దాని రెక్కల ఆవేశం
ధైర్యానికి
కావాల్సినంత సరంజామా.
వీసా విలాసాల
అలవాట్లు నేర్పుతున్న దేశాలు
మేధోవలసలకు
గేట్లు తెరుస్తున్నాయి.
అయినా
వారి మీద ఎందుకు
గరం అవ్వడం?
మన బంగారం మంచిదైతే.
రాబడి రేసులో
పారేసుకున్న నిన్నటి పావలా
ఎవరికి కావాలి?
అయినవాళ్లకీ, ఆనందానికీ
దూరమవుతూ
ఆదాయం ఒక్కటే
కొలమానమౌతున్నది.
ఆయుర్దాయం
బహుమానం కదా!
- కుడికాల వంశీధర్ 9885201600